జనకుడు (FOR CHILDREN)
జనకుడు అంటే అర్థం తండ్రి. సీతాదేవి జనకుడు “జనకుడే”! జనకుడు మిథిలను పాలించేవాడు. అతని తండ్రి హ్రస్వరోముడు. భార్య రత్నమాల. జనక మహారాజు దంపతులకు పిల్లలు లేరు. దాంతో పుత్రేష్టి యాగం చేసారు. యాగంలో భాగంగా భూమిని స్వయంగా తనే దున్నుతున్నాడు. అప్పుడు నాగేటి చాలులో నాగలికి ఏదో తగిలిన శబ్దమయ్యింది. తవ్వి తీస్తే బంగారపు పెట్టె. ఆ పెట్టెలో బంగారపు ఛాయని మించిన ఛాయతో పసిబిడ్డ. ఆడబిడ్డ. నాగేటి చాలులో దొరికింది కాబట్టి ఆ […]
జనకుడు అంటే అర్థం తండ్రి. సీతాదేవి జనకుడు “జనకుడే”!
జనకుడు మిథిలను పాలించేవాడు. అతని తండ్రి హ్రస్వరోముడు. భార్య రత్నమాల. జనక మహారాజు దంపతులకు పిల్లలు లేరు. దాంతో పుత్రేష్టి యాగం చేసారు. యాగంలో భాగంగా భూమిని స్వయంగా తనే దున్నుతున్నాడు. అప్పుడు నాగేటి చాలులో నాగలికి ఏదో తగిలిన శబ్దమయ్యింది. తవ్వి తీస్తే బంగారపు పెట్టె. ఆ పెట్టెలో బంగారపు ఛాయని మించిన ఛాయతో పసిబిడ్డ. ఆడబిడ్డ. నాగేటి చాలులో దొరికింది కాబట్టి ఆ బిడ్డకు సీత అనిపేరు పెట్టారు. అర్థమయింది కదా… సీతంటే నాగేటిచాలు అని అర్థం. జానకి అన్నా సీతాదేవే!
ఆ జనకుడికి లేక లేక కలిగింది కదా… సీతాదేవి… ఆమెను అల్లారు ముద్దుగా కష్టమే తెలియకుండా పెంచి పెద్ద చేసాడు. సీతాదేవి అందాల రాశి కదా… ఆ రాశిని ఇవ్వమని, ఇవ్వకుంటే యుద్ధం చేసయినా తీసుకుపోతానని సాంకాశ్యపు రాజైన సుధన్వుడు కయ్యానికి కాలు దువ్వాడు. జనకుడు తన ప్రాణాన్ని అడిగితే ఇచ్చేవాడేమోకాని కూతుర్ని అడిగితే ఇస్తాడా?, లేదు. యుద్ధం చేసి చంపి ఆ రాజ్యాన్ని తమ్ముడైన కుశ ధ్వజునకిచ్చాడు ఈ సీర ధ్వజుడు.
సీతాదేవికి యుక్త వయస్సు వచ్చింది. పెళ్ళి చెయ్యాలనుకున్నాడు జనకుడు. స్వయం వరం ప్రకటించాడు. ఎవరైతే శివ ధనస్సును ఎక్కుపెట్టగలరో వాళ్ళకే తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపిస్తానని దేశ దేశాల దండోరా వేయించాడు. ఎందరో రాజులు… రాజపుత్రులు వచ్చారు. విల్లుని కదపలేక పోయారు. విశ్వామిత్రుని వెంటవచ్చిన దశరథ రాముడు శివుని విల్లు ఎక్కుపెట్టాడు. సంధించి విల్లుని విరిచాడు. సీత మనసు గెలిచాడు. రాముని తండ్రైన దశరథునికి జనకుడు కబురు పంపించాడు. కళ్యాణం జరిపించాడు. సీతారాములతో పాటు – లక్ష్మణ భరత శత్రుజ్ఞులకు కూడా తమ్ముని కూతుర్లనిచ్చి పెళ్ళిళ్ళు జరిపించాడు. ప్రాణ ప్రదమయిన కూతురు సీతని రాముని ప్రాణమవుతుందని చేతిలో పెట్టాడు.
జనకుని దగ్గర సకల సంపదలను మించిన జ్ఞాన సంపద ఉండేది. ధర్మాచరణ ఉండేది. అందుకనే అనేకమంది బ్రాహ్మణులు జనకుని వద్దకు వస్తూ పోతూ ఉండేవారు. ఒకరోజు శ్వేత కేతువు, అరుణేయుడు, యజ్ఞ వల్క్యుడు, సోమశిషుడు వచ్చారు. జనకుని చూసారు. అందరిలోకి అగ్ని హోత్రము గురించి సరిగ్గా చెప్పిన యజ్ఞవల్క్యునికి మూడు వందల ఆవులను దానమిచ్చాడు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా తన భక్తి ప్రవత్తులతో స్వర్గలోక ప్రాప్తిని జనకుడు పొందాడని పెద్దలు చెపుతారు.
జానకిని గన్న జనకుడు నిజంగా జనకుడే!.
– బమ్మిడి జగదీశ్వరరావు