Telugu Global
Others

బిజెపి పొగ " లోకేష్‌ సెగ

రాజకీయ సఖ్యత, పొత్తు కొనసాగించేందుకు రెండు వైపులా ఇష్టంలేదు. అలాగని వెంటనే తెగతెంపులు చేసుకునేందుకు అటూ ఇటూ సిద్ధంగా లేరు. కాని తమ వైపు నుంచి ముందుగా తెగతెంపులు చేసుకునేందుకు ఇరుపక్షాలు ఆసక్తి కనబరచటంలేదు. రెండు వైపులా పొగబెట్టుకుంటున్నాయి. కడుపులో క‌త్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు ముందుగా బంధం తెగతెంపులు చేస్తారా? అని రెండు పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇది బిజెపి, టిడిపిల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా పరిస్థితి. మధ్యలో వారి మధ్య విడాకులు […]

బిజెపి పొగ  లోకేష్‌ సెగ
X

రాజకీయ సఖ్యత, పొత్తు కొనసాగించేందుకు రెండు వైపులా ఇష్టంలేదు. అలాగని వెంటనే తెగతెంపులు చేసుకునేందుకు అటూ ఇటూ సిద్ధంగా లేరు. కాని తమ వైపు నుంచి ముందుగా తెగతెంపులు చేసుకునేందుకు ఇరుపక్షాలు ఆసక్తి కనబరచటంలేదు. రెండు వైపులా పొగబెట్టుకుంటున్నాయి. కడుపులో క‌త్తులు పెట్టుకుని కౌగలించుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు ముందుగా బంధం తెగతెంపులు చేస్తారా? అని రెండు పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇది బిజెపి, టిడిపిల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న తాజా పరిస్థితి. మధ్యలో వారి మధ్య విడాకులు అనివార్యమయ్యాక తాము ఎలా రంగంలోకి దిగి లాభపడాలా ? అని ఓవైపు వైసిపి మరో వైపు ‘జనసేన’ పవన్‌కళ్యాణ్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇది నాలుగు స్తంభాల ఆట అయినప్పటికీ తెరమీద మాత్రం రెండు స్తంబాలే కనిపిస్తున్నాయి. అవి టిడిపి,బిజెపి పార్టీలు.
‘దేశవ్యాప్తంగా మోడి హవా కొనసాగుతోంది. మన స్వతంత్రంగా అన్ని రాష్ట్రాల్లోలాగానే ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారంలోకి వద్దాం. టిడిపితో పొత్తువల్ల ఎదుగూబొదుగూ లేకుండా దెబ్బతింటున్నాం. క్రమంగా టిడిపికి దూరమై 2018 నాటికి స్వతంత్రంగా ఎదగండి. వచ్చేఎన్నికల్లో టిడిపితో సంబంధంలేకుండా పోటీచేద్దాం’ అని బిజెపి నాయకులు తరచూ రాష్ట్రంలో పార్టీ నాయకులకు చెబుతూనే ఉన్నారు.
చంద్రబాబునాయుడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూనే ఉన్నారు. బిజెపితోపాటు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సహకరించకపోయినా ఎక్కడా తొందరపడటంలేదు. పార్టీ నాయకులు ఎక్కడా కూడా బిజెపిని విమర్శించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో పరిణామాల వల్ల దూరం పెరిగింది. దాంతో ‘సరే బిజెపి దూరం కావాలనుకుంటే పట్టుకుని వేలాడేందుకు మేం(టిడిపి) సిద్ధంగాలేం. వారంతట వారే వద్దనుకుంటే మాకు అభ్యంతరంలేదు. పొత్తునుంచి వైదొలగేందుకు మేం కూడా సిద్ధమే. మా బలమేమిటో మేమూ చూపిస్తాం. ఎట్టిపరిస్థితుల్లోనూ బిజెపి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే అవకాశమేలేదు. ఆ పార్టీ బలం అంతకన్నా పెరగదు. మా వల్లనే ఆ పార్టీకి సీట్లు, ఓట్లు పెరిగాయి. ఇద్దరం లాభపడ్డాం. భవిష్యత్తులో పొత్తువద్దనుకుంటే ఆ విషయం వారి (బిజెపి) నుంచే ముందు బయటకు రావాలి’ ఇది ఇటీవలనే చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యనాయకులతో వెలిబుచ్చిన అభిప్రాయం. కేంద్రం సహకరించకుండా పొమ్మని పొగబెడుతున్నా బాబు మాత్రం గట్టిగా పట్టుకుని వేలాడుతూనే ఉండాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు ముఖ్యంగా టిడిపి, బిజెపి, వైసిపి, పవన్‌కళ్యాణ్‌(జనసేన) ఇప్పటినుంచే