ఇదేం తీర్పు
భారత సంతతి యువతిపై అమెరికాలో భ్రూణహత్య కేసు…ఇరవై ఏళ్ల జైలు శిక్ష దేశమేదైనా అబార్షన్ చట్టాలు చాలా సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి. భిన్నవ్యక్తిగత, ఆరోగ్య పరిస్థితులు, సున్నిత మానవీయ కోణాలతో దేనికది ప్రత్యేకంగా కనిపించే ఇలాంటి కేసుల్లో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా మరొక ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత్‌నుండి అమెరికా వెళ్లి అక్కడ ఇండియానాలో స్థిరపడిన పూర్వీ పటేల్ అనే మహిళ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. అబార్షన్ అయ్యి బిడ్డను పోగొట్టుకున్న ఆమెపై ఇండియానా […]
భారత సంతతి యువతిపై అమెరికాలో భ్రూణహత్య కేసు…ఇరవై ఏళ్ల జైలు శిక్ష దేశమేదైనా అబార్షన్ చట్టాలు చాలా సందర్భాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి. భిన్నవ్యక్తిగత, ఆరోగ్య పరిస్థితులు, సున్నిత మానవీయ కోణాలతో దేనికది ప్రత్యేకంగా కనిపించే ఇలాంటి కేసుల్లో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా మరొక ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారత్‌నుండి అమెరికా వెళ్లి అక్కడ ఇండియానాలో స్థిరపడిన పూర్వీ పటేల్ అనే మహిళ ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది. అబార్షన్ అయ్యి బిడ్డను పోగొట్టుకున్న ఆమెపై ఇండియానా కోర్టు భ్రూణహత్య, తనపై ఆధారపడిన బిడ్డను నిర్లక్ష్యం చేయడం అనే నేరాలను మోపి 20ఏళ్ల జైలుశిక్షను విధించింది. 2013 జులైలో పుర్వీ పటేల్ అబార్షన్ వలన విపరీత రక్తస్రావంతో మిశ్వాకాలో ఒక మెడికల్ సెంటర్‌లో చేరారు. ఆమెకు అబార్షన్ అయిందని తెలుసుకున్న వైద్యులు తగిన చికిత్స చేశారు. తరువాత ఆమె కావాలనే అబార్షన్‌కోసం ప్రయత్నించి ఉంటారనే అనుమానంతో పోలీసులు ఆమెను విచారించారు. కేసు కోర్టుకు వెళ్లింది. ఆమెకు అబార్షన్ అయిందని, బిడ్డ విగతజీవిగా జన్మించిందని ఆమె తరపు న్యాయవాది వాదించారు. బిడ్డ 22నుండి 24 వారాల వయసులో ఉందని డిఫెన్స్ న్యాయవాది వాదించగా, కాదు ఆమె గర్భస్థ శిశువు వయసు 30వారాలకు పైనే ఉంటుందని ప్రాణాలతో జన్మించిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఆమె ఆన్‌లైన్ ద్వారా అబార్షన్ అయ్యేందుకు మందులు తెప్పించుకుని వాడారంటూ అందుకు ఆమె ఫోన్‌లో ఉన్న మెసేజే సాక్ష్యమని పేర్కొన్నారు. అయితే పూర్వీ శరీరంలో అలాంటి మందుల తాలూకూ ప్రభావం కనిపించలేదని వైద్య పరీక్షల్లో తేలినా ప్రాసిక్యూటర్ వాటిని పక్కకు పెట్టి తాను చూపిన ఆధారాలే నిజమని వాదించారు. సాధారణంగా గర్భిణులకు హాని తలపెట్టిన వారిపై మోపే భ్రూణహత్య నేరాన్నిగర్భిణిపైనే మోపారు. ఇండియానాలో ఈ తరహా నేరంతో శిక్షని పొందిన తొలిమహిళ పూర్వీయే. ఇంతకుముందు ఒక చైనా మహిళపై ఇలాంటి నేరమే మోపినా అది రుజువుకాలేదు. అయితే రెండు కేసులు అమెరికా చట్టాలు గర్భిణుల పట్ల విచక్షణా రహితంగా ఉన్నాయనే విషయాన్ని బయటపెట్టాయి. పోలీసులు పూర్వీని విచారణ జరుపుతున్నప్పటి వీడియోను కోర్టులో ప్రవేశపెట్టేందుకు జడ్జి అనుమతించారు. న్యాయమూర్తుల కమిటి దాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఆ సమయంలో ఆమె ఇంకా పూర్తిగా కోలుకోలేదని, విపరీతమైన రక్తస్రావం జరిగి ఉన్నారని చికిత్స సమయంలో ఇచ్చిన మత్తు తొలగలేదని డిఫెన్స్ న్యాయవాది చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. సోమవారం కోర్టు ఈ తీర్పుని ఇస్తున్న సమయంలో స్థానిక సామాజిక కార్యకర్తలు, చికాగో నుండి ఆగ్నేయాసియా మహిళల హక్కలపై పోరాటం చేస్తున్న ఓ సంస్థ సభ్యులు కోర్టు బయట నిరసన ప్రదర్శన నిర్వహించారు.