అదరగొట్టే ఎండలు... కలవరపెట్టే వానలు
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు అదరగొట్టే ఎండలు జనం ప్రాణాలు తీస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందల సంఖ్యలో జనం వడదెబ్బతో మృతి చెందారు. రోహిణి కార్తెలో రోకళ్లు పగలడమే కాదు ఈసారి రాళ్లు సైతం పగిలిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 50 డిగ్రీలకు అటూ ఇటూగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు తెలంగాణలో 340 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం […]
BY Pragnadhar Reddy28 May 2015 1:21 AM IST
X
Pragnadhar Reddy Updated On: 28 May 2015 6:46 AM IST
తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు అదరగొట్టే ఎండలు జనం ప్రాణాలు తీస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు, వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందల సంఖ్యలో జనం వడదెబ్బతో మృతి చెందారు. రోహిణి కార్తెలో రోకళ్లు పగలడమే కాదు ఈసారి రాళ్లు సైతం పగిలిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో 50 డిగ్రీలకు అటూ ఇటూగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బకు తెలంగాణలో 340 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అటు ఏపీలోనూ వడదెబ్బకు వందల సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు అదరగొట్టాయి. గడిచిన వారం రోజులుగా తెలంగాణలోని పది జిల్లాల్లో 42 డిగ్రీ సెల్సియస్ నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బుధవారం పలు ప్రాంతాల్లో వర్షాలు
మరోవైపు బుధవారం సాయంత్రం రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎండలతో ఉడికిపోతున్న రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం కాస్త చల్లబడింది. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి, ఖమ్మం జిల్లా ఇల్లందు, కరీంనగర్ జిల్లా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో భారీగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. గోపాల్ పేట (మం) తాడిపర్తిలతో రేకుల షెడ్లు కూలాయి. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. కొత్తకోటలో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడు ఇళ్లపై ఉన్న రేకులు కొట్టుకుపోయాయి. ఓ చెట్టు కారుపై కూలిపోయింది. కారులో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఇళ్లపై ఉన్న రేకులు కొట్టుకుపోగా రెండు ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. కేటీపీఎస్ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొంతకాలంగా తీవ్రమైన ఎండతో బాధ పడిన ప్రజలు వర్షంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు.
రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు…
మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ నెల 29 నుంచి ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మొత్తానికి ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత అధికంగానే ఉందని చెప్పాలి. అలాగే ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తుండటం జనానికి ఊరటనిస్తోంది.
Next Story