Telugu Global
Family

Hiranyakashipu: హిరణ్యకశిపుడు

Hiranyakashipu (హిరణ్యకశిపుడు): వైకుంఠ వాసానికి ద్వార పాలకులు జయ విజయులు. విష్ణుమూర్తి దర్శనం కోరి వచ్చిన మహర్షులను కాదనడంతో శాపగ్రస్తులవుతారు. ఆ కారణంచేత మూడు జన్మలు హరికి వైరీయులుగా వుండి శిక్షలనుభవించి నాల్గవ జన్మలో తిరిగి హరివాసము చేరుకుంటారు. అలా తొలి జన్మలో హిరాణ్యాక్ష హిరణ్యకశిపులైతే, మలి జన్మలో రావణ కుంభ కర్ణులైతే, మూడో జన్మలో శిశుపాల దంతవ్రక్తులుగా పుడతారు.

Hiranyakashipu
X

Hiranyakashipu (హిరణ్యకశిపుడు): వైకుంఠ వాసానికి ద్వార పాలకులు జయ విజయులు. విష్ణుమూర్తి దర్శనం కోరి వచ్చిన మహర్షులను కాదనడంతో శాపగ్రస్తులవుతారు. ఆ కారణంచేత మూడు జన్మలు హరికి వైరీయులుగా వుండి శిక్షలనుభవించి నాల్గవ జన్మలో తిరిగి హరివాసము చేరుకుంటారు. అలా తొలి జన్మలో హిరాణ్యాక్ష హిరణ్యకశిపులైతే, మలి జన్మలో రావణ కుంభ కర్ణులైతే, మూడో జన్మలో శిశుపాల దంతవ్రక్తులుగా పుడతారు. అంటే నిత్య హరి ద్వార సేవకులుగా వున్నవాళ్ళు హరి దర్శనాన్ని అడ్డుకోవడం వల్ల హరి ద్వేషులుగా వుండి హరికి దూరమై శిక్షలనుభవించి తిరిగి హరికి దగ్గరవుతారు. ఇది హిరణ్యాక్ష హిరణ్యకశిపులైన అన్నదమ్ముల పూర్వకథ.

తన సోదరుడైన హిరణ్యాక్షుని ప్రాణాలు తీసిన హరిపట్ల పగతో ప్రతీకారంతో ద్వేషంతో రగిలి పోతుంటారు హిరణ్యకశిపుడు. ఆదుగ్ధతోనే ఘోరమైన తపస్సు చేస్తాడు. నూరేళ్ళు నిద్రా హారాలు మాని ఎముకల గూడుగా మారిపోతాడు. ముల్లోకాలు గడగడలాడిపోతాయి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. "దేవతలచేతగాని, రాక్షసులచేతగాని, నరులచేతగాని, జీవమున్న వాళ్ళచేతగాని, జీవములేని వాళ్ళచేతగాని, రాత్రిగాని, పగలుగాని, నేలపైనగాని, నీట్లోగాని, గాలిలోగాని, భూమిలోగాని, అగ్నిలోగాని, ఆకాశంలోగాని, దశదిశలలోగాని, ఇంట్లోగాని బయటగాని, జంతువుల చేతగాని, ఆయుధాల చేతగాని, సర్పాల చేతగాని, సరీసృపాల చేతగాని నాకు మరణం లేకుండా వరమివ్వు అని కోరి వరం పొందుతాడు.

అలా వరం పొందిన హిరణ్యకశిపుడు ముల్లోకాలను ముచ్చెమటలు పొయించాడు. దానికి కూడా కారణం వుంది. హిరణ్యకశిపుని భార్య లీలావతిని తపస్సు సమయంలో గర్భవతి అని కూడా చూడక దేవేంద్రుడు ఎత్తుకెళ్ళి బంధించాడు. అయితే నారదుడు గ్రహించి ఇంద్రుడిని మందలించి లీలావతిని తనతో తీసుకు వెళ్ళాడు. అక్కడే తల్లి గర్భంలో వున్న ప్రహ్లాదుడు హరినామస్మరణకు అలవాటు పడ్డాడు.

తన సోదరుణ్ని చంపి తమకు శత్రువుగా వున్న హరిని శరణుకోరాలన్న ప్రహ్లాదుని మాటలు హిరణ్యకశిపుణ్ని బాధించాయి. చండామార్కుల దగ్గర శిష్యరికంలో పెట్టినా ప్రహ్లాదునిలో మార్పులేదు. నయానా భయానా అన్ని విధాల ప్రయత్నించిన హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని మనసు మాత్రం మార్చలేకపోయాడు. దాంతో కన్న కొడుకని కూడా చూడకుండా ప్రహ్లాదుని పరి పరి విధాలుగా హింసించాడు. కొడుకు మారలేదు. కోపం తగ్గలేదు. దాంతో ఉగ్రుడై "ఎక్కడ దాక్కున్నాడురా నీ శ్రీహరి? దమ్ముంటే ముందుకు రమ్మను" అని సవాల్‌ విసిరాడు. ఎక్కడవున్నాడో చూపమన్నాడు. ఎందెందు వెతికితే అందందే వుంటాడన్నాడు ప్రహ్లాదుడు. అలా అయితే ఈ స్థంభంలో వుంటాడా? అని ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఆయుధంతో కొట్టాడు. విరిగి పగిలిన స్థంభంలోంచి అటు మనిషీకాని ఇటు జంతువూ కాని-అంటే నడుంవరకు నరుడిగా అక్కడినుండి తలవరకు సింహంగా కలిసిన నరసింహ ఆకారం బయటకు వచ్చింది.

అదే నరసింహావతారంగా చెప్పారు. అయితే ఆ నారసింహుడు బ్రహ్మయిచ్చిన వరం తప్పకుండా రాత్రీ పగలుకాని సంధ్యవేళలో ఇంటాబయటాకాక ద్వారం మీద హిరణ్యకశిపుణ్ని తొడలమీద పెట్టుకు కూర్చొని మనిషీ జంతువూకాని నరసింహరూపంలో ప్రాణం వుండీ వుండని గోళ్ళతో గుండెను చీల్చి రక్తాన్ని వర్షం కురిపించాడు.

ఆవిధంగా హిరణ్యకశిపుడు హరి చేతిలోనే హరీ మన్నాడు!.

– బమ్మిడి జగదీశ్వరరావు

First Published:  16 Aug 2022 4:00 PM IST
Next Story