Telugu Global
Others

బెంగాల్, మహారాష్ట్రలో బీజేపీ బోల్తా

మహారాష్ట్ర, బెంగాల్ లో బీజెపీ విజయ యాత్రకు గండి పడింది. మహా రాష్ట్రలో శివసేనను వెనక్కు నెట్టి తన ప్రాభావాన్ని పెంచుకోవాలన్న బీజేపీ ఎత్తుగడ బెడిసి కొట్టింది. నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్ సీ పీ విజయ కేతనం ఎగుర వేస్తే బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలలో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తన ఆధిపత్యం చాటుకుంది. ముంబై నగరం మీద ఒత్తిడి తగ్గించడానికి 1970ల ఆరంభంలో నవీ […]

బెంగాల్, మహారాష్ట్రలో బీజేపీ బోల్తా
X

RV Ramaraoమహారాష్ట్ర, బెంగాల్ లో బీజెపీ విజయ యాత్రకు గండి పడింది. మహా రాష్ట్రలో శివసేనను వెనక్కు నెట్టి తన ప్రాభావాన్ని పెంచుకోవాలన్న బీజేపీ ఎత్తుగడ బెడిసి కొట్టింది. నవీ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో శరద్ పవార్ నాయకత్వంలోని ఎన్ సీ పీ విజయ కేతనం ఎగుర వేస్తే బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలలో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తన ఆధిపత్యం చాటుకుంది.

ముంబై నగరం మీద ఒత్తిడి తగ్గించడానికి 1970ల ఆరంభంలో నవీ ముంబై నగరాన్ని నిర్మించడం ప్రారంభించారు. 2011నాటి జనాభా లెక్కల ప్రకారం నవీ ముంబై జనాభా 11 లక్షల 19 వేల 477. ఈ స్థానిక సంస్థలో ఎన్ సీ పీ 52 స్థానాలు సంపాదిస్తే కాంగ్రెస్ 10 స్థానాలు సంపాదించింది. ఎన్నికల తర్వాత ఎన్ సీ పీ తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకున్నది. దీనితో 111 సీట్లున్న నవీ ముంబైలో ఎన్ సీ పీ అధికారంలోకి వస్తుంది. శివసేన 38 స్థానాలు సంపాదించి పరువు నిలబెట్టుకోవడమే గాక తమను వెనక్కు నెట్టాలన్న బీజేపీ ప్రయత్నాలకు గండి కొట్టింది. బీజేపీ నవీ ముంబై లో ఆరు స్థానాలతో సంత్రుప్తి పడక తప్ప లేదు.

మజ్లిస్ విజయకేతనం

ఔరంగాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లోకూడా శివ సేన 28 స్థానాలు సంపాదిస్తే ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న బీజేపీ 24 సీట్లు సంపాదించగలిగింది. స్థానిక సంస్థల ఎన్నికలలో శివసేనతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని స్థానిక నాయకులు ఒత్తిడి చేసినా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకరించలేదు. ఔరంగాబాద్ లో మొత్తం 113 స్థానాలుంటే హైదరాబాద్ లో మాత్రమే బలం ఉందనుకున్న అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 26 స్థానాలు సాధించి ముస్లింలు, దళితులలో తన బలాన్ని పెంచుకోవాలన్న సంకల్పాన్ని నెరవేర్చుకుంది. అయితే నవీ ముంబైలో మాత్రం మజ్లిస్ ఒక్క స్థానమైనా సంపాదించలేక పోయింది. ఔరంగాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ లో శివ సేన తర్వాత మజ్లిస్ రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ మూడో స్థానంలో ఉంది. గత ఏడాది మహారాష్ట్ర శాసన సభ ఎన్నికలలో మజ్లిస్ ఔరంగాబాద్, ముంబైలోని బైకుల్లా శాసన సభ సీట్లు సంపాదించి శాసన సభలో ప్రవేశించింది. హైదరాబాద్ శాసనసభ తర్వాత మజ్లిస్ కు చోటు దక్కింది మహారాష్ట్ర శాసన సభలో మాత్రమే.

ganesh-naikనవీ ముంబైలో ఎన్ సీ పీ నాయకుడు గణేష్ నాయక్ వరసగా ఐదవసారి తన పట్టు నిరూపించుకున్నారు. గత శాసన సభ ఎన్నికలలో ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడంతో బీజేపీ ఆశలు పెంచుకున్నా స్థానిక సంస్థలలో మాత్రం బీజేపీ ఆటలు సాగలేదు.


