మండలి ఎన్నికల్లో గులాబీ దళం ఆచితూచి అడుగులు..
తెలంగాణలో మొత్తం ఆరు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో టీఆర్ఎస్ కచ్చితంగా నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఒక సీటు కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది. ఇంకోసీటుపై టీఆర్ఎస్ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుని ఉన్నందున మామూలుగా అయితే ఈ సీటు తమకు వస్తుందన్న గ్యారంటీ లేదు. కాని విఫ్ జారీ చేయడం […]
BY sarvi19 May 2015 7:07 AM IST

X
sarvi Updated On: 19 May 2015 8:12 AM IST
తెలంగాణలో మొత్తం ఆరు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో టీఆర్ఎస్ కచ్చితంగా నాలుగు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఒక సీటు కాంగ్రెస్ ఖాతాలో పడుతుంది. ఇంకోసీటుపై టీఆర్ఎస్ ఆచితూచి అడుగులేస్తోంది. ఈ స్థానాన్ని ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుని ఉన్నందున మామూలుగా అయితే ఈ సీటు తమకు వస్తుందన్న గ్యారంటీ లేదు. కాని విఫ్ జారీ చేయడం ద్వారా ఓట్లు సంపాదించి సీటు దక్కించుకోవాలని టీ టీడీపీ భావిస్తోంది. ఆరో సీటు విషయంలో మొదట్లో దూకుడు ప్రదర్శించిన గులాబీ పార్టీ రాను రాను నెమ్మదిగా పావులు కదుపుతోంది. మండలి ఎన్నికల్లో రిస్క్ తీసుకోరాదని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైనా అధికారపార్టీ నామినేషన్లు దాఖలు చేయకపోవడం దేనికి సంకేతం. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్‌ఎస్ మొదట దూకుడు ప్రదర్శించినా ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. 6 స్థానాల్లో 5 సీట్లపై కన్నేసిన టీఆర్ఎస్ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులలో ముగ్గురు పేర్లను టీఆర్ఎస్ పార్టీ దాదాపు ఖరారు చేసింది. అభ్యర్థులందరి పేర్లను ఈ నెల 19న ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావులతోపాటు నేతి విద్యాసాగర్ పేర్లు ఖరారైనట్లు సమాచారం. మరో స్థానానికి బోడేకుంటి వెంకటేశ్వర్లు పేరు వినిపిస్తోంది.
ఐదో స్థానంపై ఆశపడితే తప్పని పోలింగ్ ప్రక్రియ..
ఐదో స్థానం కోసం టీఆర్‌ఎస్ అభ్యర్థిని రంగంలోకి దింపితే మండలి సభ్యుల ఎన్నిక కోసం పోలింగ్ జరగక తప్పనిసరి పరిస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుండటం..అధికార పార్టీ దూకుడుకు బ్రేకులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో అధికార పార్టీని ఇరుకున పెడుతున్న విపక్షాలు మండలి ఎన్నికలను పావులుగా వాడుకోవాలని యత్నిస్తున్నాయి. 6 స్థానాలు ఎన్నికలు జరుగకుండా ఏకగ్రీవం అయితే ప్రతిపక్ష పార్టీలకు ఒక్కో స్థానం దక్కే చాన్స్ ఉంటుంది. దీంతో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశాన్ని విపక్షాలకు దక్కక్కుండా చేయాలన్నది అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. ఒకవేళ విపక్ష పార్టీలు తమకు పూర్తి స్థాయి సంఖ్యాబలం లేదని పోటీకి వెనుకడుగు వేసే పక్షంలో ఐదో స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది.
కాంగ్రెస్‌కి ఒక సీటు…
తెలంగాణలో లభించే సీట్లో ఒక్క సీటు కాంగ్రెస్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ సీటుపై ఇంతవరకు ఎవరెవరు కన్ను వేశారన్నది ఎవరూ చెప్పలేక పోతున్నారు. ఎవరికి వారు చాప కింద నీరులా ఢిల్లీలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తెలంగాణ పీసీసీ నుంచి కూడా ఏ విధమైన సంకేతాలు లేవు. ఈ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలన్న విషయం ఇంకా ఖరారు కాలేదని, తమకు ఢిల్లీ నుంచి కూడా సమాచారం లేదని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి.
టి.టిడిపిలో ఎమ్మెల్సీ వార్
ఉన్నదే ఒక్క సీటు. అదీ దక్కుతుందో లేదో తెలీదు. ఆశావహులు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆ సీటు తమదేనంటూ ముందే కర్చీఫ్ వేస్తున్నారు. అదృష్టం పరీక్షించుకునేందుకు పోటీ పడుతున్నారు. సీటు కోసం తెర వెనక విశ్వప్రయత్నం చేస్తున్నారు. తమ అనచరులకే సీటు ఇప్పించేందుకు ముఖ్యనేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇదంతా టిటిడిపిలో జరుగుతున్న తంతు. ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ తెలుగు తమ్ముళ్ల అంతర్గత విబేధాలు బయటపడుతున్నాయి. ప్రధానంగా రేవంత్ వర్సెస్ ఎర్రబెల్లి ఎపిసోడ్ సైలెంట్‌గా హీటెక్కుతోంది. తమ అనుచరులకే సీటు ఇప్పించేందుకు ఇటు ఎర్రబెల్లి, అటు రేవంత్ వేగంగా పావులు కదుపుతున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్రరెడ్డికి ఎలాగైనా సీటు ఇప్పించి ఎర్రబెల్లి సొంత నియోజకవర్గంలో తన వర్గాన్ని బలోపేతం చేసేందుకు రేవంత్ స్కెచ్ గీస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎర్రబెల్లి మాత్రం శాసనమండలి ప్రతిపక్ష నేత అరికెల నర్సారెడ్డికి మద్దతు పలుకుతున్నారు. నర్సారెడ్డికే మరోసారి అవకాశం కల్పించాలని కోరుకుంటున్నట్లు సమాచారం. నర్సారెడ్డికి అవకాశం కల్పించి రేవంత్ వ్యూహాలకు చెక్ పెట్టాలని ఎర్రబెల్లి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండగా చాప కింద నీరులా టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ సైతం ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మహిళల కోటాలో తనకు అవకాశం కల్పించాలని బండ్రు శోభారాణి కోరుతున్నారు. పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి సైతం ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. బీసీ నేతగా పార్టీలో ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్న అరవింద్‌కుమార్ గౌడ్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. అయితే వీరందరి ప్రయత్నాలకు చెక్ పెట్టే విధంగా పార్టీ అధినేత మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన రావుల చంద్రశేఖరరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు మరో ప్రచారం ఉంది. అయితే ఇంతమంది ఆశలుపెట్టుకున్న ఈ స్థానం అసలు టిడిపికి దక్కేది కూడా కష్టమే. చాలావరకు ఎమ్మెల్యేలు కారెక్కటంతో టిడిపికి ఆశలు సన్నగిల్లాయి. కాని విప్ జారీ చేస్తే అనవసర చిక్కులు తప్పవని టీఆర్‌ఎస్ భావిస్తే ఆ ఎమ్మెల్సీ స్థానం తమకే దక్కుతుందని టిడిపి భావిస్తోంది.-పీఆర్
Next Story