Telugu Global
Others

ఏపీ ప్ర‌భుత్వం రోగం కుద‌ర్చ‌ద‌ట!

హైదరాబాద్ : ఆరోగ్యమే మహాభాగ్యం.. హెల్త్ ఈజ్‌ వెల్త్.. ఈ రోజుల్లో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యం దేనికీ లేదు.. ప్రపంచంలో దేనికైనా వెలకట్టొచ్చేమోగానీ మనిషి ప్రాణానికి ధర నిర్ణయించలేం. అందుకే ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా జనం వెనకాడటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయి.. ప్రభుత్వ ఆస్ప‌త్రులు ఉన్నా లేనట్టే. దీంతో కార్పొరేట్ ఆస్ప‌త్రులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తయారయ్యాయి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయం […]

ఏపీ ప్ర‌భుత్వం రోగం కుద‌ర్చ‌ద‌ట!
X
హైదరాబాద్ : ఆరోగ్యమే మహాభాగ్యం.. హెల్త్ ఈజ్‌ వెల్త్.. ఈ రోజుల్లో ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యం దేనికీ లేదు.. ప్రపంచంలో దేనికైనా వెలకట్టొచ్చేమోగానీ మనిషి ప్రాణానికి ధర నిర్ణయించలేం. అందుకే ప్రాణాలు కాపాడుకునేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా జనం వెనకాడటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయి.. ప్రభుత్వ ఆస్ప‌త్రులు ఉన్నా లేనట్టే. దీంతో కార్పొరేట్ ఆస్ప‌త్రులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తయారయ్యాయి.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయం కారణంగా ఏపీలో వైద్యమో చంద్రా అనే రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. వైద్యసేవలను ప్రైవేటు పరం చేయడానికి ఏపీ సర్కార్ సిద్దమై పోయింది.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల బాధ్యత ప్రైవేటు సంస్థకు అప్పగించడం దీనిలో భాగమే…? త్వరలో యూజర్ ఛార్జీల పేరుతో బాదుడుకు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతుంది…? అనంతపురం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం వెనక అసలు రహస్యం ఇదేనా…? ఇక రాష్ట్ర వ్యాపంగా నిరుపేద రోగుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తారా..? అంటే సమాధానం అవును అనే వస్తోంది. ధర్మాసుపత్రులు అంటేనే మందులు, డాక్ట‌ర్లు లేని అనాధ‌ల్లా ఉంటాయి. అనారోగ్యం పాలైన పేదలు చికిత్స కోసం వెళ్తే ఈ అనాధ ఆస్ప‌త్రుల్లో పట్టించుకునే వారే ఉండ‌రు. డాక్టర్ల కొరత వేధిస్తోంది. సిబ్బంది పనితీరు అలాగే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరూ ఉండరు. ఉన్నా సౌకర్యాల కొరత. ఒకవేళ ఉన్నా పట్టించుకోరు. డాక్టర్‌ ఉంటే మందులు దొరకవు. ఒక్కమాటలో చెప్పాలంటే సర్కార్‌ దవాఖానా అంటే జనం బెంబేలెత్తుతున్నారు. అన్నీ ఉచితమే అని పైకి చెబుతున్నా లంచాలకు కొదవలేదు. అటెండర్‌ దగ్గర్నుంచి చేయి తడిపితే గానీ వైద్యం అందదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ప్రభుత్వానికి తెలియంది కాదు.
ఆరోగ్యశ్రీ కి కోట్లు… ప్ర‌భుత్వ వైద్యానికి తూట్లు
ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి అంటే వచ్చేందుకు జనం భయపడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే గవర్నమెంట్‌ హాస్పిటల్‌ను ఆశ్రయిస్తున్నారు. నిరుపేదలకు మరో మార్గం లేకపోవడంతో సర్కార్‌ దవాఖానే దిక్కవుతోంది. వీటికి చికిత్స చేయాల్సిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రైవేటు బాట పడుతోంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించింది. తాజాగా ధర్మాసుపత్రుల్లో యూజర్‌ ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. పైలెట్ ప్రాజెక్టుగా అనంతపురం జిల్లాను ఎంచుకుంది చంద్రబాబు ప్రభుత్వం. అనంతపురం జిల్లాలోని హిందూపురం పట్టణంలోని జిల్లా ఆసుపత్రితోపాటు కదిరి ఏరియా ఆసుపత్రి, రాయదుర్గం, పెనుకొండ, గుత్తిలోని పిహెచ్‌సిల్లోని వైద్యపరీక్షల నిర్వహణను గుట్టుగా ప్రయివేటుపరం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ మేరకు ఫిబ్రవరి 19న సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం పైఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను మెడికల్ హెల్త్ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి అప్పగించింది. మార్చి నెల నుంచే ఆ సంస్థ పరిధిలోనే రోగులకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకు అయ్యే వ్యయాన్ని రాష్ర్ట ప్రభుత్వం భరిస్తోంది. ప్రస్తుతానికి రోగుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయడం లేదు. రాబోయే కాలంలో రోగుల నుంచి యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యపరీక్షల నిర్వహణ లేదని అంగీకరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే వైద్యపరీక్షల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది ఏపీ ప్రభుత్వం. అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాను పైలెట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నట్టు జీవోలో వివరించింది చంద్రబాబు సర్కార్‌.
అందుబాటులో 52 రకాల పరీక్షలే..
హిందూపురంలోని ప్ర‌భుత్వ‌ ఆసుపత్రిలో వైద్యపరీక్షల నిర్వహణను మెడ్ ఆల్‌ అనే సంస్థకు అప్పగించారు. మౌలిక సదుపాయాలను ఉచితంగా కల్పించారు. వారు చేసిన వైద్య పరీక్షలకు సెంట్రల్‌ గవర్నమెంటు హెల్త్ స్కీం సిజిహెచ్‌ఎస్‌ నిర్ణయించిన ధరల ప్రకారం చెల్లింపులు జరుపుతున్నారు. మెడాల్‌ 52 రకాల వైద్యపరీక్షలను నిర్వహిస్తోంది. మిగతా వాటికి రోగులు కొంత మేరకు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. కొన్ని రకాల టెస్టులకు రోగులను చెన్నైకి తీసుకెళ్లి బిల్లులు పెట్టుకుంటున్నారు మెడ్ ఆల్‌ ప్రతినిధులు.. మార్చి, ఏప్రిల్‌ మాసాలకు బిల్లులు పరిశీలిస్తే నెలకు కోటి రూపాయల వరకు లెక్క తేల్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణకు నిధులు విడుదల చేయని ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు కోటి రూపాయలకుపైగా బిల్లులు చెల్లిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరు నెలల తర్వాత ఏపీ మొత్తం అమలు..
ఆరు నెలలపాటు ప్రైవేటు పరీక్షల నిర్వహణ అమలును పరిశీలించాక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. మిగతా ప్రాంతాల్లోనూ వైద్యపరీక్షల నిర్వహణను ప్రభుత్వ, ప్ర‌యివేటు భాగస్వామ్యం(పిపిపి) విధానంలో అమలు చేయాలని భావిస్తున్న‌ట్లు జీవోలో పేర్కొన్నారు. దీన్ని బట్టి రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలను ప్రైవేటుపరం చేసే అవకాశాలున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. క్రమంగా ఇతర విభాగాలను కూడా ప్రైవేటుకు అప్పజెప్పే యోచనలో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందన్న ఆరోపణలు వస్తున్నాయి.-పీఆర్‌
First Published:  24 May 2015 12:10 PM IST
Next Story