Telugu Global
Cinema & Entertainment

మా  విజయేంద్రుడు... రాజేంద్రుడు

మా విజయేంద్రుడు… రాజేంద్రుడు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్య‌క్షుడిగా న‌ట‌కిరీటికే కిరీటం ద‌క్కింది. సినీ హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎన్నిక‌య్యారు. మొద‌టి రౌండ్ నుంచి ఆయ‌న ఆధిక్య‌త కొన‌సాగుతూనే ఉంది. మొత్తం ఏడు రౌండ్ల‌లో మొద‌టి రౌండ్ నుంచీ కూడా రాజేంద్ర‌ప్ర‌సాద్‌కే ఆధిక్య‌త ద‌క్కుతూ వ‌చ్చింది. మొత్తం 702 ఓట్లు ఉంటే 394 మంది మాత్ర‌మే త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మొద‌టి రౌండ్‌లో 32 ఓట్ల ఆధిక్య‌త‌లో ఉన్న ఆయ‌న ఐదో రౌండ్‌కు 58 ఓట్లు, […]

మా  విజయేంద్రుడు... రాజేంద్రుడు
X
మా విజయేంద్రుడు… రాజేంద్రుడు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్య‌క్షుడిగా న‌ట‌కిరీటికే కిరీటం ద‌క్కింది. సినీ హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్ ఎన్నిక‌య్యారు. మొద‌టి రౌండ్ నుంచి ఆయ‌న ఆధిక్య‌త కొన‌సాగుతూనే ఉంది. మొత్తం ఏడు రౌండ్ల‌లో మొద‌టి రౌండ్ నుంచీ కూడా రాజేంద్ర‌ప్ర‌సాద్‌కే ఆధిక్య‌త ద‌క్కుతూ వ‌చ్చింది. మొత్తం 702 ఓట్లు ఉంటే 394 మంది మాత్ర‌మే త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. మొద‌టి రౌండ్‌లో 32 ఓట్ల ఆధిక్య‌త‌లో ఉన్న ఆయ‌న ఐదో రౌండ్‌కు 58 ఓట్లు, ఆరో రౌండ్లో 68 సాధించారు. చివ‌రి రౌండ్ పూర్త‌య్యేస‌రికి 85 ఓట్ల‌తో విజ‌యం కైవ‌సం చేసుకున్నారు. ప్ర‌స్తుత అధ్య‌క్షుడిగా ఉన్న ముర‌ళీమోహ‌న్ అధ్య‌క్ష ప‌ద‌వికి ప్ర‌తిపాదించిన సినీ న‌టి జ‌య‌సుధ ఓడిపోయారు. గ‌త ప‌దేళ్ళ నుంచి మా అధ్య‌క్షడిగా ఉన్న‌ ముర‌ళీమోహ‌న్ పేద క‌ళాకారుల‌కు పెద్ద‌గా చేసిందేమీ లేద‌ని, ఆయ‌న‌ మీద ఉన్న ఆగ్ర‌హ‌మే రాజేంద్ర‌ప్ర‌సాద్ గెలుపుకు కార‌ణ‌మైంద‌ని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల స్థాయిలో పోటాపోటీగా జ‌రిగాయి. అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న జ‌య‌సుధ‌కు ప్ర‌స్తుత ‘మా’ అధ్య‌క్షుడు, తెలుగుదేశం ఎంపీ ముర‌ళీమోహ‌న్ మ‌ద్ద‌తివ్వ‌గా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు మాజీ ‘మా’ అధ్య‌క్షుడు, మెగా ఫ్యామిలీ మెంబ‌ర్ అయిన నాగ‌బాబు అండ‌గా నిలిచారు. జయసుధ వైపే సినిమా పరిశ్రమ ఎక్కువగా మొగ్గు చూపిన‌ట్టు క‌నిపించిన‌ప్ప‌టికీ చివ‌రికి రాజేంద్ర‌ప్ర‌సాద్‌నే విజ‌యం వ‌రించింది. త‌న ప్యాన‌ల్‌లో పూర్తిగా స‌భ్యుల‌ను పెట్టుకోలేక‌పోయిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు ఈ విజ‌యం నైతికంగా ఎంతో బ‌లం ఇస్తుంద‌నే చెప్పాలి.
ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శివాజీ రాజా
పోటీ నుంచి విర‌మించుకుంటున్నాన‌ని ప్ర‌క‌టించిన శివాజీరాజా ఆ త‌ర్వాత నిర్ణ‌యం మార్చుకుని ప్యాన‌ల్‌లో కొన‌సాగారు. ఫలితాల అనంత‌రం ఆయ‌న ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అలీపై 36 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. మూడు ద‌శాబ్దాల‌పాటు స్నేహితుడుగా ఉన్న అలీ సైతం త‌న‌ను మోసం చేశాడ‌ని శివాజీరాజా ఆనాడు విలేఖ‌రుల స‌మావేశంలో ఆక్రోశం వ్య‌క్తం చేశాడు కూడా. ఎగ్జిక్యూటివ్ ఉపాధ్య‌క్షుడిగా త‌ణికెళ్ళ భ‌ర‌ణి, ఉపాధ్య‌క్షులుగా మంచు ల‌క్ష్మి, శివ‌కృష్ణ‌, ట్రెజ‌ర‌ర్‌గా ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు, సంయుక్త కార్యదర్శులుగా నరేష్, రఘుబాబు ఎన్నిక‌య్యారు. కార్య‌నిర్వ‌హ‌క స‌భ్యులుగా కాదంబ‌రి కిర‌ణ్‌, బెన‌ర్జీ, ఛార్మి, రాజేశ, యేడిద శ్రీ‌రాం, మ‌హ‌ర్షి రాఘ‌వ‌, గీతాంజ‌లి, హ‌రినాథ బాబు, హేమ‌, జ‌య‌ల‌క్ష్మీ, న‌ర్సింగ్ యాద‌వ్‌, రాజీవ్ క‌న‌కాల, విద్యాసాగ‌ర్ గెలుపొందారు. త‌మ ప్యాన‌ల్‌లో న‌లుగురు గెలిచామ‌ని, త‌మ‌ను గెలిపించిన క‌ళాకారులంద‌రికీ కృత‌జ్ఞ‌త‌ల‌ని శివాజీరాజా చెప్పారు. తాము ఇచ్చిన హామీల‌న్నీ నెర‌వేరుస్తామ‌ని ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు మా అధ్య‌క్ష పీఠానికి ఏక‌గ్రీవంగానే ఎన్నిక‌లు జ‌రిగాయి. కాని ఈసారి సినీ ప‌రిశ్ర‌మ రెండుగా చీలిపోయి బ్యాలెట్ పోటీకి కార‌ణ‌మైంది. ప‌ర‌స్ప‌రం తీవ్ర విమ‌ర్శ‌ల మ‌ద్య ఈ ఎన్నిక‌లు జరిగాయి. చివ‌ర‌కు మా ఎన్నిక‌ల అంశం కోర్టు గ‌డ‌ప ఎక్కింది. కోర్టు నుంచి వ‌చ్చిన ఆదేశం మేర‌కు శుక్ర‌వారం ఫిల్మిం ఛాంబ‌ర్‌లో కౌంటింగ్ జ‌రిగింది. కౌంటింగ్ అనంత‌రం ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ముర‌ళీమోహ‌న్ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ…ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వారంద‌రికీ ముఖ్యంగా రాజేంద్ర‌ప్ర‌సాద్‌కి అబినంద‌న‌లు తెలుపుతూ ఈ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అడుగ‌డుగునా స‌హ‌క‌రించిన మీడియాకు హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ఎన్నిక‌ల వ‌ర‌కే పోటీ త‌ప్ప మాలో ఎటువంటి గ్రూపులు లేవ‌ని, ఎప్పుడూ సినిమా ప‌రిశ్ర‌మ ఒక్క‌టిగానే ప‌ని చేస్తుంద‌ని ముర‌ళీమోహ‌న్ అన్నారు.-పీఆర్‌
First Published:  17 April 2015 6:24 AM IST
Next Story