Telugu Global
Editor's Choice

ఆమె..... కొత్త ప్ర‌పంచాన్నిసృష్టిస్తున్న బంగారు త‌ల్లి!

సునీతా కృష్ణ‌న్‌…..మ‌రే పేరుతోనూ, ఏ మ‌నిషితోనూ పోల్చిచెప్ప‌డానికి వీలులేని వ్య‌క్తి ఆమె. అంతా బాగున్న‌ట్టు  క‌నిపిస్తున్న స‌మాజంలో ఆమెది గాయాల బాట‌…ప్ర‌మాదాల‌తో స‌య్యాట‌. త‌న ప‌దిహేనవ ఏట అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్‌కి గుర‌యిన సునీత‌ జీవితం ఆ త‌రువాత ఎన్నో మ‌లుపుల‌కు గుర‌య్యింది. ప‌దేళ్ల వ‌య‌సునుండే స‌మాజం ప‌ట్ల త‌న‌కంటూ ఒక బాధ్య‌త ఉంది…అనే ఆలోచ‌న‌ల‌తో పెరిగిన సునీత, ఆ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించే క్ర‌మంలో….బాధ్య‌త‌ల్లో రాటుదేలారు కానీ,  స‌మాజం ప‌ట్ల మ‌రింత సున్నితంగా మారారు. మ‌హిళ‌ల, […]

ఆమె..... కొత్త ప్ర‌పంచాన్నిసృష్టిస్తున్న బంగారు త‌ల్లి!
X

సునీతా కృష్ణ‌న్‌…..మ‌రే పేరుతోనూ, ఏ మ‌నిషితోనూ పోల్చిచెప్ప‌డానికి వీలులేని వ్య‌క్తి ఆమె. అంతా బాగున్న‌ట్టు క‌నిపిస్తున్న స‌మాజంలో ఆమెది గాయాల బాట‌…ప్ర‌మాదాల‌తో స‌య్యాట‌. త‌న ప‌దిహేనవ ఏట అత్యంత దారుణంగా గ్యాంగ్ రేప్‌కి గుర‌యిన సునీత‌ జీవితం ఆ త‌రువాత ఎన్నో మ‌లుపుల‌కు గుర‌య్యింది. ప‌దేళ్ల వ‌య‌సునుండే స‌మాజం ప‌ట్ల త‌న‌కంటూ ఒక బాధ్య‌త ఉంది…అనే ఆలోచ‌న‌ల‌తో పెరిగిన సునీత, ఆ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించే క్ర‌మంలో….బాధ్య‌త‌ల్లో రాటుదేలారు కానీ, స‌మాజం ప‌ట్ల మ‌రింత సున్నితంగా మారారు. మ‌హిళ‌ల, బాలిక‌ల అక్ర‌మ ర‌వాణా, లైంగిక దోపిడుల‌పై ఒక సుదీర్ఘ ఉద్య‌మం మ‌నిషి రూపం దాలిస్తే ఆమే సునీతా కృష్ణ‌న్‌. అన్యాయంగా, అక్ర‌మంగా ఈ బాట‌లో జీవితాలు కోల్పోతు న్న‌వారే సునీత ప్ర‌పంచం. వారికోసం, వారి పిల్ల‌ల కోసం ఆమె న‌డుపుతున్న ప్ర‌జ్వ‌ల సంస్థ వేల‌మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది.. త‌న ప్ర‌యాణంలో సునీత ఎదుర్కొన్న‌ది కేవ‌లం ఒడిదొడుకులు కాదు, ప్రాణాల‌నే ప‌ణంగా పెట్టారు. ప‌ద్దెనిమిది సార్లు తీవ్ర‌మైన దాడుల‌కు గుర‌య్యారు. అవ‌న్నీ త‌నకు జాతీయ అంత‌ర్జాతీయ అవార్డులంటారామె. జైలు శిక్ష‌లు, దుర్భాష‌లు, కుటుంబం వెలివేయ‌టం, స‌మాజం దూరంగా పెట్ట‌టం లాంటివ‌న్నీ చ‌విచూశారు. ఎంత‌గా మ‌న‌సు, శ‌రీరం గాయాల పాల‌వుతుంటే ఆమె బాధితుల‌ప‌ట్ల అంత ద‌య‌గా మారారు. స‌మాజం మారుతుంద‌నే న‌మ్మ‌కాన్ని అంత‌గా పెంచుకున్నారు. దాదాపు ఏడువేలమందికి పైగా పిల్లలు, యువ‌తులు, మ‌హిళ‌లతో ప్ర‌జ్వ‌ల ఒక కొత్త ప్ర‌పంచం. ఒక కొత్త స‌మాజం. అత్యాచార కేసుల్లో నేర‌స్తుల‌ను వ‌దిలేసి బాధితుల‌ను వెలివేసే స‌మాజంలో మార్పుకోసం సునీత ఒక యుద్ద‌మే చేస్తున్నారు. నిజానికి ఈ ప్ర‌పంచంలో అలాంటి మైండ్‌సెట్ ఉన్న ప్ర‌తిఒక్క‌రిపై ఆమె పోరాటం చేస్తున్నారు. మార్పు వస్తుంద‌నే ఆశ‌తో ఉన్నారు.

