'బాబు' నమూనా ఎడారి ఒయాసిస్సే !
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారం వెతకమన్నారు మన పెద్దలు. ఇదేదో నానుడి కాదు. అనుభవంతో చెప్పిన విషయం.మన రాష్ట్రంలో సమస్యలు ఉంటే, అభివృద్ధిని వేగవంతం చేయాలంటే ఇక్కడే అందుకు సంబంధించిన పరిష్కారాలను, ప్రత్యామ్నాయాలను రూపొందించుకోవాలి.అందుకు స్వదేశీతోపాటు విదేశీ శాస్త్రసాంకేతిక పరిజ్ఞనాన్ని వాడుకోవచ్చు. కాని మన చంద్రబాబునాయడుగారు ఇక్కడి సమస్యలకు జపాన్, సింగపూర్, చైనాలలో పరిష్కారం వెదుకుతున్నారు.పులిని చూసి నక్కవాతపెట్టుకున్న చందంగా ఉంది.ఆయాదేశాలు పులులూకాదు మన దేశం నక్క అంతకన్నా కాదు. కాని మన ముఖ్యమంత్రి ఆ విధంగానే […]
ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారం వెతకమన్నారు మన పెద్దలు. ఇదేదో నానుడి కాదు. అనుభవంతో చెప్పిన విషయం.మన రాష్ట్రంలో సమస్యలు ఉంటే, అభివృద్ధిని వేగవంతం చేయాలంటే ఇక్కడే అందుకు సంబంధించిన పరిష్కారాలను, ప్రత్యామ్నాయాలను రూపొందించుకోవాలి.అందుకు స్వదేశీతోపాటు విదేశీ శాస్త్రసాంకేతిక పరిజ్ఞనాన్ని వాడుకోవచ్చు. కాని మన చంద్రబాబునాయడుగారు ఇక్కడి సమస్యలకు జపాన్, సింగపూర్, చైనాలలో పరిష్కారం వెదుకుతున్నారు.పులిని చూసి నక్కవాతపెట్టుకున్న చందంగా ఉంది.ఆయాదేశాలు పులులూకాదు మన దేశం నక్క అంతకన్నా కాదు. కాని మన ముఖ్యమంత్రి ఆ విధంగానే పరిగణిస్తున్నారు. వాటిని చూసే మనం నేర్చుకోవాలనేది ఆయన ధోరణి. మంచిని, ప్రగతిని ఆదర్శంగా తీసుకోవటం తప్పేమీలేదు. అయితే భౌగోళికంగా గాని, రాజకీయ, పరిపాలనా, ఆర్థిక, వాతావరణ పరంగా ఏమాత్రం పోలికలేని దేశాలతో మన రాష్ట్రాన్ని పోల్చుకుని అదే విధంగా మనం ఉండాలని కోరుకోవటం లేదా,ఆ విధంగా ఎదిగేందుకు చిత్తశుద్ధితో ప్రయత్తిస్తున్నట్లు రాజకీయంగా ప్రవర్తించటం ఎవరిని మోసగించటానికి ? ప్రజలను కాదా ? ఏదేశ పరిస్థితులకు అనుగుణంగా అక్కడి ప్రభుత్వాలు ప్రాధాన్యతల ప్రకారం అభివృద్ధి ప్రణాళికలు అమలుచేసుకుంటాయి.