తమదైన వ్యూహాలతో ముందుకుసాగుతున్నాయి. పొత్తులు భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది బిజెపి టిడిపిల మధ్య సంబంధాలపైనే అధారపడతాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపితో పొత్తుపెట్టుకునేందుకు చంద్రబాబునాయుడు ఉవ్విళ్ళూరారు. ఆంధ్రలోని బిజెపి ముఖ్యనాయకుల సహకారంతో పొత్తు సాధ్యమయ్యింది. ఆ ఎన్నికల్లో జగన్‌, కెసిఆర్‌ (వైసిపి, టిఆర్‌ఎస్‌లతో) పొత్తుపెట్టుకునేందుకు బిజెపి అధినాయకత్వం ముఖ్యంగా నరేంద్రమోడి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి తాము ఏకపక్షంగా అధికారంలోకి వస్తామని జగన్‌తోపాటు ఆయన కోటరీ, సర్వే బృందం భావించటంతో మైనార్టీ ఓట్ల బూచిచూపి బిజెపితో పొత్తుకు సిద్ధపడలేదు. అదే సమయంలో టిడిపితో బిజెపి పొత్తుపెట్టుకోకుండా ఉండేలాగ, ఎన్నికల అనంతరం బహిరంగంగానే టిడిపి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బిజెపికి మద్దతు ఇస్తామని వైసిపి లోపాయికారీగా అవగాహనకు వచ్చిందని ప్రచారం సాగింది. అదే సందర్భంలో మోడి, చంద్రబాబుల మధ్య పైకి కనిపించని అగాధం ఉంది. గుజరాత్‌ అల్లర్ల నేపథ్యంలో గోవాలో బిజెపి జాతీయ సమావేశాలు జరిగినప్పుడు మోడికి వ్యతిరేకంగా బిజెపిపై అప్పట్లో బాబు ఒత్తిడి చేశారు. దాంతో వారిమధ్య స్పర్థలున్నాయి. 2004 ఎన్నికల ఫలితాల అనంతరం…. బిజెపి వల్లనే టిడిపి అధికారంలోకి రాకుండా దెబ్బతిందని, భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తుపెట్టుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు ప్రకటించారు. 2009 ఎన్నికల్లో విడివిడిగానే రెండు పార్టీలు పోటీచేశాయి. కాని 2014లో బాబు విధిలేని పరిస్థితుల్లో బిజెపి పంచనచేరారు. అందుకోసం తీవ్రంగానే లాబీయింగ్‌ చేశారు. చివరకు పొత్తుకుదిరింది. రెండు పార్టీలు విలువలకు తిలోదకాలిచ్చాయి. అధికారమే పరమావధిగా ఒక్కటయ్యాయి. కాని ఇవేమీ ప్రజలకు పట్టలేదు. ఆఖరకు మైనార్టీలు కూడా బిజెపి టిడిపి కూటమికి ఓటువేశారు. కాంగ్రెస్‌ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత (సోనియా వల్లనే రాష్ట్రాన్ని విభజించారని), అది జగన్‌పై కూడా ప్రభావం చూపడంతో పాటు మోడి హవా వ‌ల్ల‌ టిడిపికూడా లాభపడింది. రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ సజావుగా సాగింది.
ఆటుపోట్లు టిడిపికి కొత్తకాదు. పార్టీ ఏర్పడిన ఎనిమిది నెలలకే ఎన్టీఆర్‌ నాయకత్వంలో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. ఆ తరువాత ఆయన నాయకత్వంలోనే 1989లో అధికారానికి దూరమైంది. మళ్లీ 2004లో చంద్రబాబు నేతృత్వంలో అధికారాన్ని కోల్పోయింది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఆ పార్టీ ఇప్పటికీ పటిష్టంగా ఉండటానికి పార్టీ ఏర్పడిన 8 నెలలకే అధికారంలోకి రావడం, ఆ తరువాత చంద్రబాబు హయాంలో పదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. ఆ సమయంలో పార్టీ యంత్రాంగం పై నుంచి కింద వరకూ పటిష్టంగా వేళ్లూనుకుపోయింది. అందువల్ల పదేళ్లపాటు అధికారానికి దూరమైనా తెలుగుదేశం పటుత్వం ఏమాత్రమూ దెబ్బతినలేదు. అందువల్లనే 2014లో బిజెపి మోడి సహకారంతో జగన్‌ను సునాయాసంగా దెబ్బతీశారు చంద్రబాబునాయుడు. కాని 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడి, చంద్రబాబుల మధ్య సఖ్యత కొరవడింది. 2019 వరకూ రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలులేవు. అందువల్ల వారు కలిసున్నా, విడిపోయినా ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీలేదు.
