చిట్టిమెదళ్లను చిదిమేస్తున్న పేదరికం
వంశాల గొప్పలు కాదు, వాస్తవ పరిస్థితులే కీలకం ప్రపంచాన్ని ప్రాక్టికల్ గా అర్థం చేసుకోకపోవటం వలన మనం ఇప్పటికే చాలా అనర్థాలను ఎదుర్కొంటున్నాం. సాధారణంగా ఒక మనిషి తెలివితేటలు, ప్రగతి, కళల్లో రాణింపు లాంటి విషయాలను ఆ వ్యక్తి పుట్టిన కుల మతాలు, జాతి, వంశం, తల్లిదండ్రుల తెలివితేటలు తదితర అంశాలతో ముడిపెడుతూ ఉంటాం. అక్కడే ప్రపంచంలోని సర్వ వివక్షలకూ తొలిబీజం పడుతుంది. కొన్ని జన్యుపరమైన అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉన్నా, కొన్ని తరాలుగా సరిపడా […]
వంశాల గొప్పలు కాదు, వాస్తవ పరిస్థితులే కీలకం
ప్రపంచాన్ని ప్రాక్టికల్ గా అర్థం చేసుకోకపోవటం వలన మనం ఇప్పటికే చాలా అనర్థాలను ఎదుర్కొంటున్నాం. సాధారణంగా ఒక మనిషి తెలివితేటలు, ప్రగతి, కళల్లో రాణింపు లాంటి విషయాలను ఆ వ్యక్తి పుట్టిన కుల మతాలు, జాతి, వంశం, తల్లిదండ్రుల తెలివితేటలు తదితర అంశాలతో ముడిపెడుతూ ఉంటాం. అక్కడే ప్రపంచంలోని సర్వ వివక్షలకూ తొలిబీజం పడుతుంది. కొన్ని జన్యుపరమైన అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉన్నా, కొన్ని తరాలుగా సరిపడా సంపద ఉండి, మంచి ఆహారం తీసుకుంటూ ఆనందంగా బతకటం వల్లనే ఆయా కుటుంబాల్లో పిల్లలు ఆరోగ్యంగా తెలివితేటలతో పుడుతుంటారని, పెరుగుతుంటారని కాబట్టి తెలివితేటలను పేదరికం, సంపదలు, సామాజిక అంతస్తు ఎక్కువగానే ప్రభావితం చేస్తాయని చెబితే చాలామందికి అహం దెబ్బతింటుంది. కులగోత్రాలతో సంబంధం లేకుండా తెలివితేటలు ఉంటాయి కాబట్టే పేదరికం ఒత్తిళ్లను అధిగమించే మానసిక శక్తి, సంకల్పం ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినా విజయాలు సాధిస్తున్నారు. శాస్త్ర్త్త వేత్తలకు ఎప్పటినుండో ఈ అనుమానం ఉంది. పుట్టిపెరిగిన సామాజిక ఆర్థిక పరిస్థితుల పైన పిల్లల ప్రవర్తన, వారి మానసిక తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు ఆధారపడి ఉంటాయని. న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్శిటీ న్యూరో సైంటిస్టులు, కాలిఫోర్నియా లోని ఓ పిల్లల వైద్యశాల వైద్యులు కలిసి ఇదే విషయంపై ఓ పరిశోధన నిర్వహించారు. వారు అమెరికాలోని పలు నగరాలనుండి అతిచిన్న, కౌమార, యవ్వన దశల్లో ఉన్న 1099మంది పిల్లలను ఎంపిక చేసి పరిశోధనలు నిర్వహించారు. ఇందులో వారు తక్కువ ఆదాయం ఉన్న ఇళ్లలో పుట్టిన పిల్లల మెదడు నిర్మాణానికి, హెచ్చు ఆదాయం ఉన్న కుటుంబాల్లో పుట్టిన పిల్లల మెదడు నిర్మాణానికి తేడా ఉన్నట్టుగా గుర్తించారు. ముఖ్యంగా భాష, నిర్ణయాత్మక శక్తి ఈ రెండు అంశాలకు సంబంధించిన మెదడు భాగాల పెరుగుదలలో ఈ తేడా స్పష్టంగా కనిపించింది. చదువు, తెలివితేటలు, జ్ఞాపకశక్తి తదితర అంశాల్లో తల్లి దండ్రుల ఆదాయం తక్కువగా ఉన్న పిల్లలు వెనుకబడి ఉన్నట్టుగా గుర్తించారు. ప్రతివ్యక్తి మెదడులో కాలానుగుణంగా జరిగే మార్పులు భిన్నంగా ఉంటాయి. వాటిని పరిశీలనలోకి తీసుకోకపోయినా పేదరికం మాత్రం ఎదుగుతున్న పిల్లల మెదడుమీద ప్రభావం చూపితీరుతుందని అర్ధమైందని ఫిలడెల్ఫియా లోని పెన్నిస్లేవియా యూనివర్శిటీలో కాగ్నటివ్ న్యూరో సైంటిస్టుగా పనిచేస్తున్న మార్తా ఫరా అంటున్నారు. ఆమె తన సహచరులతో కలిసి 44మంది ఒక్కనెల వయసున్న ఆఫ్రికన్ అమెరికన్ ఆడశిశువులను ఎంపిక చేసుకుని వారి మెదడులను పరిశీలించి చూశారు. అంత చిన్న వయసులోనూ ఆదాయం తక్కువగా ఉన్నకుటుంబాల్లో పుట్టిన శిశువుల మెదడు పరిమాణం చిన్నగా ఉండటం గుర్తించారు. పై రెండు పరిశోధనలను బట్టి సరైన ఆహారం అందకపోవటం, సామాజికంగా ఒత్తిడి, అణచివేత, ఆరోగ్యకరమైన వాతావరణంలో నివసించకపోవటం ఇవన్నీ పిల్లల మెదడు ఎదుగుదల మీద వారు పుట్టకముందు నుండే ప్రభావం చూపుతాయని తేలిందని ఈ శాస్త్ర్రవేత్తలు చెబుతున్నారు.