అంతో ఇంతో మనకు చైనాతో సామీప్యత ఉంది. సరిహద్దు దేశం కావటంతోపాటు భౌగోళికంగా ఒకే విధమైన పరిస్థితులు ఉన్నాయి. కాని రాజకీయంగా మనకు విరుద్ధమైనది. ఆ విధమైన ప్రగతి సాధించటానికి చైనాలో లాంటి కమ్యూనిస్టు పాలనకు మన ముఖ్యమంత్రి అంగీకరిస్తారా? ఇక జపాన్, సింగపూర్‌లతో పోలిక సాధ్యంకాదు. ఆయా దేశాలలో వ్యవసాయమేలేదు. కాని మనది వ్యవసాయాధార రాష్ట్రం. అందువల్ల వాటితో పోల్చుకోవటం తప్పవుతుంది. సింగపూర్‌లో బ్యాంకింగ్ రంగం కీలకమైనది కాదా, తర్వాత టూరిజం ఆదాయవనరుగా ఉంది. ఆ దేశంలో వ్యవసాయం నామమాత్రంగా కూడాలేదు. జపాన్ పూర్తిగా పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందింది. ఆధునిక పరిజ్ఞానం, పరిశోధనల్లో ప్రపంచంలోనే అగ్రభాగంలో ఉంది. ఈ దేశంలో వ్యవసాయం జిడిపిలో 1.4 శాతంతో పరిమితంగా ఉంది. ఈ దేశాలతో మన దేశాన్ని మరీ ముఖ్యంగా రాష్ట్రాన్ని పోల్చలేము. ఎందుంటే మన రాష్ట్రం పూర్తిగా వ్యవసాయంపైనే ఆధారపడింది. వరి లాంటి ఆహారధాన్యాలతోపాటు వేరుశనగ, కందులు, పొద్దుతిరుగుడు, మిరప, చెరకు, పసుపు లాంటి పంటలతోపాటు చేపల-రొయ్యల పెంపకం, అరటి, బొప్పాయి, మామిడి లాంటి పండ్లతోటలకు పూర్తిగా అనువైనది. సమృద్ధిగా సాగునీరు ఉంది మనకు. సింగపూర్, జపాన్‌లకు ఆ విధంగా పంటలు పండించే భూములు లేవు, సాగునీటి వనరులు అంతకన్నాలేవు.
చంద్రబాబునాయుడు ఈ సారి అమెరికా, యూరప్ నమూనాల ముందు సాగిలపడటం మానేశారు. మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఆసియా -పసిఫిక్‌లోని వివిధ దేశాలను ఎంచుకున్నారు. మనది బ్రిటన్‌ను పోలిన ప్రజాస్వామిక దేశం. చంద్రబాబు తిరుగుతున్న దేశాలైన జపాన్, సింగపూర్, చైనా నమూనాలు మన వ్యవస్థకు సంబంధంలేనివి. అయినా కూడా చైనాలో ఏప్రిల్ 12 నుంచి 18 మధ్య ఆయన బృందం పర్యటించింది. సింగపూర్‌లో మార్చి 29 – 31 తేదీలలో, అంతకు ముందు 2014 నవంబర్ 13-16 తేదీలలోనూ పర్యటించారు. జపాన్‌లో అదే ఏదాడి 24 నుంచి 29 వరకూ పర్యటించారు. ఇక సింగపూర్ బృందాలతోపాటు ఆదేశ విదేశాంగ మంత్రి ఈశ్వరన్ రాష్ట్రానికి రావటం ఎక్కువ అయ్యింది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని నిర్మాణంలో సహకరించాలని, అదే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ఇదే సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయా దేశాలను కోరుతున్నారు. ఇవి రెండు సాధ్యమయ్యే అంశాలు కాదు. నిర్మాణంలో సహకరించటం అనేది వ్యాపారసంబంధంగానే అదేశాలు చూస్తాయి. రాష్ట్రంలో రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాలు సహకరించాలి. అంతేగాని ఇతర దేశాలు ఎందుకు సహకరిస్తాయి ? నిర్మాణ పనిలో లాభం ఉంటుందనుకుంటే ముందుకు వస్తాయి. ప్రస్తుతానికి సింగపూర్ అదే విధమైన ఆసక్తి కనపబరుస్తున్నట్లు కనిపిస్తోంది. మరో ముఖ్యమైన అంశం పెట్టుబడులు పెట్టడం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడీదారి వ్యవస్థనే నడుస్తోంది. ఎక్కడ లాభాలు ఉంటాయంటే, ఎక్కడ తమ పెట్టుబడికి ఎక్కువ భద్రత ఉంటుందంటే అక్కడకు తరలివెళతారు అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వేత్తలు పెట్టుబడీదారులు. ఈ విషయం మన ముఖ్యమంత్రికి తెలియందికాదు. వీటికి తోడు వాతావరణ, రాజకీయ, చట్టాలు, వనరులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. వారికి అనుకూలంగా ఉంటుందంటే చంద్రబాబు అడక్కపోయినా వారే రాష్ట్రానికి