Telugu Global
NEWS

రాజధాని భూసమీకరణకు అభ్యంతరాల వెల్లువ

రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం అనుసరించే విధానాలు తీవ్ర అభ్యంతరకరంగా మారుతున్నాయి. రైతుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు కూడా వినిపిస్తున్నాయి. పచ్చని పంటల పొలాలను బలవంతంగా లాక్కుని, రాజధాని నిర్మాణానికి పూనుకుంటున్న సీఎం చంద్రబాబునాయుడు తీరుపట్ల రైతాంగ కుటుంబాలు శాపనార్థాలు పెడుతున్నాయి. భూములను రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారని ప్రభుత్వం న‌మ్మ‌బ‌లికినా, కోర్టులనాశ్రయించి తమ భూములను ఇవ్వబోమని స్పష్టం చేసిన రైతులు కూడా ఉన్నారు. వారిని నయానో భయానో తమ దారికిలోకి తెచ్చుకునే దిశగా తెలుగుదేశం యంత్రాంగం వ్యవహరిస్తోంది. రాజధాని […]

రాజధాని భూసమీకరణకు అభ్యంతరాల వెల్లువ
X

రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం అనుసరించే విధానాలు తీవ్ర అభ్యంతరకరంగా మారుతున్నాయి. రైతుల ఉసురు తగులుతుందని శాపనార్థాలు కూడా వినిపిస్తున్నాయి. పచ్చని పంటల పొలాలను బలవంతంగా లాక్కుని, రాజధాని నిర్మాణానికి పూనుకుంటున్న సీఎం చంద్రబాబునాయుడు తీరుపట్ల రైతాంగ కుటుంబాలు శాపనార్థాలు పెడుతున్నాయి. భూములను రైతులు స్వచ్ఛందంగా ఇస్తున్నారని ప్రభుత్వం న‌మ్మ‌బ‌లికినా, కోర్టులనాశ్రయించి తమ భూములను ఇవ్వబోమని స్పష్టం చేసిన రైతులు కూడా ఉన్నారు. వారిని నయానో భయానో తమ దారికిలోకి తెచ్చుకునే దిశగా తెలుగుదేశం యంత్రాంగం వ్యవహరిస్తోంది.

రాజధాని భూ సమీకరణకు సంబంధించి కుప్పలుతెప్పలుగా వచ్చిన అభ్యంతరాలకు సమాధానాలిచ్చేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) ఆపసోపాలు పడుతోంది. స్వచ్ఛందంగా భూములిచ్చే వారి అంగీకార పత్రాలతోపాటు భూములిచ్చేందుకు నిరాకరించే రైతుల అభ్యంతర పత్రాలు కూడా భారీగా వచ్చాయి. తొలిదశ భూసమీకరణ ప్రక్రియ ముగిసే నాటికి 7,982 ఎకరాలకు సంబంధించి 10,460 మంది రైతులు అభ్యంతర (9.2) పత్రాలు దాఖలు చేశారు. వాటిలో 70 శాతం భూములకు సంబంధించినవి కాగా, మిగిలినవి ఇతర అంశాలకు చెందినవి ఉన్నాయి. సుమారు 7 వేల పత్రాలు అభ్యంతరాలు కాగా, మిగతావన్నీ సూచనలు, సలహాలు ఉన్నాయి. వాటన్నింటినీ క్షుణ్ణంగా చదివి సీఆర్డీఏ చట్టానికి లోబడి సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.

ఎక్కువ మంది భూములివ్వడం తమకిష్టం లేదని పత్రాల్లో ఆయా పత్రాల్లో పేర్కొన్నారు. కొందరు పరిహారం పెంచాలని, మరికొందరు తమకున్న భూమిలో కొంత ఇచ్చి కొంత ఉంచుకుంటామని, ఇంకొందరు జరీబు భూములు ఉంచుకుని, మెట్ట భూములు ఇస్తామని 9.2 పత్రాల్లో పేర్కొన్నారు. గ్రామకంఠానికి అవతల తమ ఇళ్లున్నాయని, వాటిని తొలగిస్తారా? అని కొందరు పత్రాలు దాఖలు చేయగా, గ్రామాల్ని ఇక్కడే ఉంచుతారా? వేరే చోటుకు తరలిస్తారా? రోడ్డుపక్కనున్న భూమికి, రోడ్డు అవతల ఉన్న భూమికి ఒకే పరిహారమిస్తారా? అని పలువురు పేర్కొన్నారు.

మరోవైపు భూముల తర్వాత వ్యవసాయాధారిత వర్గాల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి. భూమి లేకుండా పాడిని నమ్ముకున్న కొందరు తమకు ఎలాంటి ఉపాధి కల్పిస్తారు? ఊరిబయట ఉన్న కోళ్ల ఫారాలు తీసేస్తారా? వంటి అనేక అనుమానాలను 9.2 రూపంలో వ్యక్తం చేశారు. వీటన్నింటికీ సమాధానాలిచ్చేందుకు సీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. 9.2 పత్రాలు దాఖలు చేసిన వారందరికీ త్వరలో వ్యక్తిగతంగా సమాధానాలిచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భూసమీకరణ జరుగుతున్న తొలిదశలో అంగీకార పత్రాల (9.3)తోపాటు భారీగా వస్తున్న అభ్యంతర పత్రాల (9.2)ను తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తీసుకోకతప్పలేదు. చివరికి 32,469 ఎకరాలకు సంబంధించి 20,510 మంది రైతులు అంగీకార పత్రాలివ్వగా, 10,460 మంది అభ్యంతర పత్రాలిచ్చారు. ప్రభుత్వం అంగీకార పత్రాల గురించి పేర్కొన్నా అభ్యంతర పత్రాలపై బయటకు చెప్పలేదు. కానీ నెమ్మదిగా అన్ని అంశాలు బయటపడుతుండడం శోచనీయం.

ప్రస్తుతం రాజధాని భూములు, ఇతర అంశాలకు సంబంధించి సీఆర్డీఏకు ఎడాపెడా నోటీసులు వస్తున్నాయి. రోజుకు 5 నుంచి పది నోటీసులు వస్తుండడంతో సీఆర్డీఏ లీగల్ సెల్ అయోమయంలో పడింది. ఇప్పటివరకూ సుమారు వెయ్యికిపైగా నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. వీటికి సమాధానాలు ఇస్తుండడంతో రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి నోటీసులు, రాజధాని సంబంధిత స్థానిక లీగల్ వ్యవహారాలు చూసేందుకు కన్సల్టెంట్ ను నియమించాలని సీఆర్డీఏ నిర్ణయించింది.

First Published:  9 April 2015 11:50 AM IST
Next Story