రుద్రమదేవి పరుచూరి మేనకోడలా?
రుద్రమదేవి పరుచూరి మేనకోడలా? కాకతీయ సామ్రాజ్యం కృష్ణాజిల్లాలో ప్రారంభమైందా? ఇంతకీ కాకతీయులది ఏ కులం? ఏ ప్రాంతం? ఏ జాతికైనా, ఏ దేశానికైనా కాలాతీతంగా నిలిచి పోయే గొప్పవ్యక్తులు కొందరుంటారు. తెలుగు వారికి సంబంధించి కాకతీయ సామ్రాజ్య పాలకులు అలాంటివారే. వాస్తవానికి నదీ మూలం, ఋషి మూలం, వీరుల, శూరుల పుట్టుకల గురించి ఆలోచించకూడదని శాస్త్రోక్తి. కాని ఈ దేశంలో దురదృష్టవశాత్తు దేవుళ్ళకే కులాలు అంటగడుతున్నారు. జాతీయ నాయకులకి ఫలానా రాష్ట్రం. ఫలానా కులం అని టాగ్‌లు […]
రుద్రమదేవి పరుచూరి మేనకోడలా?
కాకతీయ సామ్రాజ్యం కృష్ణాజిల్లాలో ప్రారంభమైందా?
ఇంతకీ కాకతీయులది ఏ కులం? ఏ ప్రాంతం?
ఏ జాతికైనా, ఏ దేశానికైనా కాలాతీతంగా నిలిచి పోయే గొప్పవ్యక్తులు కొందరుంటారు. తెలుగు వారికి సంబంధించి కాకతీయ సామ్రాజ్య పాలకులు అలాంటివారే.
వాస్తవానికి నదీ మూలం, ఋషి మూలం, వీరుల, శూరుల పుట్టుకల గురించి ఆలోచించకూడదని శాస్త్రోక్తి.
కాని ఈ దేశంలో దురదృష్టవశాత్తు దేవుళ్ళకే కులాలు అంటగడుతున్నారు. జాతీయ నాయకులకి ఫలానా రాష్ట్రం. ఫలానా కులం అని టాగ్‌లు తగిలిస్తున్నారు.
ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాజవంశాలని తమ ఇంట్లోకి తీసుకెళ్ళి, గోడకున్న మేకులకి వేలాడదీసుకుంటున్నారు.
ఇండియాలో ఏ రాజ వంశం చరిత్ర తెలుసుకోవాలన్నా రెండే రెండు అంశాలు. ఒకటి-శాసనాలు, రెండోది-ఆ కాలం నాటి కావ్యాలు. ఆ రెండూ సామాన్య జనానికి ప్రస్తుతం అందుబాటులో లేకుండాపోయాయి.
ఇక సినిమాల్లో చూసిందే చరిత్ర- కృష్ణదేవరాయలంటే ఎన్టీఆర్ (నిజానికి కృష్ణదేవ రాయల ముఖం మీద స్ఫోటకం మచ్చలున్నాయని కృష్ణదేవరాయలని స్వయానా కలుసుకున్న విదేశీ యాత్రికుడు రాశాడు) అని అనుకుంటారు.
ఇక అల్లూరి సీతారామరాజుని బ్రిటీష్ సైన్యం చెట్టుకి కట్టి, కిరాతకంగా కాల్చిచంపారని తెలీదు. సినిమాలోలాగా అల్లూరి సీతారామరాజు శత్రువుల తుపాకీ గుళ్ళకి గుండె చూపించాడనుకుంటారు.
‘దానవీర శూర కర్ణ’ సినిమా చూసి ద్రౌపది పంచపాండవులతో సరిపెట్టుకోక, ఆరవ భర్తగా కర్ణుడ్ని కోరుకుందని నమ్మేవాళ్ళు అసంఖ్యాకం.
ఇలా భారతీయ ఇతిహాసాలు, చరిత్రలు సినిమాకి అనుగుణంగా మారిపోయాయి. ఇప్పుడు ఇదే కోవలోకి చేరుతుందా రుద్రమదేవి సినిమా అన్పిస్తుంది. ఇటీవల జరిగిన ‘రుద్రమదేవి’ ఆడియో ఫంక్షన్ చూస్తే.