తరలివస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఐటి రంగం వారిని కోరుతున్నా ఎవ్వరూ ముందుకు రావటంలేదు. విశాఖను ఐటికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నా ఎవ్వరూ ముందుకు రావటంలేదు. ఎందుకంటే సముద్ర తీరప్రాంతం ఐటి, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులకు అనుకూలంగా లేదని పారిశ్రామికవేత్తలు స్పష్టంగానే చెబుతుంటారు. ప్రస్తుతం ఆతరహా పరిశ్రమలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూనె లాంటి నగరాలకే పరిమితమయ్యాయి. అక్కడి నుంచి ఇతర నగరాలకు విస్తరించటానికి ఆసక్తి చూపటంలేదు. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం నెలకొంది. అంతగా పెట్టుబడులు దేశంలోకి రావటంలేదు. ఈ తరహా పరిశ్రమలకు హైదరాబాద్ లాంటి ప్రాంతం చాలా అనుకూలమైనది. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, ఐటి రంగానికి అనువైన ప్యాకేజి ప్రకటించినప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు రావటంలేదంటే ఇక వాతావరణం అనుకూలంగాలేని ఎపికి వస్తారా ? బెంగుళూరు వాతావరణానికి దగ్గరగా ఉండే అనంతపురం జిల్లాకు రావటానికి వారు ఇష్టపడటంలేదు. అందువల్ల ఇప్పట్లో పెట్టుబడులు వచ్చే అవకాశాలు తక్కువే.
ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలకు అనుకూలం. వాటి కోసం ప్రభుత్వం దృష్టిపెట్టి దేశీయ పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తే ప్రయోజనం ఉండవచ్చు. కాని అటువంటి ప్రయత్నం ఆశించిన స్థాయిలో ప్రభుత్వం నుంచి జరగటంలేదు. ఈ పనిని విడిచిపెట్టి ఎడారిలో ఒయాసిస్సును వెతుక్కుంటు విదేశాలకు పరుగులు తీస్తోంది మన ఫ్రభుత్వం.
ఇక విదేశాల నమూనాలు మనకు ఉపయోగపడతాయేమో పరిశీలిద్దాం….
సింగపూర్ అనగానే తళతళ మెరిసిపోయే ఆకాశహర్మ్యాలు గుర్తుకు వస్తాయి. భూలోక స్వర్గంలా కనిపించే సింగపూర్ పర్యాటకులకు ఆహ్లాదం, వినోదం, విందులకు కొరత లేని విధంగా సంతృప్తినిస్తుంది. ఆకాశంలో నక్షత్రాలు మెరిసినట్లు ఆకాశాన్ని హత్తుకుని ఉండే పెద్ద పెద్ద ఎత్తయిన నిర్మాణాలు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సింగపూర్‌లోనే దర్శనమిస్తాయి. అదే సమయంలో సువిశాలమైన అత్యంత అధునాతన పద్ధతుల్లో రన్‌వేలను తలపించే విధంగా నిర్మించిన రహదారులు కనుచూపు మేరలో రోడ్డు మీద పరుగులు తీయాలనే ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. ఆధునికతకు, అభివృద్ధికి చిహ్నాలైన రహదారులు, పెద్ద పెద్ద భవంతులు కళ్లు జిగేల్ మనిపించే విద్యుత్ అలంకరణలు చూస్తే సహజంగానే ఎవరికైనా అది సొంతం కావాలనే ఆశ కలుగుతుంది. సింగపూర్ అందచందాలను, సుందర దృశ్యాలను తిలకించేందుకు అదే పనిగా వెళ్లే పర్యాటకులు ప్రతి ఏటా వేలల్లోనే ఉంటారు. అయితే ఇక్కడ తిండి గింజలు పండవు. కూరగాయలూ కానరావు. పండ్ల ఊసే తెలియదు. కనీసావసరాలైన వస్త్రాలు మొదలు ఖరీదైన వాచీలు, బంగారం, ఆభరణాలు లాంటివి ఉత్పత్తి అయ్యే చిన్న పాటి పరిశ్రమలు కూడా ఉండనే ఉండవు. కనీసం కాఫీ తాగాలన్నా పాలు, కాఫీపొడి సైతం వేరే దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే! మరి అంత పెద్ద ఆకాశహర్మ్యాలతో అలరారే సింగపూర్‌లో సొంతంగా తిండి గింజలు కూడా పండించుకోలేని పరిస్థితి ఉందంటే అది అభివృద్ధి అనాలా… భూతల స్వర్గంగా కీర్తించాలా? సింగపూర్‌లా అభివృద్ధిచేయటానికి ఎందుకిలా బాబు తాపత్రాయ పడుతున్నారు?
