అంబ (For children)
కాశిరాజుకు ముగ్గురు కూతుర్లు. అంబ అందరిలోకి పెద్దది. అంబిక, అంబాలిక ఈమెకు చెల్లెళ్ళు. పెళ్ళివయసు రావడంతో స్వయంవరం ప్రకటించాడు కాశిరాజు. అందమైన అక్క చెల్లెళ్ళను సొంతం చేసుకోవడానికి దేశదేశాధిపతులంతా వచ్చారు. పోటీ పడ్డారు. స్వయంవరానికి భీష్ముడు కూడా వచ్చాడు. బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసినవాడు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. స్వయంవరంలో వయసు మీదపడిన భీష్ముని ముగ్గురు అక్క చెల్లెళ్ళూ వరించలేదు. భీష్ముడు బలవంతంగా అక్క చెల్లెళ్ళను ఎత్తుకు పోతుంటే ఎదురు తిరిగిన వాళ్ళు ఎదురు నిలవ […]
కాశిరాజుకు ముగ్గురు కూతుర్లు. అంబ అందరిలోకి పెద్దది. అంబిక, అంబాలిక ఈమెకు చెల్లెళ్ళు. పెళ్ళివయసు రావడంతో స్వయంవరం ప్రకటించాడు కాశిరాజు. అందమైన అక్క చెల్లెళ్ళను సొంతం చేసుకోవడానికి దేశదేశాధిపతులంతా వచ్చారు. పోటీ పడ్డారు.
స్వయంవరానికి భీష్ముడు కూడా వచ్చాడు. బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేసినవాడు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. స్వయంవరంలో వయసు మీదపడిన భీష్ముని ముగ్గురు అక్క చెల్లెళ్ళూ వరించలేదు. భీష్ముడు బలవంతంగా అక్క చెల్లెళ్ళను ఎత్తుకు పోతుంటే ఎదురు తిరిగిన వాళ్ళు ఎదురు నిలవ లేకపోయారు. మార్గమధ్యంలో సోబల దేశపు రాజైన సాళ్వుడు అడ్డం పడ్డాడు. యుద్ధం చేసాడు, ఓడిపోయాడు. తప్పుకున్నాడు. భీష్ముడు తన రాజ్యం చేరుకున్నాడు. పినతల్లి కొడుకైన విచిత్ర వీరునికి అంబ, అంబిక, అంబాలికలను ఇచ్చి పెళ్ళాడమన్నాడు. అయితే అంబ తను సాళ్వురాజుకు మనసిచ్చానని చెప్పడంతో అతని దగ్గరకే వెళ్ళిపొమ్మని పంపించేసాడు.
అంబ సాళ్వరాజు దగ్గరకు ఎంతో ఆశగా వెళ్ళింది. పెళ్ళాడుకుందామంది. సాళ్వుడు ఒప్పుకోలేదు. “అందరూ చూస్తుండగా భీష్ముడు నిన్ను ఎత్తుకుపోయాడు, ఇంక నిన్ను భార్యగా ఎలా స్వీకరించను?” ఎదురు ప్రశ్నించాడు. బతిమాలినా వినకుండా తిప్పిపంపించాడు. అంబ తిరిగి వచ్చింది. జరిగింది చెప్పింది. విచిత్ర వీర్యుని పెళ్ళాడమన్నాడు భీష్ముడు. విచిత్ర వీర్యుడూ కాదన్నాడు. “వేరొకరిని ప్రేమించిన మనిషిని యెలా పెళ్ళాడను?” ఖచ్చితంగా ఖండితంగా చెప్పాడు.
అంబ దిక్కుతోచని స్థితిలో భీష్ముణ్నే పెళ్ళాడమని కోరింది. అర్థించింది. బ్రహ్మచారిగా ఉంటానని తను చేసిన ప్రతిజ్ఞను భీష్ముడు గుర్తుచేసాడు. మాట తప్పలేనన్నాడు. మనువాడలేనన్నాడు. సాళ్వరాజునే ఒప్పించమని సలహాయిచ్చాడు. అంబకు ఏదారీ కనపడలేదు. భీష్ముని దారికి తెచ్చుకొనే దారీ కనపడలేదు. సాళ్వరాజు దగ్గరకు వెళ్ళి అర్థించింది. ప్రాథేయపడింది. కాని అతను తిరస్కరించాడు.
యవ్వనంలో ఉన్న అంబ దిగులుతో, దుఃఖంతో ఆశలారిపోయి అవమానాన్ని తట్టుకోలేకపోయింది. వేదనతో జీవితాన్ని వ్యర్థంగా భావించింది. తన దీన స్థితికి భీష్ముడే కారణమని భావించింది. అవమానం స్థానంలో ఆగ్రహం, వేదన స్థానంలో పంతం వచ్చి చేరింది. దేశ దేశాల రాజుల దగ్గరకు వెళ్ళి మొర పెట్టుకుంది. ఫలితం లేకపోయింది. చివరకు అడవులకు పోయి ఘోరమైన తపస్సు చేసింది. కుమారస్వామిని ప్రసన్నం చేసుకుంది. తామర పూల మాలను వరంగా పొందింది. ఆ మాల ధరించిన వారిచేతిలో భీష్ముడు అపజయాన్ని పొందుతాడని అనుగ్రహం తీసుకుంది. అంబ ఆ మాల తీసుకొని రాజులందరి దగ్గరకు వెళ్ళింది. భీష్మునితో యుద్ధానికి సాహసించలేక ఆ మాలనెవరూ స్వీకరించలేదు. పాంచాల రాజైన ధ్రుపదుడు కూడా తన వల్ల కాదన్నాడు. దాంతో అంబ ఆ మాలను ద్రుపదుని కోట సింహద్వారానికి తగిలించి అడవులకు చేరింది. మునుల సలహామేరకు పరశురాముణ్ని కలిసింది. మొర విని అభయ మిచ్చాడు పరశురాముడు. అయితే భీష్ముడు అతని శిష్యుడే. గురు శిష్యుల యుద్ధంతో దేవతలు భయపడిపోయి శాంతించమని కోరారు. విజయం ఎవరినీ వరించలేదు. అంబ కోరిక నెరవేరలేదు. అంబలోని అలజడీ తగ్గలేదు. మరింత మొండి పట్టుదలతో శివుడి గురించి ఘోర తపస్సు చేసింది. ఈ జన్మలో భీష్ముణ్ని జయించలేకపోయినా మళ్ళీ జన్మలో నీవల్లే భీష్ముడు మరణిస్తాడని వరమిచ్చాడు శివుడు.
అక్కడితో అంబ ఆగలేదు. చితిలోకి దూకింది. ప్రాణాలు విడిచింది. ద్రుపదుని ఇంట కూతురుగా పుట్టింది. కొడుకుగా పెరిగింది. శిఖండిగా మారింది. అనుకున్నది సాధించింది అంబ!.
– బమ్మిడి జగదీశ్వరరావు