మనసులేని తనం
ప్రాచీనయుగాల్లో మన పురాణాల్లో జనమహారాజును గొప్పజ్ఞానిగా భావిస్తాం. ఆయన మహారాజయినా నిత్యం తత్వ చింతనలో, జ్ఞాన చర్చల్లో మునిగివుండేవాడు. దేశదేశాల నుండి ఆయన దర్శనం కోసం ఎందరో మహాపురుషులు వచ్చేవాళ్ళు.
ప్రాచీనయుగాల్లో మన పురాణాల్లో జనమహారాజును గొప్పజ్ఞానిగా భావిస్తాం. ఆయన మహారాజయినా నిత్యం తత్వ చింతనలో, జ్ఞాన చర్చల్లో మునిగివుండేవాడు. దేశదేశాల నుండి ఆయన దర్శనం కోసం ఎందరో మహాపురుషులు వచ్చేవాళ్ళు.
నిరంతర జ్ఞాన చింతనతో, బ్రహ్మజ్ఞాన అన్వేషణలో జనకమహారాజు మునిగి వుండేవాడు. దేనినయినా, ఎప్పుడయినా వదులుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా వుండేవాడు. ప్రపంచ అశాశ్వ తత్వాన్ని తెలిసిన మహాజ్ఞాని ఆయన.
ఆయనలో జ్ఞాన తృష్ణ అపారం, అనంతం. అంతిమ సత్యం గురించి నిరంతర అన్వేషణలో మునిగివుండేవాడు.
ఒక సారి ఆయన దేశమంతా ఒక ప్రకటన చేశాడు. దేశంలోని పండితుల్ని, వేదాంతుల్ని, తత్వవేత్తల్ని కవుల్ని ఆహ్వానించాడు. గొప్ప జ్ఞాన సమావేశం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించాడు. ఆ రోజు వచ్చింది. వేలమందితో సభ కిటకిటలాడుతోంది.
జనకుడు మాట్లాడ్డం మొదలు పెట్టాడు. అందరూ నిశ్శబ్దంగా వుండిపోయారు. జనకుడు 'మీలో ఎవరయినా నాకు జ్ఞానోపదేశమివ్వాలి. ఎలా అంటే నేను గుర్రం ఎక్కి ఒక నాడాలో కాలుపెట్టి, తరువాత యింకో నాడాలో కాలు పెట్టేలోగా నాకు జ్ఞానోపదేశం చెయ్యాలి' అన్నాడు.
సభలోని వారంతా నిశ్చేష్టులయ్యారు. ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే క్షణకాలంలో జ్ఞానోపదేశం చెయ్యడమంటే ఎలాగో ఎవరికీ తోచలేదు.
జనకమహారాజు 'మీలో ఎవరయినా నాకు జ్ఞానోపదేశం చెయ్యడానికి ముందుకు రండి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. కేవలం శాస్త్ర జ్ఞానంతో పాండిత్య ప్రకర్షతో మీ ప్రతిభ ప్రదర్శించకండి. మీరు చెప్పేది అనుభవపూర్వకంగా వుండాలి. హఠాత్ సంభవానికి అది అనుకూలంగా వుండాలి' అని సమస్యను మరింత సంక్షిష్టం చేశారు.
జనకమహారాజుకు జ్ఞానోపదేవం కలిగించడమంటే, బ్రహ్మను భూతి కలిగించడమంటే మామూలు విషయం కాదు. అటువంటి వ్యక్తి ఆయన్ని మించిన జ్ఞాని అయివుండాలి. సభనిశ్శబ్దంగా వుంది. ఎవరూ ముందుకు రాలేదు. ఇక సభ ముగుస్తుందని అందరూ అనుకున్నారు.
అష్ట్రావక్రుడను మహాముని లేచి 'జనకమహారాజా నేనుమీకు జ్ఞానోపదేశం కలిగిస్తాను' అన్నాడు.
ఒక మహాజ్ఞాని తన రాజ్యంలో వున్నాడన్న నమ్మకం జనకమహారాజుకు కలిగింది. నేను సిద్ధం అన్నాడు. అష్ట్రావక్రముని 'రాజా! జ్ఞానోపదేశం అన్నది సభ మధ్యలో, జనం మధ్యలో చేయదగింది కాదు. ఏకాంత స్థలంలో చేయదగింది. మనం సమీప అరణ్యంలోకి వెళదాం' అన్నాడు. సరేనని జనకమహారాజు కొంతమంది సైనికులతో, అష్ట్రా వక్రునితో అరణ్యం వేపు వెళ్ళాడు.
సైనికుల్ని ఒక దగ్గరవదిలి అష్ట్రావక్రుడు, జనకమహారాజు అరణ్యంలోపలికి వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో ఆగాడు.
జనకమహారాజు 'అష్టావక్రా! నేను గుర్రం ఎక్కాను. యింకో కాలు యింకో నాడాలో పెట్టేలోగా నువ్వు నాకు జ్ఞానోదయం కలిగించాలి' అన్నాడు.
అష్టావక్రుడు 'తప్పకుండా మహారాజా! అయితే ముందుగా మీరు నాకు గురుదక్షణ చెల్లించాలి' అన్నాడు. మహారాజు 'తప్పక అడగండి' అన్నాడు.
అష్టావక్రుడు 'మీ మనసును నాకివ్వండి' అన్నాడు. జనకమహారాజు తనమనసును అష్టా వక్రుడికి యిచ్చేశాడు. యిచ్చేసిన మరుక్షణం ఆయన అచేతనంగా గుర్రం మీద పడిపోయాడు. అష్టావక్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఎంతసేపటికీ రాజు రాకపోయే సరికి సైనికులు అరణ్యం లోపలికి వచ్చి వెతికారు. గుర్రం మీద అచేతనంగా పడివున్న జనకమహారాజును చూశారు. అష్టావక్రుడు అక్కడ లేడు. అష్టావక్రుడేదో మంత్రం వేశాడని అతన్ని వెతకడానికి వెళ్ళి అష్టావక్రుణ్ణి చూశారు. విషయం చెప్పారు. అష్టావక్రుడు వచ్చి జనకమహారాజును తాకాడు. మహారాజుకు స్పృహ వచ్చింది.
మనసు ప్రాపంచికమైంది. మనసు ప్రపంచమిచ్చింది. అది ఆత్మకు అడ్డంగావుంటుంది. అది మాయమయితే ఆత్మ ముందుకు వస్తుంది. ఆత్మ ఆవిష్కారమవడమంటే జ్ఞానోదయం కలగడమే.
ఆ సత్యం తెలిసి వచ్చి మహారాజు అష్టావక్రమునికి అభివాదం చేశాడు.
- సౌభాగ్య