Telugu Global
Family

శల్యుడు (FOR CHILDREN)

శల్యుడెవరు? శల్యుడెవరికి సారథిగా వున్నాడు? శల్య సారథ్యానికి అంత పేరు ఎందుకొచ్చింది? “శల్య సారథ్యం” అనేది నానుడిగా ఎందుకు స్థిరపడింది? ఇవన్నీ తెలియాలంటే శల్యుని కథ తెలుసుకోవాల్సిందే!             పంచపాండవులలో ఆఖరి వాళ్ళైన నకుల సహదేవులకు మేనమామ శల్యుడు. అంటే పాండురాజు భార్య అయిన మాద్రికి అన్నదమ్ముడు. మద్ర దేశానికి అథిపతి. శల్యుడు తమవాడు గనుక తమకు దగ్గరువాడు గనుక తమ పక్షమే అని పాండవులు సహజంగానే భావించారు. కురుక్షేత్ర యుద్ధం దగ్గర పడడంతో పాండవులపక్షం కోరుతూ […]

శల్యుడెవరు? శల్యుడెవరికి సారథిగా వున్నాడు? శల్య సారథ్యానికి అంత పేరు ఎందుకొచ్చింది? “శల్య సారథ్యం” అనేది నానుడిగా ఎందుకు స్థిరపడింది? ఇవన్నీ తెలియాలంటే శల్యుని కథ తెలుసుకోవాల్సిందే!

పంచపాండవులలో ఆఖరి వాళ్ళైన నకుల సహదేవులకు మేనమామ శల్యుడు. అంటే పాండురాజు భార్య అయిన మాద్రికి అన్నదమ్ముడు. మద్ర దేశానికి అథిపతి. శల్యుడు తమవాడు గనుక తమకు దగ్గరువాడు గనుక తమ పక్షమే అని పాండవులు సహజంగానే భావించారు. కురుక్షేత్ర యుద్ధం దగ్గర పడడంతో పాండవులపక్షం కోరుతూ కృష్ణుడు దూతలను పంపాడు. అప్పటికే శల్యుడు తన సైన్యంతో బయల్దేరి వస్తున్నాడు. ఈ కబురు దుర్యోధనునికి తెలిసింది.

శల్యుడికి మార్గ మధ్యంలో ఎన్నో మర్యాదలు – మరెన్నో సేవలు – అతిథి గౌరవాలు – సకల సౌకర్యాలు అందాయి. శల్యుడు సంతృప్తిగా స్వీకరించాడు. ఈ ఏర్పాట్లు చేయించిందెవరని అడిగాడు. ఆ అవకాశ భాగ్యం నాకే దక్కిందని దుర్యోధనుడు చేతులు జోడించాడు. అర్థించాడు. ఏమని? యుద్ధంలో తమ పక్షానికి సహాయం చేయమని. సారథ్యం వహించమని. తమతోడిదే కౌరవులకు గెలుపని. శల్యుడు కాదన లేకపోయాడు. సరేనన్నాడు. కాని ఒకసారి పాండవులను కలిసి వస్తానని అది బంథు మర్యాదనీ చెప్పాడు. శలవు తీసుకున్నాడు.

పాండవులు కూడా శల్యుని అదే కోరారు. తమకు యుద్ధంలో సాయపడమని. సారథ్యం వహించమని. కాని శల్యుడు ముందే దుర్యోధనునకు మాట ఇచ్చానని జరిగింది చెప్పాడు. బంథుప్రీతి వున్నా కౌరవ పక్షం వహించక తప్పదన్నాడు. అప్పుడు ధర్మరాజు ఒక కోరిక కోరాడు. కర్ణునికి సారథిగా వుంటూనే – అతని విశ్వాసాన్ని దెబ్బతీయమని – మనసు విరిగేలా చేయమని. ధర్మరాజు కోరాడు గనుక శల్యుడు కాదనలేకపోయాడు. ప్రత్యక్షంగా కౌరవుల పక్షం వహించినా పరోక్షంగా పాండవుల పక్షమేనన్నాడు.

కర్ణునికి సారథిగా వుండమని శల్యుణ్ని ధుర్యోధనుడు కోరనేకోరాడు. మద్ర దేశానికి అధిపతినైన నేను ఒక శూద్రజాతి వాడికి సారథిగా వుండాలా? ఇంతకన్నా అవమానం వుంటుందా అని శల్యుడు తిరిగి తన రాజ్యానికి ఆగ్రహంతో వెళ్ళబోయాడు. అప్పుడు దుర్యోధనుడు అర్జునునికి కృష్ణుడు – కర్ణునికి శల్యుడు సారథులుగా వుండడం ఎంత సమవుజ్జి – అని పొగిడి అనుగ్రహం పొందాడు. అలా కర్ణుని పేరు విని అవమానించిన శల్యుడు సారథిగా వుండి అర్జునుని బలాన్ని పొగిడి కర్ణుని బలాన్ని తగ్గించి మాట్లాడాడు. మనోధైర్యాన్ని దెబ్బ తీసాడు. శల్యుని మాటలు కనిపించని శరములయ్యాయి. ముందే తను ఇలాగే మాట్లాడతానని మాట తీసుకున్నాడు. దుర్యోధనుడు అంగీకరించాక కర్ణుడెంత? శల్యునికి ఎదురు లేకుండా పోయింది. ధర్మరాజునకు ఇచ్చిన మాట ఉండనేవుంది. ప్రతి క్షణం ప్రతిపక్షానికి మేలు చేసి స్వపక్షానికి కీడు చేసాడు. అది శల్య సారథ్యం.

అయితే కర్ణుని మరణానంతరం శల్యుడు సేనాథిపతయ్యాడు. భీమునితో ధర్మరాజుతో విపక్ష సేనాథిపతిగా యుద్ధం చేసాడు. చివరకు శల్యుడు ధర్మరాజు చేతిలో మరణించాడు!

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  15 May 2015 6:32 PM IST
Next Story