Telugu Global
Cinema & Entertainment

పండగ చేస్కో మూవీ రివ్యూ

రేటింగ్: 2.75/5   ‘చూసిందే చూడబుద్దవుతోందా?’ అలాగయితే ఈ సినిమా ఖచ్చితంగా చూడబుద్దవుతుంది! చూసి చూసి అలవాటు పడ్డ కథే! చూసి చూసి అలవాటుపడ్డ పరిచయంవున్న పాత్రలే! అవే ఫైటింగులు! అవే పాటలు! అవే లోకేషన్లు! అవే ప్రేమలూ.. అవే పగలూ.. అవే ప్రతీకారాలూ.. అవే అవస్తలూ.. అవే పరిష్కారాలూ.. అవే నాటకాలూ..  అవే పంచులూ.. అవే కాస్ట్యూమ్స్ .. కాకపొతే కాస్ట్యూమ్స్ మార్చినట్టు ఒకటీ అరా పాత్రలు అటూయిటూ అవుతాయి తప్పితే ఇంచీ కూడా తేడా […]

పండగ చేస్కో మూవీ రివ్యూ
X

రేటింగ్: 2.75/5

‘చూసిందే చూడబుద్దవుతోందా?’ అలాగయితే ఈ సినిమా ఖచ్చితంగా చూడబుద్దవుతుంది! చూసి చూసి అలవాటు పడ్డ కథే! చూసి చూసి అలవాటుపడ్డ పరిచయంవున్న పాత్రలే! అవే ఫైటింగులు! అవే పాటలు! అవే లోకేషన్లు! అవే ప్రేమలూ.. అవే పగలూ.. అవే ప్రతీకారాలూ.. అవే అవస్తలూ.. అవే పరిష్కారాలూ.. అవే నాటకాలూ.. అవే పంచులూ.. అవే కాస్ట్యూమ్స్ .. కాకపొతే కాస్ట్యూమ్స్ మార్చినట్టు ఒకటీ అరా పాత్రలు అటూయిటూ అవుతాయి తప్పితే ఇంచీ కూడా తేడా రాదు! ఒక్క టికెట్టు మీద ఇదివరకే చూసిన సినిమాలన్నీ రివిజిన్ చేసుకుంటూ ఎంచక్కా చూడొచ్చు! ‘అలవాటు’కు అలవాటు పడ్డవారికి ఈ సినిమా విందు భోజనమే! ఎందుకంటే పాడగా పాడగా రాగం రంజితమైనట్టు వుంటుంది. తీసిందే మళ్ళీ మళ్ళీ తీసినా- ‘కమర్షియల్ ఫార్ములా’ అంటూ ఏ పేరు పెట్టినా- అలవాటైన ఈ సినిమా రంజిప చేసేలా తీసి మరీ ప్రేక్షకుల్ని “పండగ చేస్కో” మన్నారు. పండగలు ఎన్నో వస్తాయి పోతాయి. ఈ పండగా అంతే!

