వాలి (STORY FOR CHILDREN)
బలవంతుల్లో కెల్లా అత్యంత బలవంతుడు వాలి! ఎంతటి బలవంతుడంటే ఆదర్శవంతుడైన రాముడి చేతనే తప్పు చేయించేటంత బలవంతుడు. ఔను, రాముడు కూడా వంచన చెయ్యక తప్ప లేదు. చెట్టు చాటు నుండి బాణం వెయ్యక తప్ప లేదు. ఏం వాలికి ఎదురుగా నిలబడి పోరాడొచ్చుకదా? అని అనుకుంటున్నారా? అది రాముడికే సాధ్యం కాలేదు. ఎందుకంటే వాలి ఎవరితోనైతే పోరాడుతాడో – అలా పోరాడిన వాళ్ళలో, ఎదురు నిలిచిన వాళ్ళలో ఎంత శక్తి వుంటుందో అందులో సగం […]
బలవంతుల్లో కెల్లా అత్యంత బలవంతుడు వాలి! ఎంతటి బలవంతుడంటే ఆదర్శవంతుడైన రాముడి చేతనే తప్పు చేయించేటంత బలవంతుడు. ఔను, రాముడు కూడా వంచన చెయ్యక తప్ప లేదు. చెట్టు చాటు నుండి బాణం వెయ్యక తప్ప లేదు. ఏం వాలికి ఎదురుగా నిలబడి పోరాడొచ్చుకదా? అని అనుకుంటున్నారా? అది రాముడికే సాధ్యం కాలేదు. ఎందుకంటే వాలి ఎవరితోనైతే పోరాడుతాడో – అలా పోరాడిన వాళ్ళలో, ఎదురు నిలిచిన వాళ్ళలో ఎంత శక్తి వుంటుందో అందులో సగం వచ్చి వాలి శక్తిలో చేరిపోతుంది! అంటే ఎదుటి వాళ్ళ సగం శక్తి అతని ఖాతాలోనే వెళ్ళిపోతుంది. అలాంటి వరం పొందిన వాడు వాలి!
గౌతముడి రూపం ధరించిన ఇంద్రుడి వల్ల అహల్యకు పుట్టినవాడు. తండ్రి అయిన గౌతముడిచే శపించబడిన వాడు. ముందు వాలి రూపం సుందరమే. తనకు పుట్టిన వాళ్ళు కాదని కూతురు అంజన వల్ల తెలిసాక వాలీ సుగ్రీవులనిద్దరినీ సముద్రంలోకి విసిరేసి “వానరులు కండి” అని అనడంతో రూపుమారినవాడు.
ఋక్ష విరజుడు చేరదీయగా పెరిగినవాడు. కిష్కిందకు రాజయినవాడు. తారను చేపట్టిన వాడు. రావణుని సయితం ఓడించినవాడు. హిమాలయ పర్వతమును ధిక్కరించి వచ్చి యుద్ధానికి రమ్మని సవాలు చేసిన దందుభిని సంహరించిన వాడు. మాయావిని మట్టు బెట్టిన వాడు. తమ్ముడైనా శత్రువుగా భావించి సుగ్రీవుణ్ణి ఓడించి పారిపోయేలా చేసినవాడు. చివరకు రాముని చేతిలో దొంగ చాటుగా బాణం వేయడం వల్ల ప్రాణాలు విడిచిన వాడు. వాలి మామూలు వాడు కాదు. అంగదునికి జన్మనిచ్చిన వాడు.
సోదరుడు సుగ్రీవునితో శతృత్వానికి, వైరానికి అపోహలే కారణమయ్యాయి. యుద్ధ సమయంలో వాలికి ఎదురునిలవలేని మాయావి గుహలో దూరాడు. వెంబడించిన వాలి గుహలోకి దూరాడు. ఎప్పటికీ బయటకు రాలేదు. రక్తం మాత్రం ధారలు కట్టి వచ్చింది. మాయావి చేతిలో అన్న హతమైనాడని సుగ్రీవుడు తారతో కలిసి భావించాడు. ఆ గుహకు అడ్డంగా పెద్ద రాతిని వుంచాడు. మాయావితో తమకు ఆపద కలగ కూడదని భావించాడు. రాతిని నెట్టుకు వచ్చిన వాలి తన సింహాసనం మీద సుగ్రీవుణ్ణి చూసి – తన భార్య తారను పట్టపురాణిగా చేసుకోవడం చూసి – పగతో రగిలిపోయిన వాలి సుగ్రీవుణ్ణి తరిమేసి తారనూ, రాజ్యాన్ని వశం చేసుకున్నాడు.
అయితే సుగ్రీవుడు రాముని సాయం కోరాడు. సీత జాడకోసం తను చేసే సాయానికి ప్రతిఫలంగా వాలిని సంహరించాలనీ కోరాడు. రాముడు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి వాలికి ఎదురు నిలవలేని రాముడు చెట్టు చాటు నుండి బాణం వేసాడు. వాలి రాముడి చేతిలోనే ప్రాణాలు వదిలాడు.
వాలిని పోలిన వానరుడు కిష్కంధలోనే కాదు ఎక్కడా లేనే లేడు!.
– బమ్మిడి జగదీశ్వరరావు