Telugu Global
Family

నిశ్శబ్దం (Devotional)

ఒకసారి బుద్ధుడు ఒక నగర సరిహద్దులోని ఒక ఉద్యాన వనంలో విడిది చేశాడు. ఆ నగరానికి రాజు అజాత శత్రువు. అంటే అతనికి శత్రువన్నవాడు ఇంకా పుట్ట లేదన్నమాట. అతని పేరుకు అది అర్థం. పేరు ఎలావున్నా రాజు రాజే. రాజులకు ఎప్పుడూ శత్రువుల భయం ఉంటుంది. అట్లాగే అజాత శత్రువు నిరంతరం అప్రమత్తంగా, అభద్రతా భావంతో ఉండేవాడు.             రాజు సన్నిహితులు “రాజా! బుద్ధ భగవానులు మన నగర సరిహద్దులో ఉన్న ఉద్యానవనంలో విడిది చేశారు. […]

ఒకసారి బుద్ధుడు ఒక నగర సరిహద్దులోని ఒక ఉద్యాన వనంలో విడిది చేశాడు. ఆ నగరానికి రాజు అజాత శత్రువు. అంటే అతనికి శత్రువన్నవాడు ఇంకా పుట్ట లేదన్నమాట. అతని పేరుకు అది అర్థం. పేరు ఎలావున్నా రాజు రాజే. రాజులకు ఎప్పుడూ శత్రువుల భయం ఉంటుంది. అట్లాగే అజాత శత్రువు నిరంతరం అప్రమత్తంగా, అభద్రతా భావంతో ఉండేవాడు.

రాజు సన్నిహితులు “రాజా! బుద్ధ భగవానులు మన నగర సరిహద్దులో ఉన్న ఉద్యానవనంలో విడిది చేశారు. వారిని దర్శించండి. మీ మనసు ప్రశాంతిని పొందుతుంది” అన్నారు. “అతను అద్భుతమయిన వ్యక్తి. శాంతిమూర్తి, మీకు ఆయన దర్శనంతో అపూర్వమైన ఆనందం కలుగుతుంది” అన్నారు.

అజాత శత్రువుకు బుద్ధుణ్ణి చూడాలని కోరిక కలిగింది. సాయంత్రమవుతోంది. సంధ్యా కాంతులు వ్యాపించాయి. రాజు “మీరు బుద్ధుడు మన నగర శివార్లలో ఉన్న ఉద్యానవనంలో విడిది చేశారని అంటున్నారు. ఆయనతో బాటు పదివేలమంది శిష్యులు ఉన్నారని అంటున్నారు. కానీ ఎట్లాంటి శబ్దమూ, సందడీ వినిపించడం లేదు, కలకలం లేదు మీరు నన్నేమయినా మోసగిస్తున్నారా?” అన్నాడు. రాజు సేవకుల్తో బాటు ఉద్యాన వనాన్ని సమీపించాడు. అంతా నిశ్శబ్దం. రాజు అప్రమత్తంగా ఉన్నాడు. శత్రువులు దాడి చేసే ముందు ఉన్నంత నిశ్శబ్దం. వెంటనే రాజు కత్తి దూశాడు. ఎవరో తనమీద దూకుతారు తనని చంపబోతారు, అందుకని తను కత్తిదూసి సిద్ధంగా ఉండాలని అనుకున్నాడు. ఎవరో గుబురుగా ఉన్న చెట్ల వెనక దాక్కుని ఉన్నారు. ఏ క్షణాన్నయినా వాళ్ళు దాడి చేసేవీలుంది. తన జాగ్రత్తలో తనుండాలి కదా!

రాజు “మీరేమో పదివేలమంది భిక్షువులు ఈ ఉద్యానవనంలో ఉన్నారన్నారు. కనీసం ఒక్క ఆకు కదలిక అయినా లేదు. నేను అరణ్యాలు తిరిగాను. కానీ ఇంత నిశ్శబ్దం ఎక్కడా చూడలేదు. తమాషా ఏమిటంటే ఇక్కడ పక్షులు కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి. మీరు నన్ను మోసగిస్తున్నారా?” అన్నాడు.

వాళ్ళు “రాజుగారూ! మీరు ఆందోళన పడకండి. భయపడకండి. బుద్ధుడు ఈ ఉద్యానవనంలోనే విడిది చేశాడు. ఆయన ఉన్నాడు గనుకనే ఈ ఉద్యానవనమంతా నిశ్శబ్దంగా ఉంది. ఆయన ఉన్నాడు గనకనే పక్షులు కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి” అన్నారు.

రాజు సందేహంగానే ముందుకు కదిలాడు. ఆయనలో కొద్దిగా వణుకుకూడా వచ్చింది. బుద్ధుడు కనిపించాడు. భిక్షువులు వేలాదిమంది కనిపించారు.

అజాత శత్రువు బుద్ధునితో “ఎవరిలోనూ కదలిక లేదు, అంతా నిశ్శబ్దం, వాళ్ళందరూ శిలల్లా ఉన్నారు. వాళ్ళకేం జరిగింది? ” అన్నాడు.

బుద్ధుడు “వాళ్ళకు చాలా జరిగింది. వాళ్ళలో అనంత పరివర్తన జరిగింది. వాళ్ళు చెట్ల మధ్య ఉన్నారు, చెట్లతో ఉన్నారు. ఆకాశంతో ఉన్నారు. వాళ్ళిక్కడలేరు. కేవలం నిశ్శబ్దమే వ్యాపించి ఉంది. అందువల్లనే పక్షులు కూడా ఆ నిశ్శబ్ద ప్రభావానికి లోబడి ఉన్నాయి. నిజమే. నువ్వు అరణ్యాలు చూశావు. కానీ ఈ నిశ్శబ్దం నీ అనుభవంలో లేనిది. పదివేల మనసుల నిశ్శబ్దం ఇక్కడ ఉంది. అది పరిసరాల్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే నీకు అంతా వింతగా, విచిత్రంగా వుంది” అన్నాడు.

అజాత శత్రువు ఆశ్చర్యపోయాడు.

– సౌభాగ్య

First Published:  22 May 2015 6:31 PM IST
Next Story