మార్చి 21న విశాఖపట్నంలో జరిగిన ఆ సినిమా ఫంక్షన్‌లో చిత్రరచయిత పరుచూరి గోపాలకృష్ణ కాకతీయ సామ్రాజ్యం క్రీ.శ.956లో కృష్ణా జిల్లా నందిగామలో ప్రారంభమైందని, రుద్రమదేవి మేనమామ పరుచూరి బేతిరాజు అని, రుద్రమదేవి తమ ఆడపడుచు అని చెప్పారు.
రుద్రమదేవి మేనమామ పరుచూరి బేతిరాజు అని క్రీ.శ 1192లో పరుచూరి కేతినాయుడు పరిపాలింపరిపాలించాడని, క్రీ.శ.956లో కృష్ణాజిల్లాలోని నందిగామ సమీపంలోని ఓ చిన్న గ్రామంలో కాకతీయ సామ్రాజ్యం ప్రారంభమైంది. అనిచెప్పుకుంటూ వచ్చారు.
ఇందులోని వాస్తవాలేమిటో పరిశీలిద్దాం.
అడవిబిడ్డలు
క్రీ.శ.9వ శతాబ్దంలో రాష్ట్ర కూటుల దగ్గర సామాన్య సైనికోద్యోగాల్లో ఉండేవారు కాకతీయులు.
బోయలు, పుళిందులు అనే గిరిజనజాతికి చెందిన వారు కాకతీయులు అని పలు చారిత్రక గ్రంధాల్లో పేర్కొన్నారు. వారి మూలాలు తెలుగు నేలపైనే లేవు.
కర్ణాటకలోని బెల్లాంకి ఉత్తరంగా పన్నెండుమైళ్ళ దూరంలో ఉన్న కందారపురం (కాకతిపురం) నుంచి కాకతీయులు వచ్చారని భారతీయ ప్రభుత్వ శాసనాల పరిశోధకులు కె. లక్ష్మీనారాయణరావు కొన్ని శాసనాల ఆధారంగా చెప్పారు.
కాకతీయుల గురించి ఉన్న చారిత్రక ఆధారక గ్రంధం సిద్ధేశ్వర చరిత్రలో సైతం కందారపురం అనే పట్నం నుంచి వలస వచ్చారని రాసి ఉంది.
అంతే కాకుండా కాకతీయ వంశ స్థాపకుడు వెన్న రాజు, ఆ తర్వాతి ప్రభువులు గుండన, ఎరియ, బేతియ…. ఇలాంటి పేర్లు కేవలం బోయలలో, పుళిందులలో మాత్రమే వినబడతాయని పలువురు చారిత్రకారులు స్పష్టంగా చెప్పారు.
ఈ కృష్ణా జిల్లా గొడవేంటి?
చాలామంది పండితులు కాకతీయులకి తెలుగుమూలాలు అంటకట్టే ప్రయత్నం చేశారు. కాకతీయులు కొంతకాలం తూర్పు చాళుక్యరాజుల సామంతులుగా ఉన్నారని అందువల్ల తెలుగువారై ఉంటారని.. చాలామంది ఊహాగానాలు చేశారు.
అయితే పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడిన క్రీ.శ.956వ సంవత్సరం ఏదైతే ఉందో, ఆ సంవత్సరంలో (క్రీ.శ.956) తూర్పు చాళుక్యరాజు దానార్ణవుడు జారీచేసిన మాంగల్లు దాన పత్రంలో ఈ కాకతీయుల గురించి మొదట స్పష్టంగా పేర్కొన్నారు.
క్రీ.శ.895లో కాకతి గుండన (మూడవ) అనే ఓ రాష్ట్ర కూట సేనాధిపతి, తన ప్రభువు రాష్ట్ర కూట రాజు కృష్ణుడి కోసం తూర్పు చాళుక్యుల రాజధాని అయిన విజయవాడని పట్టుకోవడంలో జరిగిన పోరులో తన ప్రాణాలు కోల్పొయాడు.
