ఆహా...నిజంగా ఆకాశంలో సగమయ్యారు
కేరళ ఐఐఎమ్ లో తాజా బ్యాచ్ గ్రాడ్యుయేట్లలో 50శాతం పైగా అమ్మాయిలు కేరళలోని కొజీకోడ్‌లో ఉన్నఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్) ఈ విద్యాసంవత్సరంలో ఒక అద్భుతమైన రికార్డుని సృష్టించింది. ఈ సంస్థనుండి ఈ సంవత్సరం తాజాగా గ్రాడ్యుయేట్లుగా బయటకు వచ్చిన వారిలో 50శాతం మందికి పైగా అమ్మాయిలే ఉన్నారు. మనదేశంలో తమ బోర్డుల్లో ఒక్కమహిళా డైరక్టరూ లేని నమోదిత కంపెనీలు ఉన్నాయని, సెబీ నిబంధనలను పాటించడానికి కంపెనీల యజమానులు హడావుడిగా తమ ఇళ్లలోని మహిళలను తెచ్చి […]
కేరళ ఐఐఎమ్ లో తాజా బ్యాచ్ గ్రాడ్యుయేట్లలో 50శాతం పైగా అమ్మాయిలు
కేరళలోని కొజీకోడ్‌లో ఉన్నఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్) ఈ విద్యాసంవత్సరంలో ఒక అద్భుతమైన రికార్డుని సృష్టించింది. ఈ సంస్థనుండి ఈ సంవత్సరం తాజాగా గ్రాడ్యుయేట్లుగా బయటకు వచ్చిన వారిలో 50శాతం మందికి పైగా అమ్మాయిలే ఉన్నారు. మనదేశంలో తమ బోర్డుల్లో ఒక్కమహిళా డైరక్టరూ లేని నమోదిత కంపెనీలు ఉన్నాయని, సెబీ నిబంధనలను పాటించడానికి కంపెనీల యజమానులు హడావుడిగా తమ ఇళ్లలోని మహిళలను తెచ్చి డైరక్టర్లుగా చేస్తున్నారని వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇలాంటి రికార్డు ఒకటి మనముందుకు వచ్చింది. ఇది యాదృచ్ఛికమే అయినా, అమ్మాయిలు, లోపం తమలో లేదని, వ్యవస్థలోనే ఉందని రుజువు చేశారు. మరే అత్యున్నత స్థాయి బిజినెస్ స్కూలూ ఇలాంటి మైలురాయి చేరలేదు. అంతేకాదు, ఈ ఫలితాల్లో అత్యుత్తమ ఆల్‌రౌండ్ ప్రజ్ఞను కనబరచింది, రెండు, మూడు ర్యాంకులను సొంతం చేసుకున్నది సైతం అమ్మాయిలే. ఎక్కువమంది అమ్మాయిలు ఉన్న క్లాసులో చదవటం అనేది తనకు ముందుముందు కార్పొరేట్ ప్రపంచంలో రాణించేందుకు మరింతగా ఉపకరిస్తుందని హర్షా యాదవ్ అనే పట్టభద్రుడు తెలిపాడు.
స్త్రీ పురుష సమానత్వ కోణంలో పనిచేయాల్సిన రంగంలో ఈ పరిణామం ప్రయోజనకరమని అతను వ్యాఖ్యానించాడు. కార్పొరేట్ రంగంలో మహిళలు అత్యున్నత స్థానాల్లో చాలా తక్కువ మంది ఉన్నారని, తామంతా పలు కంపెనీల్లో సిఇఓ స్థాయికి ఎదిగి ఆ లోటుని భర్తీ చేస్తామని అంకితా పాయ్ అనే గ్రాడ్యుయేట్ తెలిపింది. కేరళ ఐఐఎమ్ మొదటినుండీ అమ్మాయిలకు ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. 2010లో సీట్లు పొందిన వారిలో మూడోవంతుమంది అమ్మాయిలే ఉన్నారు. ఆ సంఖ్య ఈ సంవత్సరం 55శాతానికి పైగా ఉంది. ఎక్కువమంది అమ్మాయిలు తమ సంస్థలో చేరేలా తొలినుండీ ఈ విద్యాసంస్థ ప్రయత్నాలను చేస్తూ నే ఉంది. కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్, గ్రూప్ డిస్కషన్లు, ఇంటర్వ్యూ అన్నింటినీ ఇంజినీర్ ఫ్రెండ్లీ విధానంలో జరిపింది. వీటితోపాటు అమ్మాయిలు చదువుల్లో నిలకడగా రాణించడం, చదువులు, మార్కులకు అతీతంగా ప్రతిభ నైపుణ్యాలను చూపడాన్ని సైతం పరిగణనలోకి తీసుకున్నామని ఐఐఎమ్ ఎకడమిక్ డీన్ కేయూర్ పురానీ పేర్కొన్నారు. కంపెనీలకు మేనేజ్‌మెంట్ స్థాయి పోస్టుల్లో మహిళల అవసరం, మహిళలు ఆ స్థాయిలో సైతం తమ ముద్ర వేయాల్సిన అవసరం ఉన్న నేటి తరుణంలో ఇదొక మంచి పరిణామంగా భావించాలి.