ఈ క్ర‌మంలో త‌న శ‌రీరం, మ‌నసు, ఆత్మ కోలుకోలేని గాయాల బారిన ప‌డినా…గాయాల సంఖ్య పెరిగిన కొద్దీ మ‌రింత పాజిటివ్‌గా స‌మాజం ప‌ట్ల ద‌య‌గా, బాధ్య‌త‌గా, మ‌రింత మాన‌వ‌త‌తో స్పందిస్తున్నారు. పురుషాధిప‌త్య ప్ర‌పంచంలో స్త్రీ శ‌రీరం, పురుషుడికి ఆనందాన్నిచ్చే భోగ‌వ‌స్తువు కాదు…అని నిన‌దిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె తీసిన బంగారుత‌ల్లి సినిమా, గాలి పీల్చినంత స‌హ‌జంగా, మ‌నం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్య‌త‌ల‌ను ఘాటుగా గుర్తు చేస్తుంది. మ‌నం నివ‌సిస్తున్న స‌మాజాన్నిస్వ‌చ్ఛంగా ఉంచేందుకు కృషి చేస్తున్న సునీత ఓ కొత్త ప్ర‌పంచాన్ని ఊహిస్తున్న, సృష్టిస్తున్న బంగారు త‌ల్లి. లైంగిక‌దోపిడికి గుర‌వుతున్న వారు, వారి పిల్ల‌లు, వారిలో హెచ్ ఐవి బాధితులు…సునీత ప్ర‌పంచం ఇది…సామాన్యులకు అమ్మో అనిపిస్తుంది….అదంతా త‌మ‌ది కాని ప్ర‌పంచ‌మ‌నిపిస్తుంది. కానీ, ఒక విష‌యం మ‌న‌మంతా గుర్తుంచుకోవాలి. అస‌లైన దుర్మార్గ స‌మాజంలో మ‌న‌ముంటున్నాం. ఆమెతో ఉన్నది బాధితులు. బాధ‌పెట్టేవారు స‌భ్య స‌మాజంలో భాగంగా మనతో ఉన్నారు.

మ‌ల‌యాళీ మాతృభాష అయి, బెంగ‌ళూరులో పుట్టి పెరిగిన ఆమె హైద‌రాబాద్‌ని త‌న కార్య‌స్థ‌లిగా ఎంచుకున్నారు. నిజానికి ఆమె పోరాట వేదిక ప్ర‌పంచం. ఈ నేప‌థ్యంలో ఎంతో కృషి చేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. అయితే ఆమె అందుకున్న అవార్డుల‌కంటే, బాధిత మ‌హిళ‌ల‌కు ఆమె ఒక బ‌హుమ‌తిగా దొర‌క‌టమే మ‌రింత గొప్ప‌విష‌యం. సునీత ఈ రోజు 24వ యుధ్‌వీర్ ఫౌండేష‌న్ మెమోరియ‌ల్ అవార్డుని అందుకుంటున్న‌సంద‌ర్భంగా తెలుగు గ్లోబల్‌.కామ్‌ శుభాకాంక్ష‌లు చెబుతోంది. ఆమె ఆకాంక్ష‌ల్లో భాగం పంచుకుంటోంది.

First Published:  30 April 2015 11:16 AM IST
Next Story