ద్రోణుడు (For children)
కౌరవులకూ పాండవులకూ గురువొక్కడే! అతడే ద్రోణాచార్యుడు. ధనుర్విద్యలందు ఆయనకు ఆయనేసాటి. తండ్రి భరద్వాజ మహర్షి దగ్గర వేద వేదాంగాలు నేర్చుకున్నాడు. అస్త్ర శస్త్ర విద్యలు సరేసరి. తండ్రి స్నేహితుడైన అగ్నివేశ్యుడైన ముని దగ్గర ఆగ్నేయాస్త్రం ఉపదేశం పొందాడు. అన్నీవున్నా కలిమిలేదు, లేమి తప్ప! ద్రోణుడు కృపాచార్యుని చెల్లెలైన కృపిని పెళ్ళాడాడు. అశ్వత్థామ అనే కొడుకునూ కన్నాడు. పేదరికాన్ని భరించలేక పరశురాముని దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే పరశురాముడు ఉన్న ధనమంతా దానం చేసేసాడు. మిగిలింది విద్యాధనమే. […]
కౌరవులకూ పాండవులకూ గురువొక్కడే! అతడే ద్రోణాచార్యుడు. ధనుర్విద్యలందు ఆయనకు ఆయనేసాటి. తండ్రి భరద్వాజ మహర్షి దగ్గర వేద వేదాంగాలు నేర్చుకున్నాడు. అస్త్ర శస్త్ర విద్యలు సరేసరి. తండ్రి స్నేహితుడైన అగ్నివేశ్యుడైన ముని దగ్గర ఆగ్నేయాస్త్రం ఉపదేశం పొందాడు. అన్నీవున్నా కలిమిలేదు, లేమి తప్ప!
ద్రోణుడు కృపాచార్యుని చెల్లెలైన కృపిని పెళ్ళాడాడు. అశ్వత్థామ అనే కొడుకునూ కన్నాడు. పేదరికాన్ని భరించలేక పరశురాముని దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే పరశురాముడు ఉన్న ధనమంతా దానం చేసేసాడు. మిగిలింది విద్యాధనమే. దివ్యాస్త్రాలను ద్రోణుడికి దానంగా ఉపదేశించాడు. అయితే దారిద్ర్యం తీరే దారి ద్రోణునికి కనిపించలేదు. అప్పుడు కలిసి విద్య నేర్చుకున్న చిన్ననాటి మిత్రుడు గుర్తుకు వచ్చాడు. పాంచాల దేశం వెళ్ళి తనని తాను గుర్తుచేసుకొని సహాయ పడమని అర్థించాడు. స్థాయి మరిచి స్నేహితుడుగా ద్రోణుడు ప్రవర్తించడం ద్రుపదుడికి నచ్చలేదు. అందుకే అవమానించి పంపాడు. బాధపడి వచ్చేసాడే కాని ద్రోణుని మనసులో సరైన సమయంలో సరైన జవాబు చెప్పాలనుకున్నాడు.
పిల్లలుగా వున్న పాండవులూ కౌరవులూ ఆడుకుంటూ ఉండగా బంతి నీళ్ళలో పడింది. ధర్మరాజు వేలి ఉంగరం కూడా. బాణం మీద బాణం వేసి బాణానికి బాణం గుచ్చేలా చేసి నీళ్ళలోని బంతినీ ఉంగరాన్నీ తీసి ఇచ్చాడు ద్రోణుడు. ఈ విషయం పిల్లల ద్వారా భీష్మునికి తెలిసింది. గుర్తించి గౌరవించి విద్య నేర్పమని అర్థించడంతో కౌరవ, పాండవులకు గురువయ్యాడు ద్రోణుడు. గురుదక్షిణగా ద్రుపదుణ్ని బంధించి తెమ్మని కోరాడు. కౌరవుల వల్ల కాలేదు. భీముడూ, అర్జునుడూ వెళ్ళి యుద్ధం చేసి మరీ ద్రుపదుణ్ని బందీగా తెచ్చి కానుకగా ఇచ్చాడు. ద్రోణుని పగ తీరింది. మందలించి అర్థ రాజ్యం ఇచ్చి వదిలేసాడు. ద్రుపదుడు అవమానంతో మహాయజ్ఞం చేసాడు. ద్రుష్టద్యుమ్నుడిని కన్నాడు. ద్రోణుని చంపేదివాడే!
ద్రోణునికి అర్జునుడు అత్యంత ప్రీతి పాత్రమయ్యాడు. అందుకనే నన్ను మించిన వీరుడుగా తయారు చేస్తానన్నాడు. ఏకలవ్యుడు ఎక్కడ మించి పోతాడోనని బొటన వేలుకోరి – అర్జునునికి అడ్డులేకుండా చేసాడు. పాండవులంటే ద్రోణునికి అభిమానం ఉంది. కాని దుర్యోధనుడు ప్రభువు. పైగా భీష్ముడు నేల కూలాక ఆ సేనాథిపతి స్థానం ద్రోణునికే ఇచ్చి గౌరవించాక కౌరవుల విజయమే కోరుకున్నాడు. ధర్మరాజుని చంపకుండా పట్టి తెచ్చి అప్పగిస్తానని – కోరిక తీరుస్తానని ధుర్యోధనునికి మాటయిచ్చాడు ద్రోణుడు.
కురుక్షేత్రం ముగియడానికి మూడు రోజుల ముందు ద్రోణుడు యుద్ధంలో తన శక్తిని చూపించేసరికి ఎవ్వరూ ముందు నిలవలేకపోయారు. ద్రుపదుడు, విరాట్ రాజు ద్రోణుని చేతిలో చనిపోయారు. ఎదురునిలవడం పాండవులకూ కష్టమయింది. ఎందుకంటే దుర్యోధనుడు ద్రోణుని పాండవ పక్షపాతిగా యుద్ధ భూమిలో అవమానించాడు. దాంతో ద్రోణుడు చెలరేగిపోయాడు. శ్రీకృష్ణుడది గమనించాడు. ఉపాయం చేసాడు. భీముడు “అశ్వత్థామ” అనే ఏనుగుని చంపి, “అశ్వత్థామా హతః…” అని అరిచాడు. ద్రోణుడు విన్నాడు. తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడా? నమ్మలేకపోయాడు. ధర్మరాజుని ధర్మ బద్దుడని అడిగాడు. ధర్మరాజు “అశ్వత్థామ హతం” అని అరిచి, మెల్లగా “కుంజరః కుంజరః” అన్నాడు. ద్రోణుడు తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడనుకొని కుప్పకూలిపోయాడు. ధనుర్భాణాలను వదిలేసాడు. అచేతనంగా ఉండిపోయాడు. అప్పుడు దుష్ట ద్యుమ్నుడు వచ్చి ద్రోణుని తలను ఖండించాడు. అధర్మ యుద్ధంలో అతిరథుడలా కన్నుమూసాడు.
గురువుగారి మరణానికి కౌరవులే కాదు, పాండవులూ దుఃఖించారు. కొంతసేపు యుద్ధాన్ని ఆపేసారు కూడా!
– బమ్మిడి జగదీశ్వరరావు