అతని ముని మనవడు నాలుగవ గుండన కోరిక మేరకు దానార్ణవుడు క్రీ.శ. 956లో ఓ బ్రాహ్మణుడికి చేసిన దానమే మాంగల్లు శాసనం. ఇది కృష్ణాజిల్లాలో లభ్యం కావడంతో-కృష్ణాజిల్లా నందిగామలో కాకతీయ రాజ్యం ప్రారంభమైందని ప్రచారం ప్రారంభించారు – పరుచూరి గోపాలకృష్ణ.
రాష్ట్రకూట రాజు రెండవ కృష్ణుడు (కన్నర బల్లహుడు) క్రీ.శ. 900లో వరంగల్లు జిల్లా, మహబూబాబాద్ తాలూకాలోని కొరవిని (అప్పటి పేరు కుఱ్ఱడివి) జయించాడు. దాని పాలకుడిగా తన సేనాధిపతి ఆయిన మూడో గుండన కుమారుడు ఎరియని నియమించాడు.
అయితే తిరిగి కొరవిని ముదిగొండ చాళుక్య నాయకుడు గొరొగ స్వాధీనం చేసుకోవడంతో కాకతీయ నాయకులు తెలంగాణా లోపలి ప్రాంతాల్లోకి వెళ్ళి స్థిరపడ్డారు.ఇదీ కాకతీయులు తెలుగు నేలపై కాలుమోపిన కథ.
పరుచూరి బేతరాజు ఎవరు?
కాకతీయ వంశ వృక్షం చూస్తే ముగ్గురు బేతియల (పోనీ, బేత రాజుల) గురించి ఉంది.
మొదటి బేతియ (ఎరియ కొడుకు)కి చరిత్రలో ప్రాముఖ్యత లేదు. మాంగల్లు దానపత్రం శాసనంలో తప్పితే బయ్యారం శాసనంలో కూడా ఇతని ప్రస్తావన లేదు.
ఈ ఎరియా ఇంటిపేరు విరియాలగా శాసనాల్లో పేర్కొన్నారు.
ఈ కాలంలో (క్రీ.శ. 996 తర్వాత) బొట్టు బేతియ (ముదిగొండ చాళుక్యనాయకుడు) కూడా ఉండేవాడు.
అందువల్ల బొట్టు బేతియకి భిన్నంగా ఉండటానికి రెండవ బేతియని (క్రీ.శ1000-1057) గరుడ బేతరాజు అన్నారు. ఈ గరుడ బేతియ అనుమకొండని రాజధానిగా చేసుకున్నాడు.
ఇక చరిత్రలో మూడవ బేతరాజు (క్రీ.శ.1076-1108)ని త్రిభువన మల్లుడు అన్నారు.
గణపతిదేవుడి (రుద్రమ దేవి తండ్రి) పెద్ద అల్లుడు కోట బేతియ అనే ఆయన ఉండేవాడు.
చరిత్రలో ఈ బేతియల గురించే ఉంది.
మరి పరుచూరి బేతరాజు ఎవరు?
రుద్రమదేవికి ఎలా మేనమావ అయ్యాడు?
రుద్రమదేవి కన్నతల్లి కులమేంటి?
మేనమామ అంటే సాధారణంగా తల్లి సోదరుడయి ఉండాలి. లేదా మేనత్త భర్త అయి ఉండాలి.
అసలు రుద్రమ దేవిని కన్నతల్లి కనీసం తెలుగు జాతికి చెందినదే కాదు.
మహారాష్ట్రలోని దేవగిరి (ఇప్పటి దౌలతాబాద్-ఔరంగాబాద్‌కి దగ్గరలో ఉంది) రాజ్యాన్ని పాలించిన, యాదవ వంశానికి చెందిన జైతుని కుమార్తె సోమలాదేవి.
తన కుమార్తె సోమలాదేవిని గణపతి దేవుడికిచ్చి జైతునిరాజు వివాహం చేసినట్లు చింతలూరి తామ్రశాసనం పేర్కొంది.
పోనీ తండ్రి వైపు-మేనమావా అంటే రుద్రమదేవి మేనత్తలు మైలాంబ, కుంరాంబలను న తవాడి కుటుంబంలోని రుద్రుడు అనే రాజుకిచ్చి పెళ్ళి చేశారు.
