మీ త్యాగాల ఫలితమే తెలంగాణ సాధన: కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షునిగా ఎనిమిదోసారి ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఎల్.బి స్టేడియంలో జరుగుతున్న ప్లీనరీ సమావేశంలో ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు, హోంమంత్రి నాయని నరసింహరెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత కేసీఆర్ సమావేశంలో అధ్యక్షోపన్యాసం చేశారు. తెలంగాణ సాధించుకోవడానికి ఎంత కష్టపడ్డామో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మన కలను సాకారం చేయకుండా ఆపలేకపోయారు. ఎక్కడా మడం తిప్పకుండా పోరాటం సాగించాం. […]
సంస్కృతి సంప్రదాయాలను, యాస, భాషలను కించపరిచారు. అయినా సిగ్గు పడలేదు… మొగం చాటేయలేదు. తెలంగాణ సాధన మన హక్కని భావించాం. సాధించాం. దీని సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా… జన దీక్ష నుంచి జల దీక్ష దాకా… ఒక్కటై పోరాడం. ఈ ఘనత అంతా టీఆర్ఎస్ కార్యకర్తలదే. ఒక్క కేసీఆర్‌గా పయనం మొదలెట్టా… మధ్యలో ఒక్కొక్కరూ వచ్చి చేయి చేయి కలిపి తెలంగాణ కలను సాకారం చేశారు. అంతా ఉద్యమంలా… ఉప్పెనలా కదిలారు కాబట్టే ఇది సాధ్యమైంది. ఇందులో కళాకారులంతా కడలి తరంగంలా కదిలారు. పోలీసు కాల్పులకు ఎదురొడ్డారు. లాఠీలకు శరీరం అప్పగించారు… నా తెలంగాణ కోటి రత్నాల వీణ… అంటూ కొంతమంది ప్రాణాలను పణంగా పెట్టారు. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారు వ్యూహాలు రచిస్తే … దాన్ని అమలుకు, అందరూ ఆశ్చర్యపోయే విధంగా కదిలాం… సాధించాం… అని చంద్రశేఖర్‌రావు అన్నారు.