పశువులను గౌరవిస్తాం..స్త్రీలను గౌరవించం....
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళుతున్నారని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నా ఆచరణలో అది జరగటం లేదని చాలా సందర్భాల్లో రుజువవుతూనే ఉంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి ముంబయిలో జరిగింది. సాక్షాత్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్న ఒక కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టుని నిర్వాహకులు, ఆమె మహిళ అయిన కారణంగా మూడు వరుసలు వెనక్కు వెళ్లి కూర్చోవాల్సిందిగా ఆదేశించారు. ఎబిపి మఝా ఛానల్ రిపోర్టర్ రష్మీ పురానిక్‌కి ఇలాంటి చేదు అనుభవం […]
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళుతున్నారని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నా ఆచరణలో అది జరగటం లేదని చాలా సందర్భాల్లో రుజువవుతూనే ఉంది. తాజాగా అలాంటి సంఘటన ఒకటి ముంబయిలో జరిగింది. సాక్షాత్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్న ఒక కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్టుని నిర్వాహకులు, ఆమె మహిళ అయిన కారణంగా మూడు వరుసలు వెనక్కు వెళ్లి కూర్చోవాల్సిందిగా ఆదేశించారు. ఎబిపి మఝా ఛానల్ రిపోర్టర్ రష్మీ పురానిక్‌కి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది
మహారాష్ట్ర ప్రభుత్వం గొడ్డుమాంసాన్ని నిషేధించిన నేపథ్యంలో, శ్రీ శాంతా క్రజ్ జైన్ తాపగచ్చా సంఘ్ అనే సంస్థ ముఖ్యమంత్రికి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన రష్మీ మామూలుగానే ముందువరుసలో రిపోర్టర్లకు కేటాయించిన సీట్‌లో కూర్చోబోయారు. ఇంతలో నిర్వాహకులు వచ్చి ఆమెను అడ్డుకుని వెనక్కు వెళ్లి కూర్చోవాల్సిందిగా కోరారు. ఊహించని పరిణామానికి బిత్తరపోయిన ఆమె, తరువాత తేరుకుని బిజెపి ముంబయి అధ్యక్షునికి ఈ విషయాన్ని ఫిర్యాదు చేశారు. దాంతో ఆమెకు ముందు వరుసలో కూర్చునే ఏర్పాటు చేశారు. అయితే సమస్య అక్కడితో తీరలేదు. మరి కాసేపటికి జైన్ సంఘ్ నుండి మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. తమ కల్చర్లో మహిళలు ముందు మూడు వరుసల్లో కూర్చోవడానికి వీలులేదని, ఆమె వెనక్కు వెళ్లాల్సిందేనని పట్టుబట్టారు. తమ కుటుంబాల్లోని మహిళలకైనా తాము ఇదే చెబుతామని వారు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే రష్మి మాత్రం ఇది తన మనసుని బాగా గాయపరచిందని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు ముంబయిలో ఇంతకుముందూ జరిగాయి. 2011లో ఒక కార్యక్రమంలో సైతం మహిళ అయిన కారణంగా నాటి ముంబయి మేయర్ శ్రద్ధా జాదవ్ వేదికమీద కూర్చోలేకపోయారు.
ప్రస్తుత సంఘటనలో తమ తప్పులేదని, ఆ సభా హాలుకి మేనేజర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తే ఈ నిర్ణయం తీసుకున్నారని జైన సంఘం చెబుతుండగా, దినేష్ థాకర్ అనే ఆ వ్యక్తి మాత్రం తామేమీ అలాంటి నిబంధనలు పెట్టలేదని అంటున్నారు.
దీనిపై స్పందించిన రష్మి, అలాంటి అభ్యంతరాలుంటే మహిళా జర్నలిస్టులను పంపవద్దని ముందుగానే ఛానల్స్ వారికి చెప్పి ఉండాల్సిందని, తనని రెండు సార్లు సీట్లోంచి లేపి, మూడు వరుసల వెనక్కు వెళ్లమన్నారని, గోవులను గౌరవించే వారు, మహిళలను మాత్రం తీవ్రంగా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి రష్మి ఆ కార్యక్రమాన్ని కవర్ చేయకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు.