Telugu Global
Others

క‌బ్జాదారుల భ‌ర‌తం ప‌డ‌తా... నా రూటే స‌ప‌రేటు: కేసీఆర్

‘పాత ముఖ్యమంత్రుల్లాంటి ముఖ్యమంత్రిని కాదు నేను. ఏదో ఓసారి వచ్చి ఏదో ప్రోగ్రాంల పాల్గొనుడు కాదు. పేదలు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వానికి తృప్తి. దాని కోసమే ఈ కార్యక్రమం. నాలుగేళ్లలో గ్రేటర్‌లో 2 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తం. జూన్‌ 2న లక్ష మందికి క్రమబద్ధీకరణ పట్టాలు ఇస్తం’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరంలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు. చివరగా ఎన్టీఆర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన […]

క‌బ్జాదారుల భ‌ర‌తం ప‌డ‌తా... నా రూటే స‌ప‌రేటు: కేసీఆర్
X
‘పాత ముఖ్యమంత్రుల్లాంటి ముఖ్యమంత్రిని కాదు నేను. ఏదో ఓసారి వచ్చి ఏదో ప్రోగ్రాంల పాల్గొనుడు కాదు. పేదలు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వానికి తృప్తి. దాని కోసమే ఈ కార్యక్రమం. నాలుగేళ్లలో గ్రేటర్‌లో 2 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తం. జూన్‌ 2న లక్ష మందికి క్రమబద్ధీకరణ పట్టాలు ఇస్తం’ అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. స్వచ్ఛ తెలంగాణ- స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరంలోని పలు కాలనీల్లో ఆయన పర్యటించారు. చివరగా ఎన్టీఆర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. నగరంలో భూకబ్జాదారుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని, వారి భరతం పడతానని సీఎం ప్రకటించారు.‘ఇయ్యాల మనం ఇట్ల బతికినం. మన పిల్లలు కూడా ఇట్లనే బతకాల్నా?’ అని ప్రశ్నించారు. పేదలకు ఇళ్లు ఇద్దామనగానే దాంట్లో దొంగలంతా వచ్చి దరఖాస్తు పెడ్తున్నరని విమర్శించారు. ఇది మీ సమస్య దాన్ని ఎదుర్కొనే శక్తి మీకుండాలి, దొంగలను నిలదీయాలని పిలుపునిచ్చారు. ‘ఇకపై నెలకోసారి ఒకరోజు మీ బస్తీలకు అధికారులు వస్తరు. మిమ్మల్నందర్నీ కలుస్తరు. మల్ల చలికాలం టైంలో ఐదు రోజులో… ఆరు రోజులో మొత్తం ప్రభుత్వమంతా మీ దగ్గర ఉంటది. హైదరాబాద్‌ సిటీ బాగుపడేదాక.. పేదలకు ఇండ్లు కట్టేదాక ఊరుకోవద్దని ప్రభుత్వం నిర్ణయం చేసింది’ అని కేసీఆర్‌ ప్రకటించారు. ‘జీవో 158 కింద ఎక్కడేసుకున్నోళ్లకు అక్కడ 125 గజాల వరకు క్రమబద్ధీకరణ చేస్తాం పట్టాలు ఉచితంగా ఇస్తం అన్నం. దీనికి 1.25 లక్షల దరఖాస్తులు వచ్చినయి. దాంట్లో ఒక లక్ష మందికి క్లియర్‌గా పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఆస్కారం ఉంది’ అని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న ఆ లక్ష మంది పేదలకు పట్టాలు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.
ఎందుకు అరుస్తారు పొద్దాకా..
సభ ప్రారంభంలో కేసీఆర్‌కు దరఖాస్తులు ఇచ్చేందుకు కొందరు మహిళలు యత్నించారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో కేసీఆర్‌ స్పందిస్తూ.. ‘సమస్య ఉంటే చెప్పండి.. గడబిడ చేస్తే లోపలేస్తరు పోలీసోళ్లు. తెలివి తక్కువగా అరుస్తా ఉంటే ఏం లాభం. సమస్యలు గిట్ల చెప్తే పరిష్కారమైతయా. ఏం లేదు మైక్‌ కింద పడేసి మేం ఎల్లిపోతం.. మల్ల గిదే బతుకుల ఉంటరు మీరు. చెప్పుకునే తెలివి కూడా ఉండాలి కదా. ముఖ్యమంత్రో.. మంత్రో వచ్చినపుడు సమస్యలు చెప్పుకోవాలనే తెలివితేటలు ఉండొద్దా… ఉరికే అరవడం అలవాటైనాది. ఎందుకు అరుస్తండ్రయా పొద్దాక ఎక్కడ పనిలేదా?’ అని గద్దించారు.
సిగరెట్‌ తాగి.. రిలాక్స్‌ అయ్యి…
ఉదయం నుంచి తీరిక లేకుండా పాతబస్తీ, చంచల్‌గూడ, సైదాబాద్‌, సరూర్‌నగర్‌ చెరువు, రైతుబజార్‌, ఎన్టీఆర్‌ నగర్‌ మార్కెట్‌లను సందర్శించిన సీఎం కేసీఆర్‌ అనంతరం బంజార బస్తీకి చేరుకున్నారు. అక్కడ ఒక రేకుల షెడ్ కింద కూర్చుని సిగరెట్‌ వెలిగించి ఓ దమ్ము లాగి రిలాక్సయ్యారు. ఆ సమయంలో ఆ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా భద్రత సిబ్బంది కట్టడి చేశారు.
First Published:  21 May 2015 2:49 AM IST
Next Story