మరి రుద్రమదేవి ఏ లెక్కన పరుచూరి వారికి చుట్టమైందో వెల్లడిస్తే బాగుంటుంది.
కాకతీయుల అసలు కులమేంటి?
పైన పేర్కొన్నట్లు కాకతీయులు బోయ జాతివారు. జైనమతం ద్వారా ఉన్నతి సాధించి, శూద్రులుగా గుర్తింపు పొంది, క్రమేపీ ఉన్నత పదవులు నిర్వహించి, రాష్ట్ర కూటులకి సామంతులయ్యారని డాక్టర్ బి.ఎస్.ఎల్ హనుమంతరావుగారు తను రాసిన ఆంధ్రుల చరిత్ర లో పేర్కొన్నాడు.
దుర్జయకుల వంశస్తులుగా కాకతీయులు తమని గురించి తాము శాసనాల్లో ప్రకటించుకున్నారు.
ఆకాలం నాటి నాలుగు కులాల్లో (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) కాకతీయులు ఏ కులానికి చెందిన వారనేది తేల్చుకోవడం గడ్డు సమస్యే!
సూర్యవంశ క్షత్రియులుగా, శ్రీ రాముడి వంశానికి చెందిన వారిగా శాసనాలు (మల్కాపురం శాసనం, మోటుపల్లి శాసనం) వేయించుకున్నారు.
అయితే అత్యధిక భాగం శాసనాలు కాకతీయుల కుల ప్రస్తావన గురించి మౌనం పాటించాయి.
బోధ్‌పూర్, వడ్డమాను, బయ్యారం శాసనాలు కాకతీయులు శూద్ర కులస్తులని పేర్కొన్నాయి.
కాకతీయులు తమ రాజ్య విస్తరణ కోసం ఇతర కులాలవారిని వివాహం చేసుకోవడం పట్ల ఆసక్తి చూపించారు.
రుద్రమదేవి తండ్రి గణపతి దేవుడి విషయానికొస్తే ఎనిమిది మంది వివిధ రాజవంశాలకు చెందినవారిని పెళ్ళాడాడు.
అలాగే శూద్రకులానికి చెందిన కోట బేతయకి తన పెద్దకుమార్తె గణపాంబని ఇచ్చి వివాహం చేశాడు.
రెండో కుమార్తె రుద్రమదేవిని చంద్ర వంశానికి చెందిన చాళుక్యరాజు వీరభద్రుడికిచ్చి పెళ్ళి చేశాడు.
రుద్రమదేవి సైతం కులాంతర వివాహాలకే ప్రాధాన్యత ఇచ్చింది.
తన మొదటి కుమార్తెని ముమ్మిడాంబని క్షత్రియుడైన మహదేవుడికి, రెండవ కుమార్తె రుద్రమని మహారాష్ట్ర యాదవ రాజు ఎల్లణదేవుడికి, మూడో కుమార్తె రుయ్యమని బ్రాహ్మణుడు ఇందులూరి అన్నయ మంత్రికిచ్చి వివాహం జరిపించింది.
ఈ ధోరణి చూస్తే వారిది ఏ కులమని చెప్పగలరు?
కమ్మవారికి సంబంధమేంటి?
ఆ కాలంలో కమ్మకులమనేది లేదు. వ్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాలను అప్పట్లో కమ్మనాడు అని పిలిచేవారు. కమ్మ అనేది కేవలం ఒక ప్రాంతం పేరు.
ఆ ప్రాంతానికి చెందిన జాయప సేనాని చెల్లెళ్ళు నారాంబ, పేరాంబలను గణపతి దేవుడు వివాహమాడాడు.
అయితే నారాంబ, పేరాంబలకు సంతానం లేదు. అలాగే జాయప సేనాని అవివాహితుడని కొందరు, అసలు అతనికి పిల్లలే లేరని మరికొందరు పేర్కొంటుంటారు. అంతకు మించిన బీరకాయపీచు చుట్టరికం కాకతీయులకి, కమ్మవారికి లేదనే చెప్పా లి.
కెసిఆర్ చెబుతున్న కాకతీయులెవరు?
తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ఆ మధ్యకాలంలో ఛత్తీస్‌గడ్ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు బస్తర్ ప్రాంతంలో కాకతీయ వంశానికి చెందిన వారున్నారని చెప్పారు.
