ఇది 21 వ శతాబ్దకాల రాతియుగం!
పెళ్లికి నిర్చచనం ఏంటి? మనదేశంలో ఈ ప్రశ్న వేసుకుంటే చాలా భారమైన సమాధానాలు తడుముకోకుండా వచ్చేస్తాయి. చివరికి పదేళ్ల పిల్లనడిగినా పెళ్లి కేసెట్లలో వినిపించే ఒకటి రెండు పాటలైనా వినిపించకమానదు. ఇప్పుడు దీనిమీద మాట్లాడాల్సిన పనేమొచ్చిందంటే… భార్య అనుమతి లేకుండా భర్త ఆమెపై బలాత్కారానికి పాల్పడితే దాన్నిరేప్‌గా పరిగణించలేమని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే సెలవిచ్చింది. రేప్‌గా పరిగణించే విధంగా చట్టాల్లో సవరణ చేసే ఉద్దేశం ఉందా… అనే ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ […]
పెళ్లికి నిర్చచనం ఏంటి? మనదేశంలో ఈ ప్రశ్న వేసుకుంటే చాలా భారమైన సమాధానాలు తడుముకోకుండా వచ్చేస్తాయి. చివరికి పదేళ్ల పిల్లనడిగినా పెళ్లి కేసెట్లలో వినిపించే ఒకటి రెండు పాటలైనా వినిపించకమానదు. ఇప్పుడు దీనిమీద మాట్లాడాల్సిన పనేమొచ్చిందంటే… భార్య అనుమతి లేకుండా భర్త ఆమెపై బలాత్కారానికి పాల్పడితే దాన్నిరేప్‌గా పరిగణించలేమని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే సెలవిచ్చింది. రేప్‌గా పరిగణించే విధంగా చట్టాల్లో సవరణ చేసే ఉద్దేశం ఉందా… అనే ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి అలాంటిదేం లేదని సమాధానం చెప్పారు. ఇతరదేశాల్లో ఆ విధమైన చట్టం ఉండగా మనదేశ కల్చర్‌కి అది సూటవదనే ఉద్దేశంతో మన చట్టాల్లో ఈ అంశాన్ని చేర్చలేదు. నిర్భయ ఉదంతం తరువాత అలాంటి ప్రతిపాదనలు వచ్చాయి.
మొత్తానికి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకటితమైన తరువాత మరోసారి మనముందు అనేక ప్రశ్నలు నిలుస్తున్నాయి. ఏ విషయమైతే మహిళలను అసమానులుగా సమాజం ముందు నిలబెడుతున్నదో దాన్ని ప్రభుత్వం యధాతథంగా ఉంచేందుకు మొగ్గు చూపుతున్నది. వివాహంలో స్త్రీ పురుషులకు సమాన హక్కులు లేవన్నది సైతం చెప్పకనే చెబుతోంది. సమానహక్కులు లేవని ఎప్పుడైతే నిర్ధారించిందో అప్పుడే ప్రభుత్వం మహిళలపై హింసకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే లెక్క. మహిళల పరంగా భావజాలంలో ఎలాంటి మార్పునీ అంగీకరించడం లేదని కూడా అర్ధమవుతోంది. మహిళని ఇంకా భర్తకు సంబంధించిన ఆస్తిగానే పరిగణించడం స్పష్టమవుతోంది. లైంగిక దోపిడికి, హింసకు గురయ్యే ప్రమాదమే స్త్రీకి సర్వ అనర్ధాలు తెచ్చిపెడుతుండగా, ఆ విషయంలో ఆమెను సర్వస్వతంత్రురాలిగా ఉంచేందుకు అటు సమాజంకానీ, ఇటు ప్రభుత్వాలు కానీ సుముఖత చూపటం లేదు. వాక్ స్వాతంత్ర్యం భావ స్వాతంత్ర్యం… కన్నా ఏ రకంగా తక్కువ ఈ స్వేచ్ఛ. ప్రభుత్వ నిర్ణయం విన్నాక ఇప్పుడు తాజాగా పెళ్లంటే ఏంటి…అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం కనబడుతోంది. భార్యకు ఇష్టంలేకుండా ఆమెపై బలాన్ని ప్రయోగించడం గృహహింస పరిధిలోకి రాకుండా ఎలా ఉంటుంది? భర్తయితే చాలు…మహిళ నోరుమూసుకుని పడి ఉండాలి…అనే హుకుం ప్రభుత్వమే జారీ చేశాక….ప్రభుత్వం సైతం మహిళని మగవాడి కోర్కెలు తీర్చే యంత్రమని మరింత స్పష్టంగా చెప్పినట్టుగానే భావించాలి.
వ్యక్తుల (స్త్రీని సైతం వ్యక్తిగా భావిస్తే) స్వేచ్ఛను హరించి కాపాడుకునే కుటుంబాలు, సంప్రదాయాలు కలకాలం నిలుస్తాయా? నిలిచినా అది ఎవరి కోసం…. వివాహం అనేది మనిషి జీవన క్రమాన్ని సరళం, సుఖమయం, సురక్షితం చేసేలా ఉండాలి. దాన్ని అలాగే వినియోగించుకోవాలి. అలా కాకుండా, దాన్ని సనాతన మత విశ్వాసాలను నిలబెట్టుకునే ఒక ఆచారంగా మాత్రమే చూస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక పక్క ఇలాంటి ధోరణి ఉండగా, మరొక పక్క మహిళలకు సమాన హక్కులు, గుర్తింపు, గౌరవం సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికే మన వివాహ వ్యవస్థ ఒడిదొడుకుల్లో ఉంది. మహిళలను అన్ని సమాన హక్కులూ ఉన్నవారిగా, పురుషులను వారి హక్కులను గౌరవించే వారిగా మార్చేందుకు ప్రభుత్వాలు దోహదం చేస్తేనే వివాహ వ్యవస్థని సరిగ్గా వినియోగించుకునే అవకాశం వారిద్దరికీ ఉంటుంది. సరళీ కృత ఆర్థిక విధానాల మీద పెట్టినంత శ్రద్ధని, ప్రభుత్వాలు సరళీకృత జీవన విధానాలపై కూడా పెడితే బాగుంటుంది.