ఆమెకు ఆమే కానుక!
జీవితంలో ఆటుపోట్లు అనే మాట అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఎన్నో కొన్ని కష్టాలు అంటూ లేని జీవితం అంటూ ఉండదు. కానీ సోనాలీ ముఖర్జీ విషయానికి వస్తే ఆమెకొచ్చిన కష్టాలను సునామీతోనే పోల్చాలి. ఎందుకంటే పదిహేడేళ్ల వయసులో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. 2003వ సంవత్సరంలో ముగ్గురు దుర్మార్గులు అమానుషంగా ఆమెపై యాసిడ్ పోశారు. వారి లైంగిక వేధింపులను తిప్పి కొట్టిందన్న కోపంతోనే వారు ఆ పనిచేశారు. ఆ దాడిలో ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. సగం […]
జీవితంలో ఆటుపోట్లు అనే మాట అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఎన్నో కొన్ని కష్టాలు అంటూ లేని జీవితం అంటూ ఉండదు. కానీ సోనాలీ ముఖర్జీ విషయానికి వస్తే ఆమెకొచ్చిన కష్టాలను సునామీతోనే పోల్చాలి. ఎందుకంటే పదిహేడేళ్ల వయసులో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. 2003వ సంవత్సరంలో ముగ్గురు దుర్మార్గులు అమానుషంగా ఆమెపై యాసిడ్ పోశారు. వారి లైంగిక వేధింపులను తిప్పి కొట్టిందన్న కోపంతోనే వారు ఆ పనిచేశారు. ఆ దాడిలో ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. సగం శరీరం చలనరహితంగా మారింది. కళ్లు పోయాయి. అలాంటి స్థితిలోనూ సోనాలీ ధైర్యం కోల్పోలేదు…అనే మాటని మామూలుగా అనలేము. ఎందుకంటే ఆమె యాసిడ్ దాడి తరువాత తన మనుగడకోసం ఆత్మస్థయిర్యానికే ప్రతిరూపంగా మారింది. 22 ఆపరేషన్ల అనంతరం కాస్త మెరుగైన స్థితిలోకి రాగలిగింది. నిజానికి జీవితాన్నిమనం ప్రపంచం కళ్లతో చూడటానికి అలవాటు పడి ఉంటాం. అందుకే ఇతరులు ఏమనుకుంటారో అనే భయానికి మన జీవితాన్ని ఫణం గా పెడుతుంటాం. కానీ సోనాలీ మాత్రం అలాంటి పొరబాటు చేయలేదు. ఈ రూపంతో బయటకు రావటం ఎందుకు….అనే వాళ్ల సంకుచితత్వాన్ని వారికే వదిలేసి అమితాబ్ షో కౌన్ బనేగా కరోడ్‌పతికి హాజరైంది. బాలివుడ్ దిగ్గజం అబ్బురపడేలా ఆడింది. అమితాబ్‌తో పాటు కార్యక్రమంలో ఆయన సహ ప్రయోక్త లారాదత్తా సైతం సోనాలీ తెలివితేటలకు, ధైర్యానికి అప్రతిభులయ్యారు. అమితాబ్ ఆమెను పొగడకుండా ఉండలేకపోయారు. కొన్నిసార్లు మనం జీవితంలో చాలా నిరాశకు లోనవుతాం. కానీ సోనాలీ లాంటి వారిని చూసినపుడు మాత్రమే మనకు జీవితం ఎన్నివరాలు ఇచ్చిందో అర్థమవుతుంది…ఆంటూ ఆయన సోనాలీని మెచ్చుకున్నపుడు ఆ స్టూడియో మొత్తం కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. ఆ షోలో సోనాలీ ఇరవై లక్షలకు పైగానే గెలుచుకుంది. ఇంతకీ ఆమె ఆ షోలో పాల్గొనడానికి కారణం ఉంది. తన వైద్యానికి కావలసిన డబ్బుని ఆమెకు ఏ ప్రభుత్వాలూ ఇవ్వలేదు. తండ్రి తన రెక్కల కష్టంపైనే సోనాలీని బతికించుకున్నాడు. అందుకే, తండ్రి బాధ్యతలను పంచుకునేందుకే కెబిసిలో పాల్గొంది. గత ఏడాది ప్రభుత్వ టీచర్‌గా ఉద్యోగాన్ని సైతం సంపాదించుకుంది. ఇవన్నీ కాకుండా ఆమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషం మరొకటుంది. ఈ నెల పదిహేనున సోనాలీకి చిత్తరంజన్ తివారీ అనే ఎలక్ర్టికల్ ఇంజినీర్ కి వివాహం జరిగింది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. ఆమె గురించి తెలుసుకున్న తివారీ, 2012లో ఆమెతో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుని తన ప్రేమను వెల్లడించాడు. జార్ఖండ్ లో వారి వివాహం జరిగింది. తివారీ, స్తబ్దతతో నిలిచిపోయిన తన జీవితంలో తిరిగి ఆనందం నింపాడని సోనాలీ చెబుతోంది. సోనాలీకి జీవితం భయంకరమైన విషాదాన్నే ఇచ్చి ఉండవచ్చు…కానీ ఆమె తనకు తాను మాత్రం పునర్జీవితాన్ని ఇచ్చుకోగలిగింది.