ఒట్టు...మరువబోము చీరకట్టు!
ఆన్ లైన్లో అతివల ప్రతిజ్ఞ పండుగలకు పిండి వంటలు చేసుకున్నట్టుగా మన ఆడవాళ్లు చీరలను సైతం కొన్ని ప్రత్యేక సంధర్భాల్లోనే కట్టే రోజులు వచ్చేశాయి. చీరని డామినేట్ చేసే దుస్తులు, ఫ్యాషన్లు మార్కెట్లోకి వరుసగా వస్తూనే ఉన్నాయి. ఒక దేశ ఉనికి దాని ప్రజల వేషభాషలు, సంస్కృతి, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుందనేది నిజం. చీరకట్టులేని భారతదేశాన్ని ఊహించడం మన వల్ల కాదు, మనమే కాదు, విదేశాలూ ఊహించలేవు. అయితే చీర ఎప్పటికీ మనదేశంలో కనుమరుగు కాదు… అనేది […]
ఆన్ లైన్లో అతివల ప్రతిజ్ఞ
పండుగలకు పిండి వంటలు చేసుకున్నట్టుగా మన ఆడవాళ్లు చీరలను సైతం కొన్ని ప్రత్యేక సంధర్భాల్లోనే కట్టే రోజులు వచ్చేశాయి. చీరని డామినేట్ చేసే దుస్తులు, ఫ్యాషన్లు మార్కెట్లోకి వరుసగా వస్తూనే ఉన్నాయి. ఒక దేశ ఉనికి దాని ప్రజల వేషభాషలు, సంస్కృతి, సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుందనేది నిజం. చీరకట్టులేని భారతదేశాన్ని ఊహించడం మన వల్ల కాదు, మనమే కాదు, విదేశాలూ ఊహించలేవు. అయితే చీర ఎప్పటికీ మనదేశంలో కనుమరుగు కాదు… అనేది కూడా ఒక నిజం. అదే విషయాన్ని చెబుతూ. మరింత తరచుగా చీరకట్టులోని అందాన్ని, ఆనందాన్ని సొంతం చేసుకుందాం అంటున్నారు బెంగళూరుకి చెందిన ఇద్దరు మహిళా పారిశ్రామికవేత్తలు. చీరలు ధరించిన తమ ఫొటోలు ట్విట్టర్, ఫేస్బుక్కుల్లో పోస్టు చేస్తూ చీరని మర్చిపోబోమని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. అల్లె మత్తన్, అంజు మౌద్గల్ కదమ్. వీరిరువురు వారానికి తప్పకుండా రెండుసార్లు చీరని ధరిస్తామని, లేదా సంవత్సరం మొత్తంమీద వందసార్లు చీర కట్టుకుని తీరతామని తమకు తామే మాట ఇచ్చుకున్నారు. వీరి ప్రచారానికి హ్యాష్ట్యాగ్ 100శారీప్యాక్ట్ గా చాలా వేగంగా స్పందన లభించింది. దేశవ్యాప్తంగా మహిళలు తాము చీరలను ధరించి ఉన్న ఫొటోలను ట్విట్టర్, ఫేస్బుక్కుల్లో పోస్ట్ చేయటం ప్రారంభించారు. ఒక్కో చీరని కట్టుకున్నపుడు ఒక్కో జ్ఞాపకం, అనుభూతి పరిమళంలా చుట్టుకుంటాయని, చీర కట్టుకుంటే పుట్టినరోజు అందంలాంటి ఒక ప్రత్యేక కాంతి మనలో నిండుతుందని కదమ్ అంటున్నారు. ఇదేదో చీర అదృశ్యమైపోతుందన్న ఆందోళన నుండి వచ్చింది కాదని, చీరకట్టులోని ఉల్లాసాన్ని మరింతగా ఆస్వాదించడం కోసమే ఈ ప్రచారమని ఆమె బిబిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. చాలామంది మహిళలు తాము చీర ధరించిన ఫొటోలతో పాటు ఆ చీరతో అల్లుకుని ఉన్న తమ జ్ఞాపకాలను సైతం వివరిస్తున్నారు. ఒక మహిళ తన సొంత సంపాదనతో కొన్న చీరని ధరించి, దాని గురించి చెబితే…మరొకరు తన ఆరేళ్ల కొడుకు సెలక్ట్ చేసిన చీర అంటూ… మురిపెంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ కథలన్నింటితో ఒక ప్రత్యేక వెబ్సైట్ ని క్రియేట్ చేసే పనిలో ఉన్నారు ఈ మిత్రురాళ్లు. మొత్తానికి మనుషులను ఎప్పుడూ ఏదో ఒక ఏకసూత్రం కలుపుతూ ఉంటుంది. అది ఒక సీరియస్ ఉద్యమమైనా, ఉల్లాసాన్ని ఇచ్చే అంశమైనా. ఇప్పుడు ఇలాంటి ఒక చక్కని ఫీల్గుడ్ ఫ్యాక్టర్ని తెరపైకి తెచ్చి ఆన్లైన్ లో అనుభూతి పరిమళాలు గుబాళింపచేస్తున్న ఆ ఇద్దరినీ అభినందించాల్సిందే.