ఆనాటి “డీ” నుండి ఈనాటి ‘పండగచేస్కో’ వరకూ ఎనిమిదేళ్ళుగా ఒకే తరగతిలో వుండిపోయి మంచి మార్కులు తెచ్చుకుంటున్న కోనా వెంకట్ ఈసారీ అదే తరగతిలో వుండిపోయారే తప్ప పై తరగతికి ప్రమోట్ కాలేదు. కొత్త కథా రాయలేదు. తన ‘ఒరవడి’/కాపీరైటింగ్ ని తానే రాసుకుంటూవున్నారు, ప్రేక్షకులు విసుగెత్తినా! ఫస్టాఫ్ ఎలా తిరిగినా తిరిగి యింట్లోకి అందరినీ తీసుకొచ్చి సెకండాఫ్ డ్రామా ఆడారు. ప్రేక్షకులు ఊహించిందే జరుగుతూవుంటుంది గనక ప్రేక్షకుడూ సంతృప్తి పడొచ్చు. చూసిందే చూసే ఓపికలేక తిట్టుకోవచ్చు.. అది ప్రేక్షకుల అభిరుచి మీదా సహన సౌశీల్యాల మీదా ఆధారపడి వుంటుంది. ఎప్పటిలాగే ఫస్టాఫ్ ఫారిన్లో మొదలౌతుంది. పాడి ఆడే హీరో కార్తీక్ (రామ్) ఫోర్చుగల్ కార్పోరేట్ కంపనీ ఎండి. వుద్యోగస్తులైన తండ్రి(రావ్ రమేష్), చెల్లి, బావల తోక కూడా కట్ చెయ్యడానికి వెనుకాడడు. వెనుకేసుకొచ్చే తల్లి సస్వతి(పవిత్ర లోకేష్). ఇండియాలో హీరోయిన్ దివ్య(రకుల్ ప్రీతి సింగ్) గ్రీన్ ఆర్మీ యాక్టివిస్ట్. ఆమె వల్ల కంపనీ మూతపడి ఇండియాకి వస్తాడు కార్తిక్. అప్పటికే ౩౦౦ కోట్లు ఆస్తి రావడం కోసం ఇండియా అబ్బాయిని పెళ్ళాడాలని కార్తీక్ తో డీల్ కం నిశ్చితార్ధం చేసుకున్న స్వీటి (సోనాల్ చౌహాన్). అయితే దివ్య ప్రేమలో పడతాడు కార్తీక్. కంపనీ కోసమే తప్ప నిజం కాదనుకొనే దివ్య. మరోవేపు దివ్య తలిదండ్రులు విడిపోయి వుంటారు. వాళ్ళ గొడవలు పడలేక ఇంట్లోంచి పారిపోతుంది. వూర్లో మరో విలన్ గ్యాంగ్. గ్యాంగ్ నుండి దివ్యను కాపాడిన కార్తీక్. దివ్యతండ్రికి నచ్చి యింటికి అల్లుడువి కమ్మని అంటాడు. అదే కార్తీక్ కు కావలసింది. కార్తీక్ ఎవరో కాదు. సరస్వతి కొడుకే. ఆమె ప్రేమ పెళ్ళి చేసుకొని ఆయింటికి ద్రోహం చేసిందని అంతా భావిస్తూ వుంటారు. ప్రేమకు సాయపడ్డ సాయి రెడ్డి (సాయి కుమార్) చెల్లెళ్ళను దివ్య తండ్రీ చిన్నాన్నలు వదిలేస్తారు. ఆ కుటుంబాన్ని కార్తీక్ ఎలా కలిపాడు, దివ్యను ఎలా పెళ్ళాడాడు? యింకా స్వీటి పరిస్టితి ఏమయ్యింది? దివ్యను ప్రేమించిన రౌడీ గ్యాంగ్ లీడర్ (అభిమన్యు సింగ్) స్వీటీని ఎందుకు పెళ్ళాడాడు? స్వీటీని కామించిన వీకెండ్ వెంకటరావు (బ్రహ్మానందం) ఎవర్ని పెళ్ళాడాడు? ఇదంతా మిగతా కథ!

యునైటెడ్ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ మీద పరుచూరి కిరీటి నిర్మించిన ఈ చిత్రానికి కేమెరా సమీర్ రెడ్డి, ఎడిటింగ్ గౌతం రాజు ఎప్పటిలాగే తమ పనితనం చూపించారు. ఒకేపాటని వందలరకాలుగా ఇటు తిప్పి అటు తిప్పి బాణీలు కడుతున్న తమన్ తనమీద వున్న ముద్రని నిలుపుకున్నారు. మాటలు కూడా అందించిన కోన వెంకట్ కాస్త నవ్వించారు. స్క్రీన్ ప్లే దర్శకత్వం చేపట్టిన మలినేని గోపీచంద్ సేఫ్ గేమ్ ఆడడం వల్ల ఔటూ కాలేదు.. మంచి స్కోరూ సాధించలేదు!

First Published:  29 May 2015 12:19 PM IST
Next Story