సింగపూర్ కేవలం బ్యాంకింగ్ రంగానికి మాత్రమే ప్రసిద్ధి. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన వాణిజ్య బ్యాంకింగ్ సంస్థలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు సాగిస్తూంటాయి. ఇక్కడ లేని బ్యాంకు కార్యాలయం లేదు. ప్రయివేటు, ప్రభుత్వ రంగాలకు చెందిన దాదాపు అన్ని దేశాల బ్యాంకింగ్ కార్యకలాపాలూ ఇక్కడ నుంచి కూడా సాగుతుంటాయి. అందుకే వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు ఇక్కడి బ్యాంకింగ్ రంగంపై ఆధారపడటం వల్ల హై ప్రొఫైల్ సొసైటీ కేంద్రంగా విలసిల్లుతోంది. బ్యాంకింగ్ నిపుణులు కొలువు తీరి ఉండటం వల్ల వారి రూపాయి మారకం విలువకు రెక్కలు వచ్చేశాయి. ఫలితంగా అత్యంత ఖరీదైన జీవితాన్ని అక్కడివారు కొనసాగిస్తూంటారు. ఏ విధంగాను పోలికలేని ఎపితో సరిచూస్తున్నారు మన సిఎంగారు. పర్యాటకులను ఆ నగరం ఆహ్లాదం గొల్పుతుంది. కాని ఎపి ఏమాత్రం అనుకూలమైనది కాదు. ఎందుకంటే మన గాలిలో తేమ శాతం అధికం. ఉక్కబోత భరించలేకుండా ఉంటుంది. వేసవిలో ఇంక చెప్పనవసరంలేదు. ఏవిధంగానూ అటువంటి వాతావరణానికి మనం సరితూగలేము.
సింగపూర్ చరిత్రను పరిశీలిస్తే 1963 ఆగస్టు 31న స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. మలేషియా నుంచి 1965 ఆగస్టు 9న పూర్తిగా విడిపోయింది. సింగపూర్ అనేది నాలుగువైపులా సముద్రపు నీరు ఆవరించి ఉన్న చిన్న ద్వీపం. ఇది ఒక నగరం మాత్రమే. దీన్ని ఆనుకుని మరో 60 వరకూ మరింత చిన్న ద్వీపాలు ఉన్నాయి. మొత్తం సింగపూర్ నగర వైశాల్యం 716.1 చదరపు కిలోమీటర్లు. (276 చదరపు మైళ్లు). ఆంధ్రప్రదేశ్‌తో పోల్చి చూస్తే మన రాష్ట్ర విస్తీర్ణం 1,60,205 చదరపు కిలోమీటర్లు (61855 చదరపు మైళ్లు). అంటే సింగపూర్ నగరం ఎంత చిన్నదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అసలు పోలికే అన్యాయమైనది. ఎక్కువ జనసాంధ్రత వల్ల ఆకాశహార్మ్యాలు నిర్మిస్తున్నారు. దాదాపుగా హాంకాంగ్‌తో దీనిని సరిపోల్చటం సరైనది. మన రాష్ట్ర జనాభా దాదాపు 5 కోట్లు. జన సాంద్రత చదరపు కిలోమీటరుకు 308. సింగపూర్ జనాభా మొత్తం కలిపి 53 లక్షలు. జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 7540. ప్రపంచంలోనే జనసాంద్రతలో మూడో స్థానంలో ఉంది సింగపూర్. ఈ నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. కేవలం 1.44 శాతం నీటి లభ్యత మాత్రమే ఉందిక్కడ. మనకు పుష్కలంగా నీరుండటానికి నదులు, వాగులు వంకలతోపాటు సహజ నీటి వనరులు ప్రతి జిల్లాలోనూ వేల సంఖ్యలో ఉన్నాయి. ఈ విధమైన నీటి వనరులున్నాయంటే అందుకు సారవంతమైన భూమితోపాటు పచ్చని మైదానాలు, అడవులు వ్యాపించి ఉండటమే కారణం. కానీ ఆ నగరంలో ఎక్కడ చూసినా ఎత్తయిన భవనాలు, విశాలమైన రహదారులు, విద్యుత్ దీపాలు మాత్రమే కనిపిస్తుంటాయి. అందువల్ల ఏవిధంగా చూసినా ఎపి, సింగపూర్ పోలికసరిపోదు.
