Telugu Global
POLITICAL ROUNDUP

కేజ్రీవాల్‌పై మీడియా కన్నెర్ర!

అయిన వారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో వడ్డిస్తారనేది ఒక సామెత. మీడియా ప్రతి వార్తనూ వండి వార్చేది ఇదే ధోరణిలో. తెలుగు మీడియా సంగతి చెప్పనే అక్కరలేదు.             తాము అభిమానించే పార్టీ బహిరంగ సభలు, వార్షికోత్సవాలు జరిగితే అవి ఎంత గొప్పగా జరిగాయో, ఎన్ని వేల వాహనాల్లో ఎన్ని లక్షల మంది వచ్చారో, నేల ఈనిందా అన్నట్లు రోడ్లు ఎలా జనాలతో కిటకిటలాడాయో, సమావేశాల్లో ఎలాంటి భోజనాలు వడ్డించారో కథలు, కథలుగా రాస్తారు. అదే తమ […]

కేజ్రీవాల్‌పై మీడియా కన్నెర్ర!
X

అయిన వారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో వడ్డిస్తారనేది ఒక సామెత. మీడియా ప్రతి వార్తనూ వండి వార్చేది ఇదే ధోరణిలో. తెలుగు మీడియా సంగతి చెప్పనే అక్కరలేదు.

తాము అభిమానించే పార్టీ బహిరంగ సభలు, వార్షికోత్సవాలు జరిగితే అవి ఎంత గొప్పగా జరిగాయో, ఎన్ని వేల వాహనాల్లో ఎన్ని లక్షల మంది వచ్చారో, నేల ఈనిందా అన్నట్లు రోడ్లు ఎలా జనాలతో కిటకిటలాడాయో, సమావేశాల్లో ఎలాంటి భోజనాలు వడ్డించారో కథలు, కథలుగా రాస్తారు. అదే తమ పత్రికకు నచ్చని పార్టీ కార్యక్రమం ఏదైనా జరిగితే జనాల్ని ఎలా లారీల్లో తోలారో, జనసమీకరణకు ఎంత కష్టపడ్డారో, వచ్చిన జనాలకు ఏఏ మందు బాటిళ్ళు, బిర్యానీ పొట్లాలు, ఖర్చులకు డబ్బులు ఎంత ఎంత ఇచ్చారో కథనాలు రాస్తారు. ఇంకా కసి ఉంటే వీళ్ళ సభ వల్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి హాస్పిటల్‌కు వెళ్ళాల్సిన నిండు బాలింతరాలు ఎన్ని ఇబ్బందులు పడిందీ, నిండా జబ్బుతో ఉన్న వ్యక్తి ఎలా అల్లాడిపోయిందీ బాక్స్‌ ఐటమ్స్‌గా రాస్తారు. ఇంకా కోపం ఉంటే వైద్యం ఆలస్యం కావడం వల్ల ఎంత మంది చనిపోయిందీ చెప్పి ఆపాపం ఆ నాయకుడి ఖాతాలో వేసి హ్యూమన్‌ ఇంట్రెస్ట్‌ స్టోరీలు వండి వారుస్తారు. ఇదంతా మన తెలుగు ప్రజలకు బాగా తెలిసిన విషయమే.

ఇప్పుడీ జాడ్యం నేషనల్‌ మీడియాకు కూడా పాకింది. కేంద్రంలో నరేంద్రమోదీ పాలనకు ఏడాది పూర్తయింది. ఆ సందర్భంగా ఆయన ఘనవిజయాలను కీర్తిస్తూ జరిగే సభల్ని మీడియా ఎగిరి గంతులేస్తూ రాస్తోంది. మామూలు ట్రాఫిక్‌ మళ్ళించడం కాకుండా ప్రధాని సభలకోసం ఆకాశంలో వెళ్ళే విమానాల ట్రాఫిక్‌ను కూడా ఆపేసినా విజయగాధల్లో భాగంగా వర్ణిస్తున్న మీడియాకు కేజ్రీవాల్‌ ఢిల్లీలో ఒక పార్కులో తన వందరోజుల పాలనపై ఒక చిన్న మీటింగ్‌ పెట్టుకుంటే మీడియా వాళ్ళకు నచ్చినట్లు లేదు. ఈ మీటింగ్‌కు డబ్బులిచ్చి జన సమీకరణ చేయలేదు. లారీల్లో తోలలేదు. అభిమానులు కొద్దిమంది సెంట్రల్‌ పార్క్‌లో సమావేశమై రాత్రి 8 గంటలలోపు సభను ముగించినా మీడియా కన్నెర్ర చేసింది. వందరోజుల పాలనలో వాళ్ళు ఏం చేశామని చెప్పారో ఒక్క ముక్క కూడా రాయలేదు. వాళ్ళు అలా మీటింగ్‌ పెట్టడం వల్ల ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌ గురించి ఏకరువు పెట్టారు. ప్రజల ఇబ్బందుల గురించి కన్నీళ్ళు కార్చారు. బహుశా కేజ్రీవాల్‌ ప్రభుత్వం మీడియాను మచ్చిక చేసుకున్నట్లు లేదు అని అనుకుంటున్నారు మన మీడియా గురించి తెలిసిన పాఠకులు.

First Published:  26 May 2015 8:25 AM IST
Next Story