Telugu Global
Others

పోలీసుల ర‌క్ష‌ణ‌తో బ‌స్సులు... కొన‌సాగుతున్న ఆర్టీసీ స‌మ్మె

హైద‌రాబాద్: పోలీసుల ర‌క్ష‌ణ‌తో గురువారం తెలంగాణ‌లో 15 శాతం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 35 శాతం బ‌స్సులు న‌డిపామ‌ని ఆర్టీసీ ఎండీ సాంబ‌శివ‌రావు తెలిపారు. ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప్ర‌త్య‌మ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. పెళ్ళిళ్ళ సీజ‌న్‌, విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నందున స‌మ్మె విర‌మించి త‌క్ష‌ణం విధుల‌కు హాజ‌రు కావాల్సిందిగా కోరారు. కాంట్రాక్టు సిబ్బంది వెంట‌నే విధుల్లో చేర‌క‌పోతే ఉద్యోగం పోవ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఎస్మా ప్ర‌యోగం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఆర్టీసీ డ్రైవ‌ర్లు ప్ర‌మాదాల‌కు పాల్ప‌డితే వారి […]

పోలీసుల ర‌క్ష‌ణ‌తో బ‌స్సులు... కొన‌సాగుతున్న ఆర్టీసీ స‌మ్మె
X
హైద‌రాబాద్: పోలీసుల ర‌క్ష‌ణ‌తో గురువారం తెలంగాణ‌లో 15 శాతం, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 35 శాతం బ‌స్సులు న‌డిపామ‌ని ఆర్టీసీ ఎండీ సాంబ‌శివ‌రావు తెలిపారు. ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ప్ర‌త్య‌మ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. పెళ్ళిళ్ళ సీజ‌న్‌, విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నందున స‌మ్మె విర‌మించి త‌క్ష‌ణం విధుల‌కు హాజ‌రు కావాల్సిందిగా కోరారు. కాంట్రాక్టు సిబ్బంది వెంట‌నే విధుల్లో చేర‌క‌పోతే ఉద్యోగం పోవ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఎస్మా ప్ర‌యోగం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఆర్టీసీ డ్రైవ‌ర్లు ప్ర‌మాదాల‌కు పాల్ప‌డితే వారి నుంచి కేవ‌లం వెయ్యి రూపాయ‌లు మాత్ర‌మే కోత విధిస్తున్నామ‌ని, కాని ప్ర‌మాదాల‌కు యేటా ఆర్టీసీ 50 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తుంద‌ని ఆయ‌న తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు 43 శాతం ఫిట్‌మెంట్‌కు డిమాండు చేస్తున్నార‌ని, యాజ‌మాన్యం 27 శాతం ఇవ్వ‌డానికి అంగీక‌రించింద‌ని… 27 శాతం ఇస్తేనే ఇపుడు 15 వేల జీతం వ‌చ్చే ఉద్యోగికి 23 వేల జీతం అవుతుంద‌ని ఆయ‌న తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల‌కు యాజ‌మాన్యం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంద‌ని ఆయ‌న చెప్పారు.
రెండో రోజు కొన‌సాగిన ఆర్టీసీ స‌మ్మె… ఇద్దరు దుర్మరణం
తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు ఆర్టీసీ స‌మ్మె కొన‌సాగింది. తీవ్ర ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య అక్క‌డ‌క్క‌డా బ‌స్సులు న‌డిపేందుకు అధికారులు ప్ర‌య‌త్నించారు. స‌కాలంలో బ‌స్సులు లేక… గ‌మ్య స్థానాల‌కు చేర‌లేక ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. ప్రయివేటు ఆప‌రేట‌ర్లు, ఆటో డ్రైవ‌ర్లు ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకుని దోపిడీ చేస్తున్నారు. త‌క్కువ దూరానికి కూడా ప్ర‌యాణికులు న‌డ్డి విరుస్తున్నారు. ప్ర‌తీచోటా రెండు మూడు రెట్లు ఛార్జీలు వ‌సూలు చేస్తున్నారు. ఇక స‌మ్మెలో ఉన్న ఆర్టీసీ సిబ్బంది ధ‌ర్నాలు, రాస్తారోకోల‌తో తెలుగు రాష్ట్రాలు ఉద్రిక్తం అయ్యాయి. అనేక‌చోట్ల ఆర్టీసీ సిబ్బంది, తాత్కాలిక ఉద్యోగులు ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. అనేక డిపోల ముందు, బ‌స్ స్టాండ్‌ల వ‌ద్ద ఉద్యోగులు బైఠాయించి బ‌స్సులు బ‌య‌టికి పోకుండా చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ నేప‌థ్యంలో పోలీసుల‌తో ప‌లుచోట్ల వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. తోపులాటలు కూడా జ‌రిగాయి. తాత్కాలిక ఉద్యోగుల‌తో బ‌స్సులు న‌డ‌ప‌డం వ‌ల్ల రెండు చోట్ల ప్ర‌మాదాలు జ‌రిగాయి. తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్ జిల్లా సిరిసిల్ల‌లో ఆర్టీసీ బ‌స్సు మోటారు సైకిల్‌పై వెళుతున్న ఇద్ద‌రిని ఢీ కొన‌డంతో సంఘ‌ట‌న స్థ‌లిలోనే ఇద్ద‌రూ మ‌ర‌ణించారు. ఏపీలో జ‌రిగిన మ‌రో ప్ర‌మాదంలో ఇద్ద‌రు గాయ‌ప‌డ్డారు.
