పెళ్లి కాకుండా పుడితే....పాస్‌పోర్టు ఇవ్వరా?
ఇదే ప్రశ్న కేరళ హైకోర్టుని అడిగింది ఒక మహిళ. కేరళలో ఒక తల్లి తన ఐదేళ్ల పాపకి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు పెట్టుకుంది. పాస్‌పోర్టు అధికారులు పాప తల్లిదండ్రులిద్దరి పాస్‌పోర్టులను చూపిస్తేనే పాపకి పాస్‌పోర్టు ఇస్తామని చెప్పారు. తన పాస్‌పోర్టుని మాత్రమే అధికారులకు అందజేసిన ఆమె, పాప తండ్రి ఎనిమిది నెలల క్రితం తమని వదిలేసి వెళ్లిపోయాడని, కాబట్టి అతని పాస్‌పోర్టుని తేలేనని చెప్పింది. వారిద్దరూ పెళ్లి కాకుండానే పాపకు జన్మనిచ్చినట్టుగా తెలుసుకున్న అధికారులు పాస్‌పోర్టు ఇచ్చేందుకు […]
ఇదే ప్రశ్న కేరళ హైకోర్టుని అడిగింది ఒక మహిళ. కేరళలో ఒక తల్లి తన ఐదేళ్ల పాపకి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు పెట్టుకుంది. పాస్‌పోర్టు అధికారులు పాప తల్లిదండ్రులిద్దరి పాస్‌పోర్టులను చూపిస్తేనే పాపకి పాస్‌పోర్టు ఇస్తామని చెప్పారు. తన పాస్‌పోర్టుని మాత్రమే అధికారులకు అందజేసిన ఆమె, పాప తండ్రి ఎనిమిది నెలల క్రితం తమని వదిలేసి వెళ్లిపోయాడని, కాబట్టి అతని పాస్‌పోర్టుని తేలేనని చెప్పింది. వారిద్దరూ పెళ్లి కాకుండానే పాపకు జన్మనిచ్చినట్టుగా తెలుసుకున్న అధికారులు పాస్‌పోర్టు ఇచ్చేందుకు నిరాకరించారు. ఇండియాలో పాపని చూసుకునేందుకు ఎవరూ లేరని, ఆమెను తనతోపాటు అమెరికా తీసుకువెళ్లి తీరాలని ఆమె ఎంతగా బ్రతిమలాడినా అధికారులు అంగీకరించలేదు. దాంతో ఆమె కోర్టుకు వెళ్లక తప్పలేదు. ఈ కేసుని విచారించిన హైకోర్టు మానవతా దృక్పథాన్ని పరిగణనలోకి తీసుకుని పాపకి పాస్‌పోర్టు మంజూరు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించింది. సాంకేతిక కారణాలు చూపించి పాస్‌పోర్టుని ఆపితే అది న్యాయం అనిపించుకోదని న్యాయమూర్తి ఎవి రామకృష్ణ పిళ్లై వ్యాఖ్యానించారు.జీవించే హక్కులో పిల్లలు తల్లిదండ్రులతో కలిసి ఉండే హక్కు సైతం కలిసి ఉంటుందని ఆయన తెలిపారు. పిల్లల ఆ హక్కుని తిరస్కరించడం వారి సహజహక్కులను దూరం చేయడమేనని, అది వారి మానసిక ఎదుగుదలకు, జీవితాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతుందని న్యాయమూర్తి వివరించారు. మొత్తానికి కోర్టు జోక్యంతో పాపాయి పాస్‌పోర్టు కథ సుఖాంతమైంది. అయితే కోర్టు వాడిన సాంకేతిక కారణాలు అనేపదాన్ని గురించి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాస్‌పోర్టు అధికారులు ముందుగానే పాప కోణంనుంచి ఆలోచిస్తే వారికి న్యాయమూర్తికి వచ్చిన ఆలోచనలే వచ్చేవి. మనం ఏర్పరచుకున్న చట్టాల వలన మన కళ్లముందే ఒక మనిషికి అన్యాయం జరుగుతున్నా దాని పరిష్కారం వైపు ఒక్క అడుగు కూడా వేయకుండా సాంకేతిక కారణాలను చూపిస్తున్నామంటే….అలాంటివారంతా నిజంగానే మానవతని చట్టాలకు జోడించకుండా యాంత్రికంగా పనిచేస్తున్నారనే అర్థం.