Telugu Global
Others

కొత్త జీవోతో రైతుల యాజమాన్య‌ హక్కులు గాలికి.. !

ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములివ్వండి.. భూములు ఇవ్వకపోతే.. భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి వాటిని కైవసం చేసుకుంటాం అని రాజధాని ప్రాంత ప్రజలను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతో సహా అనేక మంది టీడీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేసారు.భయపెట్టడంలో భాగంగానే ఈ నెల 15వ తేదీన ప్రభుత్వం 166 జీవో జారీ చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. మోడీ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ 2015 ఏప్రిల్ 3న చేసిన ఆర్డినెన్స్ ను […]

కొత్త జీవోతో రైతుల యాజమాన్య‌ హక్కులు గాలికి.. !
X

ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములివ్వండి.. భూములు ఇవ్వకపోతే.. భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి వాటిని కైవసం చేసుకుంటాం అని రాజధాని ప్రాంత ప్రజలను ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావుతో సహా అనేక మంది టీడీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేసారు.భయపెట్టడంలో భాగంగానే ఈ నెల 15వ తేదీన ప్రభుత్వం 166 జీవో జారీ చేసిందని పరిశీలకులు భావిస్తున్నారు. మోడీ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ 2015 ఏప్రిల్ 3న చేసిన ఆర్డినెన్స్ ను అడ్డం పెట్టుకోవడాన్ని తప్పుబడుతున్నారు. అయితే జీవోకు, కేంద్ర ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ కు మధ్య పొంతన కుదరదని కొన్ని అంశాలున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన్ (జీవో) విడుదల చేయటానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం బీడు భూముల సర్వే నిర్వహించాలనీ, కనిష్టంగా అవసరమైన భూమిని మాత్రమే సేకరించాలనీ ఆర్డినెన్స్ పేర్కొంది. ఈ రెండూ జరగలేదు. దీంతో జీవో 166 చెల్లుబాటు కాదన్న వాదన వినిపిస్తోంది.
ల్యాండ్ పూలింగ్ లో ఎకరం భూమిచ్చిన రైతుకు అభివృద్ధి చేసిన 1200 గజాల భూమినిస్తామనీ దాన్ని అధిక ధరకు తమకు నచ్చినట్టు అమ్ముకోవచ్చని ప్రభుత్వం నమ్మబలికింది. కానీ కేంద్ర ఆర్డినెన్స్ పీపీపీ ప్రాజెక్టుల్లో అనంతరం కూడా భూమిపై ప్రభుత్వ హక్కు కొనసాగాలని పేర్కొంది. దీంతో పూలింగ్ ద్వారా ప్రతిఫలంగా పొందిన భూమిపై రైతుకు పూర్తిస్థాయి యాజమాన్య హక్కుపై సందేహాలు కలుగుతున్నాయి. ప్రాజెక్ట్ కు సంబంధించిన సామాజిక ప్రభావ మదింపు నివేదిక, బాధిత‌ ప్రజల సమ్మతి గురించి 2013 భూ సేకరణ చట్టంలోని సెక్షన్ 2 నిర్ధేశిస్తోంది. అలాగే బహుళ పంటలు పండే సాగునీటి సౌకర్యంగల భూమిని సేకరించరాదనీ, ఆహార భద్రతను కాపాడాలని సెక్షన్ 3 పేర్కొంది. కీలకమైన ఈ రెండు సెక్షన్లను నిర్వీర్యం చేయడానికి మోదీ సర్కార్ తొలినుంచీ ప్రయత్నిస్తోంది.
లోక్ సభలో ఆమోదింపజేసుకున్నా రాజ్యసభలో సాధ్యం కావడంలేదు. అంతేకాకుండా ప్రజల్లో ప్రధానంగా రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రెండు ఆర్డినెన్స్ లు తెచ్చింది. ఏదైనా ప్రాజెక్ట్ కోసం భూమిని సేకరిస్తే సెక్షన్ 2, 3 అమలు చేయనవసరం లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయించవచ్చని పేర్కొంటూ ఒక అధ్యాయాన్ని అదనంగా చేర్చింది. దేశమంతటా ఈ సవరణ వర్తించదనీ, కేవలం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేసిన ప్రాజెక్ట్ కు మాత్రమే మినహాయింపనీ స్పష్టమవుతోంది. అయితే, ప్రజల వ్యతిరేకతను తగ్గించుకునేందుకూ, కొన్ని ప్రాంతీయ పార్టీలను వలలో వేసుకునేందుకు డిసెంబర్ 31నాటి మొదటి ఆర్డినెన్స్ లో లేని రెండు అంశాలను రెండవదానిలో చేర్చారు. అవి (1) ఆ ప్రాజెక్ట్ కు కనీసంగా అవసరమైన భూమిని మాత్రమే తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్ కు ముందే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి. (2) రాష్ట్ర ప్రభుత్వం బీడు భూములతోసహా పడావు(వేస్ట్ ల్యాండ్) భూములన్నిటినీ సర్వే చేయాలి. ఆర్డినెన్స్ లోని ఈ రెండు అంశాలనూ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చన్నందున జీవో 166 చెల్లుబాటు కాదని వారి వాదన. ఐదు రకాల భూములను రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయించవచ్చునని ఆర్డినెన్స్ 10(ఎ)లో పేర్కొన్నారు. దీని ఆధారంగానే జీవో 166 జారీ అయింది. అవి (ఎ) రక్షణ సంబంధితమైనవి (బి) విద్యుదీకరణతో సహా గ్రామీణ మౌలిక వసతులు (సి) గృహవసతి కల్పన (డి) ఇండస్ట్రియల్ కారిడార్ (ఇ) భూమిపై యాజమాన్యం ప్రభుత్వానికే కొనసాగే పీపీపీతో సహా చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్ట్ లు. రాజధాని ప్రాంతంలో పీపీపీ ప్రాజెక్ట్ ల్లో భూమిపై రాజధాని నిర్మాణం అనంతరం కూడా యాజమాన్య హక్కు ప్రభుత్వానికే కొనసాగాలి.
ల్యాండ్ పూలింగ్ కు ప్రతిఫలంగా వచ్చే భూమిపై సకల హక్కులు ఆ భూమినిచ్చిన రైతుకు దక్కే విషయంలోనూ నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఏదైనా కేంద్ర చట్టం లేదా నిబంధనకు, రాష్ట్ర చట్టం నిబంధనకు మధ్య వైరుధ్యం తలెత్తితే కేంద్రానిదే వర్తిస్తుంది. దీంతో జీవో 166 ప్రకారం భూ సేకరణ ప్రక్రియను చేపడితే పూలింగ్ ను వ్యతిరేకించే రైతుల భూములను గుంజుకోవడం మాట అటుంచితే ఇప్పటికే పూలింగ్ కు సమ్మతి పత్రాలిచ్చిన రైతుల హక్కులపట్ల కొన్ని సందేహాలు కలగక‌మానదు. పూలింగ్ ను వ్యతిరేకించేవారి భూములనే సేకరిస్తామని మంత్రులు చెబుతున్నా జీవో 166లో మాత్రం యావత్ రాజధాని ప్రాంతాన్నీ నోటిఫై చేశారు. దీంతో ఆ విభజన ఎలా చేపడతారో వేచి చూడాల్సి ఉంది. జీవోతో ప్రతికూల ఫలితాలేమైనా ఉంటే అవి అందరికీ వర్తించే ప్రమాదముంది.

First Published:  26 May 2015 7:17 AM IST
Next Story