ఘ‌ర్ష‌ణ‌లు… వివాదాలు… అరెస్టులు…
హైద‌రాబాద్ ఎన్జీవో కాల‌నీ వ‌ద్ద ప్ర‌యాణికుల‌తో ఘ‌ర్ష‌ణకు దిగి బ‌స్సులు క‌ద‌ల‌కుండా చేయ‌డానికి ఆర్టీసీ కార్మికులు ప్ర‌య‌త్నించారు. ఈసంఘ‌ట‌న‌లో ప్ర‌యివేటు సిబ్బందికి, ఆర్టీసీ ఉద్యోగుల‌కు తోపులాట జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా 40 మంది ఆర్టీసీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ‌రంగ‌ల్ జిల్లాలో ఆర్టీసీ ఉద్యోగుల‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కొన్నిచోట్ల లాఠీల‌కు ప‌ని చెప్పారు. దీంతో కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల‌తో బ‌స్సులు న‌డిపేందుకు ఆర్టీసీ యాజ‌మాన్యం సిద్ద‌ప‌డ‌డాన్ని ఖండించారు.
నిజామాబాద్ జిల్లా అన్నాసాగ‌ర్ వ‌ద్ద బ‌స్సుల‌కు అడ్డు ప‌డి అద్దాల‌ను ప‌గుల‌గొట్టారు. ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. న‌ల్గొండ‌, ఖ‌మ్మం జిల్లాలోనూ ఇదే ప‌రిస్థితి. డిపోల వ‌ద్ద ధ‌ర్నాలు ఉద్రిక్త ప‌రిస్థితులు క‌ల్పించ‌డంతో ఇరు జిల్లాల్లోనూ పోలీసులు ఉద్యోగుల‌ను అరెస్ట్‌లు చేశారు.
తూర్పుగోదావ‌రి జిల్లాలో 145 అద్దె బ‌స్సుల‌ను రోడ్ల‌పైకి తీసుకువ‌చ్చారు. రావుల‌పాలెం వ‌ద్ద బ‌స్సుల‌ను ఆపి ప్ర‌యాణికుల‌తో గొడ‌వ‌కు దిగిన 20 మంది ఆర్టీసీ ఉద్యోగుల‌ను అరెస్ట్ చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో 130 అద్దె బ‌స్సుల‌ను న‌డిపిన‌ట్టు అధికారులు తెలిపారు. పోలీసుల సాయంతో ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో అధికారులు ఈ బ‌స్సుల‌ను న‌డిపిస్తున్నారు. శ్రీ‌కాకుళం జిల్లాలో 100 బ‌స్సులు, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 70 బ‌స్సులు న‌డిపిన‌ట్టు అధికారులు తెలిపారు. తాత్కాలిక డ్రైవ‌ర్ల‌తో న‌డుస్తున్న ఈ బ‌స్సుల్లో గాలి తీయ‌డానికి ఆర్టీసీ సిబ్బంది ప్ర‌య‌త్నించ‌డంతో పోలీసులు కొంత‌మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌పురం జిల్లాలో మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డిని ఆర్టీసీ కార్మికులు ఘెరావ్ చేశారు. త‌ప్ప‌ని ప‌రిస్థితిలో ఆయ‌న కారు దిగి న‌డిచి వెళ్ళాల్సి వ‌చ్చింది. రాయ‌చోటిలో బ‌స్సుల‌పై రాళ్ళు రువ్వి ఆర్టీసీ ఉద్యోగులు ప‌రిస్థితిని ఉద్రిక్తంగా మార్చారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
ర‌వాణా శాఖ మంత్రులిద్ద‌రూ చెరో మాట‌
మ‌రోవైపు ఆర్టీసీ స‌మ్మెను నివారించ‌డానికి కార్మిక సంఘాల నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలంగాణ ర‌వాణా మంత్రి మ‌హేంద‌ర్‌రెడ్డి తెలిపారు. స‌మ్మె విర‌మించాల‌ని ఆయ‌న కోరారు. మ‌రోవైపు యూనియ‌న్ నాయ‌కుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపే ప్ర‌స‌క్తే లేద‌ని ఏపీ ర‌వాణామంత్రి శిద్దా రాఘ‌వ‌రావు స్ప‌ష్టం చేశారు. ఈరోజు 3,850 బస్సులు నడిచాయని, రేపు 50శాతం పైగా బస్సులు నడిచే అవకాశం ఉందని చెప్పారు. సిబ్బంది స‌మ్మెతో ప్ర‌యాణికులు ఇబ్బందులు ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని, ఎక్క‌డైనా ఆర్టీసీ సిబ్బంది తిరిగే బ‌స్సుల‌ను ఆపాల‌ని ప్ర‌య‌త్నిస్తే చ‌ర్య‌లు క‌ఠినంగా ఉంటాయ‌ని ర‌వాణాశాఖ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు హెచ్చ‌రించారు.
First Published:  7 May 2015 11:35 AM IST
Next Story