రాష్ట్రంలో ప్రస్తుతం బిజెపి,టిడిపి, వైసిపి, కాంగ్రెస్‌లతోపాటు ‘జనసేన’ పవన్‌కళ్యాణ్‌ కూడా కీలక‌మైన శక్తులుగా ఉన్నారు. బలాబలాల్లో వారి మధ్య తేడా మినహా. బిజెపి టిడిపిల బంధం తెగిపోతే బిజెపితో పొత్తుపెట్టుకోవాలని జగన్‌ ఆలోచిస్తున్నట్లు పరిణామాలు కనిపిస్తున్నాయి. 2014 లో దక్కని అధికారం 2019లో దక్కించుకోవాలని ఆయన ఆశ. అసలు పార్టీ నడపడమంటే ఏమిటో ఇప్పటికీ ఆయనకు తెలిసిరాలేదంట. పండుగ కోసం ఇల్లు అలికి హడావిడి చేసినంతసేపు కూడా పట్టలేదు అధికారం లభించక నిరాశా నిస్పృహలు, నిర్వేదం వైసిపి పార్టీలో అలముకోవడానికి. ఆంధ్రప్రదేశ్‌కు (విభజిత) తొలి ముఖ్యమంత్రిగా జగన్‌ అధికార బాధ్యతలు చేపడతారని ఆ పార్టీ నాయకులు ముఖ్యంగా వారి మీడియా ఎక్కువగా అంచనా వేసుకున్నది. ప్రజలు ఆయన్ను ముఖ్యమంత్రి పదవికి అర్హునిగా గుర్తించకపోవడంతో అది ఆయనకు అందని ద్రాక్షగా మిగిలింది. 2014 నుంచే ఆయన 2019లో తానే ముఖ్యమంత్రినంటూ ఆశలపల్లకిలో విహరించటమే కాకుండా బహిరంగంగా ప్రకటిస్తున్నారు కూడా.
ఇక కాంగ్రెస్‌ పూర్తిగా బలహీనపడిపోయింది. 2004లో బిజెపి, ఎన్డీయే పై తీవ్ర వ్యతిరేకతతో కాంగ్రెస్‌ సునాయసంగా అధికారంలోకి వచ్చింది. అదే కాంగ్రెస్‌ను, రాష్ట్రంలోను, దేశంలోను పక్కనపెట్టడంతో 2014లో అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్‌ పార్టీకి ఈ విధమైన ఒడిదుడుకులు కొత్తేమీ కాదు. అయినా రాష్ట్రానికి ప్రత్యేక‌హోదా విషయంలో ఆ పార్టీ పోరాడుతూనే ఉంది. బిజెపి, టిడిపిలను తప్పుపడుతోంది. కాని వైసిపి ఆ పనిచేయకపోవటంవల్ల బిజెపితో అంతర్గతంగా ఒప్పందానికి వచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో క్రమంగా బలపడుతోంది.
వైసిపి జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో సంస్థాగత నిర్మాణం లేక అడ్‌హాక్‌ తరహా వ్యక్తులతో ముందుకు సాగుతోంది. ప్రజల్లో కలియతిరగడం ద్వారా ఓట్లు పడవని, ఎన్నికల నిర్వహణలో ప్రజల ఆదరణ పొందడానికి అవసరమైన వ్యూహాలు, ఎత్తుగడలు పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపించి ప్రజల మద్దతు సమీకరించడం కీలకమనే అంశాన్ని జగన్‌ పూర్తిగా విస్మరించారు. ఇప్పటికీ ఆయన ధోరణి మారినట్లులేదు. తనను తన బొమ్మను చూసి ఓట్లు వేస్తారనే వ్యూహంతో 2014లో ముందుకు నడిచారు. అది పూర్తిగా వికటించింది. అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రతి దశలోనూ ఆచితూచి ఎత్తుగడలతో మరీ ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో ముందుకు వెళ్లారు. బిజెపితో చెలిమి ఆయనకు బాగా కలసి వచ్చింది. చంద్రబాబుకు రిలయన్స్‌ వంటి సంస్థలు సైతం తోడ్పాటు ఇవ్వడంతో ఎన్నికలను తట్టుకోవడం ఆయనకు ఏమాత్రమూ కష్టం కాలేదు. కానీ జగన్‌ ఎలక్షనీరింగ్‌ను పూర్తిగా గాలికి విడిచి కష్టనష్టాలను, లోపాలను, వైఫల్యాలను ఏరోజుకారోజు సమీక్షించుకోకుండా అధికారం తనదేనంటూ ఉవ్విళ్లూరారు. పార్టీ అభ్యర్థులకు సరైన ఆర్థిక వనరులు, సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందారు.