ఇక జపాన్ విషయానికి వద్దాం. ఆ దేశం గత ఆరేడు దశాబ్ధాలుగా సాధించిన ప్రగతి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఎంతో ముందుకు వెళ్ళింది. వ్యవసాయానికి అంతగా అనువుగాలేని ఈ దేశంలో సమయపాలన, పనిపట్ల చిత్తశుద్ధి, అంకితబావం లాంటివి అన్ని స్థాయిల్లోనూ జీర్ణించుకుపోయాయి. దేశ ప్రజల క్షేమమే ప్రధానంగా నిర్ణయాలు తీసుకుంటారు. 2013 సెప్టెంబర్‌లో ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రంలో ప్రమాదం తర్వాత ఆ దేశంలోని 50కు పైగా అణువిద్యుత్ కేంద్రాలను ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వం మూసివేసింది. మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ అణువిద్యుత్ కేంద్రాల స్థాపనకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రవాణాకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. రైళ్ళ రాకపోకల్లో కొంచెం జాప్యాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తారక్కడ. పంటలు పండే భూములు తక్కువగా ఉన్నప్పటికీ ఉత్పాదకతపై ప్రధానంగా దృష్టిపెట్టారు. దాంతో ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించారు. అదే విధంగా చేపల వేట విషయంలోకూడా వారిది మనకన్నా పైచేయి. పారిశ్రామిక, బయోటెక్నాలజీ, బ్యాంకింగ్, సేవ, ఉత్పత్తి రంగాలలో ఎంతో ముందున్నారు. ఇలా ప్రతివిషయాన్ని అన్నిస్థాయిల్లోనూ ఛాలెంజ్ తీసుకునే ప్రజలను ప్రభుత్వం కూడా గౌరవించి వారి అభిప్రాయాల ప్రకారం నడుచుకుంటుంది. మన రాష్ట్రంలో అది సాధ్యమా ?
మనకు అంతో సారూప్యత ఉన్న దేశం చైనా. కాని అది కమ్యూనిస్టు దేశం. అక్కడ ఎన్నికలు ఉండవు. కమ్యూనిస్టుపార్టీ నియంతృత్వం రాజ్యమేలుతోంది. ఇందుకు మన పాలకులు, చంద్రబాబు అంగీకరిస్తారా? చైనాలో గత మూడు నాలుగు దశాబ్ధాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. మొండిగా కమ్యూనిస్టులు ప్రజలపై తమ నిర్ణయాలను రుద్దలేదు. ప్రజల అభిప్రాయాలను మన్నించి ఎన్నో సంస్కరణలను చేపట్టారు. ‘సోషలిస్టు మార్కెట్ ఎకానమీని’ అమలులోకి తెచ్చారు. అధికారాన్ని పూర్తిగా వికేంద్రీకరించి అభివృద్ధి కూడా వికేంద్రీకరించటానికి ప్రాముఖ్యత ఇచ్చారు. పారిశ్రామిక, వ్యసాయ ఉత్పత్తులు గణనీయంగా పెంచారు. ఎగుమతులు ఇతోధికంగా పెరిగాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు సమ ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. దీనికి తోడు ముఖ్యంగా అమెరికాకు ఎదురునిలబడుతోంది. మనం దేశం, రాష్ట్రం ఆ పనిచేయగలుగుతుందా?
అందుకే ఈ నమూనాలు మనకు సరిపోవు. మనది వ్యవసాయక రాష్ట్రం. దానికి తోడు ప్రాంతీయ అసమానతులు ఉన్నాయి. ఈ కోణంలోనే అభివృద్ధి నమూనాను రూపొందించాలి. అప్డ్పుడే ప్రగతి పరుగులు పెడుతుందని బాబుకు తెలియంది కాదు. అయినా ప్రజలను ఎడారిలో ఒయాసిస్సుల వెంట పరుగులు తీయించాలనేది ఆయన లక్ష్యం.
-ఎస్.వి