గోరంత దీపం (కవిత)
ఆశలన్నీ అంతరించి, అట్టడుగు ఊబిలోకి ఒక్కసారిగా దిగిపోతున్న వేళ చేతికి ఏది దొరికినా అది ఆధారమే… మదిని మెదిలే ఆశయే ఆసరా అవుతుంది… నిరాశా నిస్పృహలలో ఉస్సురుస్సురనుచు వేసారిపోయి జీవితాశను కోల్పోయి అలమటించు అభాగ్యులకు ‘నేను నీకు ఉన్నాను సుమా’ అని దొరికే చేయూత అనన్య సామాన్యమైన, అసాధారణమైన ఆలంబనయే… ప్రాణం డస్సిపోయి, ప్రపంచానికి సెలవంటూ నిష్క్రమించే వేళ… ఒక్కసారి నీ బాధ్యతలను, బంధాలను గుర్తు చేసుకుంటే, ఆ క్షణాన్ని వాయిదా వేయగలిగితే… చిగురుటాశ పొటమరించి, నమ్మక […]
ఆశలన్నీ అంతరించి, అట్టడుగు ఊబిలోకి
ఒక్కసారిగా దిగిపోతున్న వేళ
చేతికి ఏది దొరికినా అది ఆధారమే…
మదిని మెదిలే ఆశయే ఆసరా అవుతుంది…
నిరాశా నిస్పృహలలో ఉస్సురుస్సురనుచు వేసారిపోయి
జీవితాశను కోల్పోయి అలమటించు అభాగ్యులకు
‘నేను నీకు ఉన్నాను సుమా’ అని దొరికే చేయూత
అనన్య సామాన్యమైన, అసాధారణమైన ఆలంబనయే…
ప్రాణం డస్సిపోయి, ప్రపంచానికి సెలవంటూ
నిష్క్రమించే వేళ… ఒక్కసారి నీ బాధ్యతలను, బంధాలను
గుర్తు చేసుకుంటే, ఆ క్షణాన్ని వాయిదా వేయగలిగితే…
చిగురుటాశ పొటమరించి, నమ్మక వృక్షం అంకురిస్తుంది…
నేస్తమా, లేచి చూడు,
నీ కన్నా దీనులెందరో మిత్రమా ఈ లోకాన,
నీ కృషితో వేచి చూడు…
నీదే ఈ జగమంతా తీయని భావి కాలాన…
ప్రేమ వైఫల్యమో, నిరుద్యోగమో నీ నిరాశకు కారణమా?
అడుగువేయి కృషీ, పట్టుదలలే నీ ఊతంగా…
ఆకులన్నీ రాలి బోసిపోయిన వనాలు ఎన్నైనా,
చిగురించి పూయవూ – వసంతం వరించగా రేపటి ఉదయాన!
– నండూరి సుందరీ నాగమణి