రుద్రమదేవి మరణించిన కార్తీక మాసంలో నల్గొండలోని చందుపట్ల గ్రామానికి బస్తర్ నుంచి కొందరు కాకతీయ వారసులు వచ్చి, దర్శనం చేసుకుని, వెళ్తుంటారని స్థానికులు చెబుతుంటారు.
అసలు ఈ బస్తర్‌కి కాకతీయులకి సంబంధమేంటి?
మధ్యప్రదేశ్‌లోని బస్తర్ రాజ్యానికి ఉత్తరాన కాంకేర్ అనే దేశం ఉన్నదని, దాన్ని పూర్వం ‘కాకెర’, కాకరీయ అని పిలిచేవారని, అదీ – కాకతీయపట్నం ఒకటేనని పి.ఆర్.కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. అయితే అది ఊహాగానమేనని ఆ తర్వాతి కాలంలో తేట తెల్లమైంది.
అంతేకాకుండా – మధ్యప్రదేశ్‌లోని బస్తర్ ప్రాంతం పాలకులకు మూల పురుషుడైన అన్నమదేవుడు ప్రతాప రుద్రుని కుమారుడని దిక్పాలదేవుడు చేయించిన దంతేశ్వర (ధంతేవాడ్) శాసనంలో ఉంది.
ప్రతాపరుద్రుడి దుర్మరణం తర్వాత అతని వంశీయులు, వారసులు బస్తర్ ప్రాంతానికి చేరుకున్నారని చెబుతుంటారు.
చరిత్ర ఇలా ఉండగా – కాకతీయవంశాన్ని ఓ వర్గం ఎందుకు సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
తెలుగు సినిమా రంగంలో ఓ సామాజిక వర్గానిదే పై చేయి. అగ్రనటులు, నిర్మాతలు, దర్శకులు వారే.
కాకతీయులు, వారి కులానికే చెందిన వారయితే – పల్నాటి యుద్ధాలు, బొబ్బిలి యుద్ధాలు, కృష్ణదేవరాయల కథలు, అల్లూరి సీతారామరాజులు తీసిన వారు ఇంతకాలం ఎందుకు కాకతీయుల మీద సినిమా తీయలేదు?
ఇప్పుడెందుకు కాతీయుల మీద ప్రేమ ఉప్పొంగుతుంది?
కొన్నేళ్ళ క్రితం ఉత్తర ప్రదేశ్‌లో మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెలరేగిన ఓ వివాదం గుర్తుండే ఉంటుంది.
ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధంలో పాల్గొనలేదని – ఆమె బదులు ఓ దళిత స్త్రీ యుద్ధంలో పోరాడిందనేది ఆ వివాదం.
అలాగే అడవి బిడ్డలైన కాకతీయులని తమ సామాజికవర్గానికి చెందినవారిగా ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు?
అసలు రుద్రమదేవిది ఏ కులం, ఏ ప్రాంతం అయితే ఏంటి? చరిత్రలో నిలిచిన ఓ విశిష్ట వ్యక్తి. ఓ మహిళగా ముధ్య యుగం నాటి సామాజిక కట్టుబాట్లని ఎదుర్కొని, నాలుగు దశాబ్దాల పాటు తెలుగునేలని ఏలిన మహారాణి. ఈ ప్రాంతా న్ని అభివృద్ధి చేసిన నాయకురాలు.
అయితే నాలుగు శతాబ్దాల చరిత్ర కలిగిన భాగ్యనగరాన్ని తామే ఇరవయ్యేళ్ళల్లో అభివృద్ధి చేశామని చెప్పుకున్నట్లు – తెలంగాణా ప్రాంతాన్ని పాలించిన కాకతీయ వంశం తమ కులమేనని – అభివృద్ధి అనేది ఆనాడైనా, ఈనాడు అయినా తాము మాత్రమే చేయగలమని జనాన్ని నమ్మించడానికి జరుగుతున్న సాంస్కృతిక కుట్రా ఇది?
మిగతా వాటిని కబ్జా చేసినట్లుగా – చరిత్రని కబ్జా చేయడం ఏ మేరకు న్యాయం?
– శివరామ్