ఈ అనుభవాలు ఎలా ఉన్నా 2019 నాటి ఎన్నికలకు ఎవరికివారు సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకు పొత్తులే ఉపయోగపడతాయని అంచనాతో పావులు కదిలిస్తున్నారు. అప్పటికి తన తనయుడు లోకేష్‌ను సిఎం చేయాలని బాబు ఆశ. ఇందుకు ఆయనకు బిజెపి, పవన్‌కళ్యాణ్‌ సహకారం కావాలి. అందుకోసం ఆయన ఆచితూచి అడుగువేస్తున్నారు. తాము స్వతంత్రంగా అధికారంలోకి రావాలని బిజెపి నేతల ఆశ. అందుకు పవన్‌కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆయనతోపాటు మోడి హవా ద్వారా అప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చని భావిస్తోంది. అందువల్లనే కేంద్ర నాయకత్వం పరిపాలనలో చంద్రబాబుకు సహకరించటంలేదు. కాని రాష్ట్రంలో కొందరు ముఖ్యనేతలు టిడిపితోనే కలిసిఉండాలని కోరుకుంటున్నారు. కాని జాతీయ నేతల దిశానిర్దేశం వేరుగా ఉంది. కాకినాడలో ఇటీవల జరిగిన పార్టీ సమావేశాల్లో టిడిపికి దూరమై బిజెపి ఒంటరిగా పోటీకి సిద్దం కావాలని రాంమాధవ్‌ బహిరంగంగా ప్రకటించారు. రాష్ట్ర బిజెపి నాయకులపై టిడిపి ఎక్కువ ఆశలుపెట్టుకుని ధైర్యంగా ఉంది. వారి బంధం తెగిపోతుందికాబట్టి లాభపడతానని వైసిపి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందుకే బిజెపిని పల్లెత్తుమాట అనటంలేదు. కాంగ్రెస్‌పార్టీ తన బలాన్ని పెంచుకునేందుకు తంటాలు పడుతోంది.ఇక మరో ముఖ్యమైన నేత పవన్‌ కళ్యాణ్‌. ఆయన రాజకీయ నాయకుడా లేదా సినిమా హీరోనా అని ప్రశ్నిస్తే రాజకీయాల్లో అతిధిగా ఉంటారుగాని పూర్తిస్ధాయి హీరో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రశ్నించటమే ప్రధాన నినాదంగా 2014 ఎన్నికల్లో రంగంలోకి దిగిన ఆయన ఇప్పుడు ప్రశ్నించడాన్ని మానేశారు. 2019 నాటికి ఆయన ఏవిధంగా వ్యవహరిస్తారో మరి.
టిడిపి ముఖ్యంగా చంద్రబాబు కూడా పవన్‌పై ఆశలుపెంచుకున్నారు. 2014 ఎన్నికల్లో టిడిపి బిజెపి పార్టీలకు ఆయన మద్దతిచ్చారు. ప్రజల కోసం ప్రశ్నిస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ పనిచేయటం పూర్తిగా మానేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములు సేకరిస్తున్న పద్ధతిపై ప్రశ్నించిన ఆయన ఆ వెంటనే చంద్రబాబును కొనియాడి భవిష్యత్తులో కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని బహిరంగంగానే చెప్పారు. దీనినిబట్టి ఆయన పార్ట్‌టైం పాలిటీషియన్‌గా కనిపిస్తున్నారు. బిజెపి టిడిపి విడిపోతే ఆయన ఎటువైపు వెళతారనేది ఆసక్తికరమే. మొత్తానికి పొత్తులు తెగిపోతాయా? అయితే ఎవరు ముందు తెంపుతారు? అప్పుడు కొత్తపొత్తులు ఎలా ఉంటాయనేది ఇప్పుడు అత్యుత్సాహంగా కనిపించినప్పటికీ రెండు పార్టీల‌ మధ్య నెలకొంటున్న దూరం కారణంగా ఇది అనివార్యమవుతోంది.

First Published:  15 May 2015 8:40 AM IST
Next Story