Telugu Global
Others

పెండింగ్ లో ఆక్వా పర్మిషన్స్

రాష్ట్రంలో ఆక్వా సాగు నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ప్రస్తుతం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఈ పరిశ్రమ క్రమేపీ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దీనికి ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఒక కారణమైతే.. అధికారుల అవినీతి మరో కారణం. ఆక్వా రైతులకు ప్రోత్సాహం లేక, నాణ్యత గల సీడ్ అందక ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క ఏళ్ల తరబడి కొత్త చెరువులకు అనుమతులు ఇవ్వకపోవడం, ఉన్నవాటిని రెన్యువల్ చేయకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. దీనికితోడు మార్కెటింగ్, ఎగుమతులకు మౌలిక సదుపాయాలు లోపించడంతో రాష్ట్రంలోని […]

పెండింగ్ లో ఆక్వా పర్మిషన్స్
X

రాష్ట్రంలో ఆక్వా సాగు నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. ప్రస్తుతం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఈ పరిశ్రమ క్రమేపీ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దీనికి ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఒక కారణమైతే.. అధికారుల అవినీతి మరో కారణం.

ఆక్వా రైతులకు ప్రోత్సాహం లేక, నాణ్యత గల సీడ్ అందక ఇబ్బందులు పడుతుంటే.. మరోపక్క ఏళ్ల తరబడి కొత్త చెరువులకు అనుమతులు ఇవ్వకపోవడం, ఉన్నవాటిని రెన్యువల్ చేయకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది. దీనికితోడు మార్కెటింగ్, ఎగుమతులకు మౌలిక సదుపాయాలు లోపించడంతో రాష్ట్రంలోని 9 జిల్లాల్లో చేపలు, రొయ్యలసాగు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్ కు 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. దీనికి ఆనుకుని 6.2 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగు జరుగుతోంది. ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో 60 శాతంగా ఉన్న ఆక్వా సాగు రాష్ట్ర ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే రెండేళ్లుగా అనుమతుల్లేక, రుణాలు రాక 9 జిల్లాల్లోనూ మత్స్య సాగు రైతులు ఇబ్బందులెదుర్కొంటున్నారు.

కొత్త చెరువులకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో వేలాది మంది ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 9 జిల్లాల్లో రెండేళ్ల నుంచి 60 వేలకు పైగా కొత్త దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిని పరిశీలించాల్సిన అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రెవెన్యూ, మత్స్య, వ్యవసాయ, పంచాయతీ, ఇలా 11 ప్రభుత్వ శాఖలు పరిశీలిస్తేనే దరఖాస్తులకు మోక్షం లభిస్తుంది. అధికారులకు వేలకువేలు ముట్టజెప్పినా.. అనుమతులు మాత్రం రావడంలేదని రైతులు వాపోతున్నారు. ఒక్కో ఎకరాకు రూ.5 వేల వరకూ అధికారులు మామూళ్లు అందుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్కో ఎకరాకు రూ.5 వేల వరకూ అధికారులు మామూళ్లు అందుకున్నారనేది తెలుస్తోంది. మండల, జిల్లాస్థాయి కమిటీలు కూడా అనుమతులపై వేగంగా స్పందించడం లేదు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం కూడా రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఇక రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల పరిస్థితీ అంతే. అధికారుల చుట్టూ నెలల తరబడి రైతులు తిరుగుతున్నా రెన్యువల్స్ కావడం లేదు. మాముళ్ల కోసం ఎదురు చూసే అధికారులు తీరుతో రైతులు ఆవేదనతో విసుగు చెందుతున్నారు. పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కల్పిస్తే.. రాష్ట్రంలో మరో 2 లక్షల ఎకరాల్లో సాగు పెరిగే వీలుంది.

కాగా, అనుమతుల్లేని, రెన్యువల్ కాని చెరువుల్లో చేపల సాగుకు బ్యాంకులు రుణాలివ్వడం లేదు. ఉభయ గోదావరి, కృష్ణాజిల్లాల్లో సుమారు 30 వేల మంది రైతులు బ్యాంకు రుణాలు అందక ఆర్థికంగా గడ్డుపరిస్థితిలో ఉన్నారు. ఒకపక్క చెరువుల లీజులు పెరిగిపోతుంటే మరోపక్క వైరస్ కారణంగా చేపల ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. రెండు నెలల క్రితం కిలో రూ.65 ఉన్న ఫంగస్ చేపల ధర నేడు మార్కెట్లో రూ.55 పలుకుతోంది. వైట్ ఫిష్ ధరలు కూడా రూ.20 వరకూ తగ్గాయి. వైరస్ వల్ల వనామీ రొయ్యలసాగు కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటేనే ఆక్వాసాగు నిలదొక్కుకుంటుందని రైతులు చెబుతున్నారు.

First Published:  13 April 2015 3:48 PM IST
Next Story