బెంగాల్ లో బోల్తా పడ్డ బీజేపీ

బెంగాల్ లో వామపక్షాలు ఘోరంగా దెబ్బ తిన్నందువల్ల తృణమూల్ ను ఎదుర్కునే శక్తి తమకు మాత్రమే ఉందని బీజేపీ ఉవ్విళ్లూరింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా బెంగాల్ లో పట్టు సాధించడానికి నానా పాట్లు పడుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో మొత్తం 42 స్థానాలకు గాను అధికారంలో ఉన్న తృణమూల్ 34 సీట్లు సంపాదించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. మొట్టమొదటి సారి బెంగాల్ లో బీజేపీకి రెండు లోక్‌ సభ స్థానాలు దక్కాయి. మూడు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న వామపక్ష ఫ్రంటుకు దక్కింది రెండు లోక్‌ సభ స్థానాలే. నాలుగు స్థానాలు సాధించిన కాంగ్రెసే నయమనిపించుకుంది. దీనితో బీజేపీ తానే బెంగాల్ లో ప్రత్యామ్న్యాయ శక్తిగా ఎదగగలననుకుంది. లోక సభ ఎన్నికలలో 30 లోక్‌ సభ స్థానాలలో బీజేపీ మూడో స్థానంలో నిలవడం కూడా ఆ పార్టీ ఆశలు పెంచుకోవడానికి కారణమైంది.

అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ ఆశలన్నీ వమ్ము అయినాయి. మొత్తం 91 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అధికారంలో ఉన్న తృణమూల్ 71 స్థానిక సంస్థలను స్వాధీనం చేసుకుని మమతా బెనర్జీకి తిరుగులేదని నిరూపించగలిగింది. కోల్కతా మునిసిపల్ కార్పొరేషన్ లో ఉన్న మొత్తం 144 వార్డుల్లో తృణమూల్ 114 వార్డుల్లో విజయం సాధించింది. వామపక్షాలు అయిదు మునిసిపాలిటీలే సాధించినా ఇంకా ప్రధాన ప్రతిపక్షం తామేనని రుజువు చేసుకున్నాయి. బీజేపీ కి ఒక్క మునిసిపాలిటీ అయినా దక్కలేదు.

ncp-celebrates2010లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తృణమూల్ కు 66 మునిసిపాలిటీలుంటే ఇప్పుడు వాటి సంఖ్య 71కి పెరిగింది. మమతా బెనర్జీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారనీ, శారదా కుంభ కోణంలో తృణమూల్ నాయకులకు ప్రమేయముందని వార్తలు వచ్చినా, సాక్షాత్తు తృణమూల్ మంత్రి మీదే సీబీఐ కేసు నమోదు చేసినా ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకే పట్టం కట్టారు. అయితే ఓడినా తమ బలం అంతో ఇంతో పెరిగిందని బీజేపీ నాయకులు సంతోషిస్తున్నారు. 2010లో జరిగిన ఎన్నికలలో బీజేపీ 10 వార్డులు మాత్రమే గెలుచుకోగలిగితే ఇప్పుడు 85 వార్డులలో విజయం సాధించామన్న సంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు.

బెంగాల్ శాసన సభ ఎన్నికలు 2016లో జరగనున్నాయి. అప్పుడు తృణమూల్ ను ఎదుర్కునేది తామేనని ఇప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్ హా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ స్థానిక సంస్థలలో మొత్తం 2090 వార్డులుంటే 1425 స్థానాలు సాధించింది తృణమూలే కావడం విశేషం. కాంగ్రెస్ నుంచి అనేక మంది తృణమూల్ పార్టీలో చేరినా ముర్షీదాబాద్, మాల్దా, పురూలియా జిల్లాల్లో కాంగ్రెస్ తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోగలిగింది. సిలిగురి మునిసిపల్ కార్పొరేషన్ లో మొత్తం 47 వార్డులలో 23 వార్డులు సంపాదించిన వామపక్షానికి అదే పదివేలుగా భావించక తప్పదు.

ఒక్క బెంగాల్ లోనే 10లక్షల మంది బీజేపీ సభ్యులున్నారని బీజేపీ గొప్పలు చెప్పుకుంటోంది. ఆ సభ్యత్వ సంఖ్య వాస్తవమే అయినా చాలా మంది తృణమూల్ ను కాదనుకొని బీజేపీలో చేరారన్నది వాస్తవం. అది బీజేపీకి వాపే కాని బలుపుగా పరిగణించడం కష్టం.

– ఆర్వీ రామారావ్

First Published:  30 April 2015 12:17 PM IST
Next Story