బెజవాడలో మెట్రోరైల్ భూ సేకరణ అలజడి?
మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో భూసేకరణ చేయనున్నారనే సమాచారం స్థానికుల్లో గుబులు రేపుతోంది. భూసేకరణ వ్యవహారంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) నియమించిన కన్సల్టెన్సీలు ఇప్పటికే సర్వేలు పూర్తి చేయడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎంఆర్సీ త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్న విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ సవివరణ నివేదికలో భూసేకరణ కీలకాంశంగా ఉంది. ప్రాజెక్ట్ కోసం సుమారు 60 ఎకరాల భూమిని సేకరించాలని అందులో […]
మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో భూసేకరణ చేయనున్నారనే సమాచారం స్థానికుల్లో గుబులు రేపుతోంది. భూసేకరణ వ్యవహారంపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోయినా డీఎంఆర్సీ (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) నియమించిన కన్సల్టెన్సీలు ఇప్పటికే సర్వేలు పూర్తి చేయడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. డీఎంఆర్సీ త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్న విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్ట్ సవివరణ నివేదికలో భూసేకరణ కీలకాంశంగా ఉంది. ప్రాజెక్ట్ కోసం సుమారు 60 ఎకరాల భూమిని సేకరించాలని అందులో పొందుపరిచారు. 45 నుంచి 50 ఎకరాలను కోచ్ డిపో కోసం నిడమానూరులో సేకరించాలని పేర్కొన్నారు. జాతీయ రహదారి పక్కన బెస్ట్ ప్రైస్ షోరూమ్ వెనుక ఈ భూమిని సేకరించడం ఖాయంగా కనిపిస్తోంది. బందరు రోడ్ కారిడార్లో నిర్మించనున్న స్టేషన్ల కోసం రోడ్డు కిరువైపులా పలుచోట్ల సుమారు 4.5 ఎకరాలు 8 వేల చదరపు మీటర్లు స్థలం తీసుకోనున్నారు. ఏలూరు రోడ్ కారిడార్లో బస్ స్టాండ్ నుంచి రామవరప్పాడు మీదుగా నిడమానూరు వరకూ రోడ్డు కిరువైపులా సుమారు 5 ఎకరాల 9 వేల చదరపు మీటర్లు స్థలం సేకరించనున్నారు. భూ సేకరణకు సంబంధించి తమ భూముల్లో డీఎంఆర్సీ సర్వేలు చేస్తుండడంతో ఆందోళన చెందిన స్థానికులు సీఆర్డీఏ కార్యాలయానికి వచ్చి ప్రశ్నిస్తున్నారు. డీపీఆర్ ఇంకా ప్రభుత్వానికి సమర్పించక పోవడంతో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా దీనిపై డీఎంఆర్సీని సంప్రదిస్తున్నారు.
గజం లక్ష నుంచి రెండున్నర లక్షలు విలువ చేసే నగర ప్రాంతం, శివారులో ఎకరం రూ.2 కోట్లకుపైనే పలికే అత్యంత ఖరీదైన ప్రాంతంలో జరగనున్న భూసేకరణ కావడంతో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. ఇదే ప్రాంతంలో రెండు భూసేకరణలు ఏళ్ల తరబడి వివాదాలుగా మారి నలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో కోసం భూసేకరణ ఏమేర ముందుకెళుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ, మచిలీపట్నం రహదారిని నాలుగులైన్లుగా విస్తరించడం కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారం ఆరేళ్లుగా సాగుతోంది. బెంజ్ సర్కిల్ నుంచి మచిలీపట్నం వరకూ రోడ్డును వెడల్పు చేసే క్రమంలో పలుచోట్ల భవనాలు తొలగించాల్సి రాగా, కొన్నిచోట్ల స్థలాలు తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై అనేక అభ్యంతరాలు రాగా చివరకు పరిష్కరించగలిగారు. కానూరు, పోరంకి, గండిగుంట ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించలేకపోయారు. ఈ కారణంగా బందరు రోడ్ విస్తరణ ప్రాజెక్ట్ ఆరేళ్లుగా నిలిచిపోయింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చేందుకు అవసరమైన 490 ఎకరాలను సేకరించేందుకు ఏడేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా 490 ఎకరాలకు తోడు 220 ఎకరాలను తీసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా స్థానికులు ఒప్పుకోవడంలేదు. కీలకమైన రెండు ప్రాజెక్ట్ లకు ఏడేళ్ల నుంచి భూమి సమకూరని పరిస్థితుల్లో మెట్రో భూసేకరణ ఎన్నేళ్ళలో పూర్తవుతుందనే అనుమానాలు వ్యాపిస్తున్నాయి.