Telugu Global
Others

బ్యాంకు ఉద్యోగులకు పెరిగిన జీతాలు

బ్యాంకింగ్‌ ఉద్యోగులు, అధికారుల వేతనాలు 15 శాతం పెంచేందుకు ఇండియన్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) అంగీకరించింది. దీనికి సంబంధించి ఐబిఎ – ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బందితో పాటు పాత ప్రైవేట్‌ బ్యాంకులు, దేశంలోని కొన్ని విదేశీ బ్యాంకుల్లో పని చేస్తున్న దాదాపు 10 లక్షల మంది ప్రయోజనం పొందబోతున్నారు. కొత్త వేతన ఒప్పందం నవంబర్‌, 2012 నుంచి 2017 వరకు అమల్లో ఉంటుంది. వేతన […]

బ్యాంకు ఉద్యోగులకు పెరిగిన జీతాలు
X

బ్యాంకింగ్‌ ఉద్యోగులు, అధికారుల వేతనాలు 15 శాతం పెంచేందుకు ఇండియన్‌ బ్యాంకర్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) అంగీకరించింది. దీనికి సంబంధించి ఐబిఎ – ఉద్యోగ సంఘాల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బందితో పాటు పాత ప్రైవేట్‌ బ్యాంకులు, దేశంలోని కొన్ని విదేశీ బ్యాంకుల్లో పని చేస్తున్న దాదాపు 10 లక్షల మంది ప్రయోజనం పొందబోతున్నారు. కొత్త వేతన ఒప్పందం నవంబర్‌, 2012 నుంచి 2017 వరకు అమల్లో ఉంటుంది. వేతన సవరణ ఒప్పందం ప్రకారం ప్రస్తుతం రూ.14,500 – రూ.52,000 మధ్య ఉన్న అధికారుల పే స్కేలు రూ.23,700 – రూ.85,000కు పెరుగుతుంది. దీనికి తోడు మూల వేతనంపై డిఎతో పాటు 7.75 శాతం నుంచి 11 శాతం వరకు ప్రత్యేక అలవెన్స్‌ చెల్లిస్తారు. సాధారణ, నాన్‌ సబార్డినేట్‌ ఉద్యోగుల పే స్కేల్స్‌ని ప్రస్తుతం ఉన్న రూ.7,200 – రూ.19,300 నుంచి రూ.11,765 – రూ.31,540కి మార్చారు. సబార్డినేట్‌ ఉద్యోగుల పే స్కేల్‌ సైతం ప్రస్తుత రూ.5,850 – రూ.11,350 నుంచి రూ.9,560 – రూ.18,545కి పెంచారు. వీరికి కూడా మూల వేతనంపై డిఎతో పాటు 7.5 శాతం ప్రత్యేక అలవెన్స్‌ లభిస్తుంది. వేతన బకాయిలను సైతం ఈ నెలాఖరులోగా చెల్లించేందుకు ఐబిఎ అంగీకరించింది. జీతాల పెంపుతో పాటు ప్రతి నెల రెండు, నాలుగో శనివారాలను పూర్తి సెలవులుగా మార్చేందుకు సైతం ఐబిఎ అంగీకరించింది. ఇందుకు ఆర్‌బిఐ సైతం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిందని ఐబిఎ చైర్మన్‌ టి.ఎం.భాసిన్‌ చెప్పారు. ఈ వేతన ఒప్పందం వలన పిఎస్‌బిలపై ఏటా రూ.8,400 కోట్ల భారం పడబోతోంది. దీని వల్ల బ్యాంకుల లాభదాయకతపై ఎలాంటి ప్రభావం ఉండదని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. 2007 తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బందికి వేతన సవరణ జరగడం ఇదే మొదటి సారి. వేతన సవరణతో పాటు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సైతం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల నగదు రహిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పించేందుకు ఐబిఎ అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన వెంటనే కొత్త వేతన సవరణ, పని రోజులు అమల్లోకి వస్తాయి. ఇందుకు మూడు నుంచి నాలుగు వారాలు సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు

First Published:  26 May 2015 1:58 AM IST
Next Story