Telugu Global
Family

కుంతి (For children)

పాండవులకు తల్లి. పాండు రాజుకు భార్య. వసుదేవునికి తోబుట్టువు. యాదవరాజైన శూరునికి కూతురు. అసలు పేరు పృథ. కాని కుంతిగానే పేరు పడింది. ఎందుకూ? పిల్లలు లేని కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి.             కుంతికి చిన్నప్పటి నుంచి ఇంటికి వచ్చే పోయే అతిథులకు భక్తితో సేవలు చేయడం అలవాటు. ఒక రోజు దుర్వాసుడు వచ్చాడు. కుంతి సేవలు చూసి మెచ్చుకున్నాడు. ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ఆమంత్రాన్ని పఠిస్తే దేవతలే వచ్చి వశమవుతారని చెప్పాడు. దుర్వాసుడు […]

పాండవులకు తల్లి. పాండు రాజుకు భార్య. వసుదేవునికి తోబుట్టువు. యాదవరాజైన శూరునికి కూతురు. అసలు పేరు పృథ. కాని కుంతిగానే పేరు పడింది. ఎందుకూ? పిల్లలు లేని కుంతి భోజుడు పెంచుకున్నాడు కాబట్టి.

కుంతికి చిన్నప్పటి నుంచి ఇంటికి వచ్చే పోయే అతిథులకు భక్తితో సేవలు చేయడం అలవాటు. ఒక రోజు దుర్వాసుడు వచ్చాడు. కుంతి సేవలు చూసి మెచ్చుకున్నాడు. ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడు. ఆమంత్రాన్ని పఠిస్తే దేవతలే వచ్చి వశమవుతారని చెప్పాడు. దుర్వాసుడు వెళ్ళాక మంత్ర బలాన్ని పరీక్షించాలన్న కోరిక కలిగింది కుంతికి. ఎదురుగా ప్రకాశిస్తున్న సూర్యుణ్ని చూసింది. మంత్రాన్ని పఠించింది. ఆరాధించింది. నీ వంటి పుత్రుడు కావాలను కుంది. సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. కుంతి భయపడింది. కోరినది యివ్వకుండా సూర్యుడు వెనక్కి వెళ్ళలేనని, ఆమె కన్యత్వం చెడదని అభయ మిచ్చాడు. కర్ణుడ్ని కన్న కుంతి ఎవ్వరికంటా పడకుండా తొట్టెలో పెట్టి నదిలో వదిలి పెట్టింది.

తరువాత కుంతికి పాండురాజుతో పెళ్ళి జరిగింది. కాని పాండు రాజుకి శాపం వుంది. సంసారం చేసే అవకాశం లేదు. పిల్లల్ని కనే అవకాశం లేదు. దాంతో అడవులకు వెళ్ళి తన వంశాన్ని నిలబెట్టుకోవడానికి తపస్సు చెయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు కుంతి దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రాన్ని గురించి చెప్పింది. భర్త అనుమతితోనే యమధర్మరాజుని తలచుకొని ధర్మరాజుని, వాయు దేవుణ్ని తలచుకొని భీముణ్ని, ఇంద్రుణ్ని తలచుకొని అర్జునుణ్ని మంత్రాన్ని పఠించి కన్నది. తన సవతిగా వున్న మాద్రికోసం అశ్వినీ దేవతల్ని ఆరాధించింది. ఆమె నకుల సహదేవులను కన్నది.

మాద్రి పట్ల మోహపడ్డ పాండురాజు మరణించాడు. సతీసహగమనానికి కుంతి సిద్ధ పడింది. పిల్లల ముఖం చూసి వారి పెంపకపు బాధ్యత గుర్తెరిగి ఆగిపోయింది. పంచపాండవులను తీర్చి దిద్దింది. ధృత రాష్ట్రుని వద్ద కొన్నాళ్ళు వుంది. వారణాసికి వెళ్ళమంటే పిల్లలతో బయల్దేరింది. మార్గం మధ్యలో లక్కయింట్లో దుర్యోధనుని వల్ల ప్రమాదం బారిన పడవలసిందే కాని తప్పించుకుంది. అలా అరణ్యమార్గంలో వెళుతున్నప్పుడే భీముడి మీద హిడింబి మోజు పడితే, కోర్కె తీర్చమని జాలి చూపింది. అక్కడి నుండి ఏక చక్రపురానికి చేరినప్పుడు బకాసురునికి బలికావడానికి వెళుతున్న బాలుడి బదులుగా భీముణ్ని వెళ్ళిరమ్మంది. కుంతికి తన బిడ్డల గురించి ఎంతలా తెలుసనడానికిదో తార్కాణం! బ్రాహ్మణ వేషాలతో తల్లీ బిడ్డలు ద్రుపద నగరానికి చేరారు. అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపిదిని గెలుచుకు వస్తే – “పండు తెచ్చితిని” అన్నమాట విని అయిదుగుర్నీ పంచుకోమంది. కుంతి మాటకు కొడుకులు విలువివ్వడం వల్ల పాంచాలి పంచ భర్తృక అయింది. అంటే అయిదుగురికీ భార్య అయింది. అలాంటి కోడల్ని జూదంలో ఓడిన కొడుకుల కళ్ళముందే ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు కుంతి అక్కడ లేదు. హస్తినలోనే కొడుకుల్ని తలచుకు కుమిలిపోయింది.

యుద్ధం మొదలుకాబోతున్నదనగా కృష్ణున్ని మాట మేరకు కుంటి చాటుగా కర్ణుని కలుసుకుంది. కన్నీరయింది. తన బిడ్డవంది. జరిగింది చెప్పింది. తన బిడ్డల కోసం మాట తీసుకుంది. రాజ ధర్మాన్ని వీడలేని కర్ణుడు “అర్జునుని తప్ప ఎవరిని వధించనని” మాతృ ధర్మానికీ విలువిచ్చాడు. పాండవులకు విజయం వరించినా కుంతి సుఖపడలేదు. ధృతరాష్ట్రగాంధారిలో అడవులకు వెళ్ళింది. ధర్మరాజు దుఃఖం కూడా ఆపలేకపోయింది. అడవిలోనే ఉండిపోయింది. అడవికి అగ్ని అంటుకుంది. దావాగ్ని. తప్పించుకొనే దారిలేకపోయింది. యుద్ధంలో చనిపోయిన బంధుమిత్రులనే కర్ణుణ్ని చూడాలనుకుంది. వ్యాసున్ని ఆ కోరికే కోరింది. గంగానది ఒడ్డుకు తీసుకు వెళ్ళి గతించిన వాళ్ళని చూపించాడు వ్యాసుడు. కర్ణుణ్ని తలచుకొని కుమిలి కుమిలి ఏడ్చింది కుంతి!

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  20 May 2015 6:32 PM IST
Next Story