కమర్షియల్ రంగంలో మన ముద్ర కష్టమే..నందితా దాస్
నందితా దాస్ అంటే భారత సినిమా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె నటించే చిత్రాల వల్లనే అలాంటి గుర్తింపు వచ్చింది. ఇటీవల బెంగళూరులో ఒక వజ్రాల నగల ప్రమోషన్ కార్య క్రమంలో నందిత పాల్గొన్నారు. ఆమె ఇలాంటి కార్యక్రమంలోనా…అని ఆశ్చర్యపోయిన వారికి నైతిక విలువలతో కూడిన వ్యాపారాన్ని సమాజానికి పరిచయం చేయటంలో పాలుపంచుకోవటం ఒక బాధ్యతగా భావిస్తున్నానంటూ సమాధానం చెప్పారు. డబ్బు, వాణిజ్య వ్యవహారాలే ప్రధానంగా భావించే సినీ రంగంలో తనదైన ముద్రను, అభిరుచులను […]
నందితా దాస్ అంటే భారత సినిమా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె నటించే చిత్రాల వల్లనే అలాంటి గుర్తింపు వచ్చింది. ఇటీవల బెంగళూరులో ఒక వజ్రాల నగల ప్రమోషన్ కార్య క్రమంలో నందిత పాల్గొన్నారు. ఆమె ఇలాంటి కార్యక్రమంలోనా…అని ఆశ్చర్యపోయిన వారికి నైతిక విలువలతో కూడిన వ్యాపారాన్ని సమాజానికి పరిచయం చేయటంలో పాలుపంచుకోవటం ఒక బాధ్యతగా భావిస్తున్నానంటూ సమాధానం చెప్పారు. డబ్బు, వాణిజ్య వ్యవహారాలే ప్రధానంగా భావించే సినీ రంగంలో తనదైన ముద్రను, అభిరుచులను నిలబెట్టుకోవటం కష్టమైన పనే అంటూ, అది ఒక పోరాటం లాంటిదే అంటున్నారు. చాలామంది తనను మీరెందుకు కమర్షియల్ చిత్రాలు చేయటం లేదు అని అడుగుతుంటారని, కానీ మనం దేనికి స్పందిస్తామో, దాన్ని చేయడానికి మాత్రమే ఇష్టపడతాం కదా…. ఈ ప్రశ్నకు అదే సమాధానం అంటారామె. మనం కొన్ని విలువలకు కట్టుబడి ఉన్నపుడు ఆ మార్గంలోనే ప్రయాణం చేసేందుకు ఇష్టపడతామని, అప్పుడు అంతర్గత సంఘర్షణ ఉండదని నిందిత చెబుతున్నారు. ఆమె నటించిన భవాండర్, ఎర్త్, ఫైర్, హజార్ చౌరసీ కి మా, దేవేరి లాంటివి నటిగా ఎంతో పేరుని తెచ్చిపెట్టాయి. ఫిరాఖ్ చిత్రంతో దర్శకురాలిగా అరంగేట్రం చేశారు. మనకు నచ్చిన కథలను మనం చెప్పాలంటే దర్శకత్వం ఒక్కటే మార్గం… లేకపోతే ఎప్పటికీ ఇతరుల కథల్లో పాత్రలుగా మిగిలిపోతామనేది నందిత అభిప్రాయం. ప్రస్తుతం ఆమె సాదత్ హసన్ మాంటో అనే చిన్నకథల రచయిత జీవితాన్ని దర్శకురాలిగా తెరకెక్కించనున్నారు. 1940ల్లో రాసిన ఆయన కథలు నేటి కాలానికీ సరిగ్గా సరిపోతాయని, ఆరోజుల్లోనే ఆయన భావ స్వేచ్ఛపై విపులంగా చర్చించారని, సమాజంలో మహిళల పాత్రపై, సెక్స్ వర్కర్లపై చక్కని కథలు రాశారని నందిత అన్నారు. ప్రస్తుతం ఈ కథపై వర్క్ చేస్తున్న నందిత, కేన్స్ చిత్రోత్సవంలో తన సినిమాకు నిర్మాత దొరుకుతారనే ఆశాభావంతో ఉన్నారు. బాంబే, లాహోర్‌ల్లో మాంటో జీవించిన పదేళ్ల కాలాన్ని తన చిత్రానికి కథా నేపథ్యంగా వాడుతున్నట్టుగా తెలిపారు. ఇందుకోసం లాహోర్‌వెళ్లి మాంటో ముగ్గురు కుమార్తెలను కలిశారామె. మాంటో చిత్రంతో లాహోర్ లో రూపొందే తొలి భారతీయ సినిమా నందితదే అవుతుంది. ప్రస్తుతం నందిత ఒక ఆస్ట్రేలియా చిత్రానికి రచయితగా పనిచేస్తున్నారు. సోషల్ వర్క్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన నందిత అదే దృక్పథంతో సినీ రంగంలోనూ కొనసాగుతున్నారు. సీరియస్ నటిగా తనపై ముద్ర ఉన్నా తనకు కామెడీ చిత్రాలన్నా ఇష్టమే అంటున్నారు. తన చుట్టూ ఉన్న ప్రపంచానికి స్పందించడమే తన విధానంగా సాగుతున్నా, కామెడీ, థ్రిల్లర్ చిత్రాలూ చేయగలనంటున్నారు. ఎంటర్ టైన్ మెంట్ అనే పదం తనకు నచ్చదని, కానీ సినిమాల్లో అర్థవంతంగా ఉన్న వినోదం తనకు నచ్చుతుందని నందిత చెబుతున్నారు.