కృపుడు (For children)
అహల్య గౌతమి మహర్షిల కుమారుడు శరద్వంతుడు. పుట్టడమే బాణాలతో పుట్టాడనీ – ఘోరమైన తపస్సు చేసిఅస్త్రశస్త్రాలు సాధించాడనీ – ధనుర్విద్యలో తిరుగులేని వాడనీ చెపుతారు. ఆమాటే ఇంద్రుడూ విన్నాడు. తన పదవికి ప్రమాదం వస్తుందేమోనని ఎప్పట్లాగే భయపడ్డాడు. శరద్వంతుని తపోదీక్షను చెడగొట్టాలని భావించాడు. అందుకు జాలవతి అనే అప్సరసను పంపాడు. శరద్వంతునికి కోరిక కలిగింది. ఫలితమే ఒక మగ పిల్లాడు, ఒక ఆడపిల్ల పుట్టారు. అడవిలో అనాధలుగా ఉన్న ఆ పిల్లల్ని వేటకు వచ్చిన శంతన మహారాజు […]
అహల్య గౌతమి మహర్షిల కుమారుడు శరద్వంతుడు. పుట్టడమే బాణాలతో పుట్టాడనీ – ఘోరమైన తపస్సు చేసిఅస్త్రశస్త్రాలు సాధించాడనీ – ధనుర్విద్యలో తిరుగులేని వాడనీ చెపుతారు. ఆమాటే ఇంద్రుడూ విన్నాడు. తన పదవికి ప్రమాదం వస్తుందేమోనని ఎప్పట్లాగే భయపడ్డాడు. శరద్వంతుని తపోదీక్షను చెడగొట్టాలని భావించాడు. అందుకు జాలవతి అనే అప్సరసను పంపాడు. శరద్వంతునికి కోరిక కలిగింది. ఫలితమే ఒక మగ పిల్లాడు, ఒక ఆడపిల్ల పుట్టారు. అడవిలో అనాధలుగా ఉన్న ఆ పిల్లల్ని వేటకు వచ్చిన శంతన మహారాజు చూసాడు. జాలిపడ్డాడు. కృప అంటే కనికరం, దయ చూపాడు. అందుకనే మగపిల్లవాడికి కృపుడని, ఆడపిల్లకు కృపి అని పేరొచ్చింది. ప్రేమతో పెంచి పెద్ద చేసాడు. ఈ విషయం శరద్వంతునికి తెలిసి వచ్చాడు. తన వెంట తీసుకు వెళ్ళి కృపునికి ధనుర్విద్యలను నేర్పాడు. అస్త్ర శస్త్రాలను బోధించాడు. అలా అన్నింటా మేటి అయిన కృపుడు కృపా చార్యుడయ్యాడు!
కృపుని గొప్పతనం గురించి భీష్ముడికి తెలిసింది. హస్తినాపురానికి రమ్మని ఆహ్వానించాడు. కౌరవులకూ పాండవులకు విలువిద్యలు నేర్పమని అర్థించాడు. కృపాచార్యుడు అంగీకరించాడు. అలా కురుపాండవులకు తొలిగురువయ్యాడు.
కౌరవులు పాండవులకు చేసిన అన్యాయాన్ని కృపుడు గుర్తించాడు. కాని సమర్థించలేకపోయాడు. సమయాను కూలంగా చేసింది సరికాదని, నీతి తప్పవద్దని హితపు పలికేవాడు. అయితే తనకు తానుగా చెప్పేవాడు కాదు. భీష్ముడు లాంటి పెద్దలు చెప్పినప్పుడు తనూ చెప్పేవాడు. కాని దుర్యోధనుడు వినలేదు. పరిపాలకులైన భీష్మ ధృత రాష్ట్ర దుర్యోధనుల పంచన ఉండి వారి ఉప్పు తిన్నప్పుడు వారినే సమర్థించాలన్న న్యాయానికి కృపాచార్యుడు కట్టుబడి మెలిగాడు. కౌరవుల్ని సమర్థించాడు. సమాలోచనలూ జరిపాడు. అజ్ఞాత వాసంలో ఉన్న పాండవులను పట్టుకుంటే పని సులవవుతుందన్న సూత్రమూ చెప్పాడు. గో గ్రహణానికీ వెళ్ళాడు. అర్జునుని శక్తి యుక్తుల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.
కౌరవ పక్షము నిలిచిన భీష్ముని పక్షమే కృపాచార్యుడూ నిలిచాడు. యుద్ధం చేసాడు. మనకి మనం గొప్పలు పోవడానికి లేదని చెప్పాడు. పాండవుల బలమేమిటో దుర్యోధనునికి అర్థమయ్యేలా చెప్పాడు. కర్ణుని మరణానంతరం సంధి చేసుకోవడమే ఉత్తమమని దుర్యోధనునికి చెప్పాడు. చీకటి వేళ పాండవులను హతమారుస్తానని అశ్వత్థామ అంటే దుర్యోధనుడు సంబరపడ్డాడు. కాని అది సరికాదని కృపాచార్యుడు చెప్పాడు. కురుక్షేత్రయుద్ధంలో బిడ్డల్ని కోల్పోయిన ధృతరాష్టుణ్ని కృపాచార్యుడు ఓదార్చే ప్రయత్నం చేసాడు.
యుద్ధంలో సజీవంగా మిగిలిన కృపాచార్యుడు, ఆ తరువాత తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు!.
– బమ్మిడి జగదీశ్వరరావు