Telugu Global
Family

కదిలే కళ్ళు (Devotional)

పూర్వం ఒక రాజువుండేవాడు. అతను క్రూరుడు. ప్రజల్ని పీడించేవాడు. చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష విధించేవాడు. అతని పాలనలో ప్రజలు నరకయాతన పడ్డారు. అటువంటి రాజుపై పర రాజులు దండెత్తి అతని రాజ్యాన్ని ఆక్రమించారు. అతన్ని బంధించి, చిత్ర వధ చేసి చంపారు. అతని పాలన అంతం కావడంతో ప్రజలంతా పీడ విరగడయిందని ఊపిరి పీల్చుకున్నారు. అది జరిగి చాలా రోజులయింది. కానీ ప్రజలు అతని క్రూర కృత్యాలని గుర్తు తెచ్చుకుంటూ ఉండేవారు.             ఒక […]

పూర్వం ఒక రాజువుండేవాడు. అతను క్రూరుడు. ప్రజల్ని పీడించేవాడు. చిన్న తప్పుకు కూడా పెద్ద శిక్ష విధించేవాడు. అతని పాలనలో ప్రజలు నరకయాతన పడ్డారు. అటువంటి రాజుపై పర రాజులు దండెత్తి అతని రాజ్యాన్ని ఆక్రమించారు. అతన్ని బంధించి, చిత్ర వధ చేసి చంపారు. అతని పాలన అంతం కావడంతో ప్రజలంతా పీడ విరగడయిందని ఊపిరి పీల్చుకున్నారు. అది జరిగి చాలా రోజులయింది. కానీ ప్రజలు అతని క్రూర కృత్యాలని గుర్తు తెచ్చుకుంటూ ఉండేవారు.

ఒక స్థానిక పాలకుడు ఆ రాజు ఉన్నపుడు ప్రజల పక్షాన నిలిచి రాజును ఎదిరించాడు. రాజు అతనిపై దండెత్తి అతని కోటను ఆక్రమించుకున్నాడు. ప్రాణభయంతో అతను పారిపోయి పక్కరాజ్యాలలో దాక్కుని కొన్నేళ్ళు గడిపాడు. రాజు చనిపోయిన తరువాత మళ్ళీ తన ప్రాంతం పాలకుడుగా నియమింప బడ్డాడు.

స్థానిక పాలకుడికి తరచుగా ఒక కలవచ్చేది. ఆ కల అతన్ని కలత పెట్టేది. ఆ కల ఏమిటంటే క్రూరుడయిన రాజును పరరాజులు చంపి అతని కళేబరాన్ని పాతకుండా అలాగే వదిలి పెట్టి వెళ్ళారు. గాలికి, ఎండకు, వానకు అతని శరీరం శిథిలమయింది. అతని కళ్ళు మాత్రం కొన్నాళ్ళు పాటు అటూఇటూ కదులుతూ ఉండేవి.

ఈ భయానకమయిన కల రాజు కళ్ళ కదలికల్తో కంపరం పుట్టించేది. స్థానిక పాలకుడికి ఈ కల అర్థం బోధపడేది కాదు. ఎందర్నడిగినా ఎవరూ ఏమీ చెప్పలేక పోయారు. చివరికి దేశంలోని జ్యోతిష్కుల్ని, పండితుల్ని, వివేకవంతుల్ని ఆహ్వానించి ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరిముందు తన కల వివరించి దానికి అర్థం చెప్పమన్నాడు.

ఎందరో ఎన్నో రకాలుగా విశ్లేషించారు. రాజుకు అవేవీ సంతృప్తి కలిగించలేదు. చివరికి ఒక వివేకవంతుడు లేచి ఆ కల అంతరార్థం చెప్పాడు.

“రాజా! ఎందరో ఉత్తములు, మహానుభావులు ఈ మట్టిలో పుట్టారు. మట్టిలో కలిసిపోయారు. వాళ్ళ గుర్తులు కూడా ఈ భూమిలో లేవు. జీవితంతో సమాధానం పొందిన మనిషి ప్రశాంతంగా నిష్ర్కమిస్తాడు. ఆ క్రూరమయిన రాజు చనిపోయినా, అతని శరీరం శిథిలమయినా అతనిలో ఆశ చావలేదు, శత్రు రాజులు దండెత్తి తన రాజ్యాన్ని ఆక్రమించారని ఇప్పటికీ అతని కళ్ళు అటూఇటూ కదుల్తూ చూస్తున్నాయి” ఆ కలకు అర్థమది.

అందుకనే మనకు దేవుడిచ్చిన ఈ శరీరం ఉండగానే మనం మంచి పనులు చేయాలి. అందరి దగ్గరా మంచి వాడనిపించుకుంటే, మన మనసు, శరీరం కూడా నిర్మలంగా ఉంటాయి. నిర్మలంగా నిష్ర్కమిస్తాయి.

స్థానికపాలకుడు అతని మాటలకు సంతోషించి అతనికి అభివాదం చేశాడు.

– సౌభాగ్య

First Published:  26 May 2015 6:31 PM IST
Next Story