ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందే...శివాజీకి రాజకీయపార్టీల మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని పలు రాజకీయ పార్టీలు డిమాండు చేశాయి. బుధవారం హైదరాబాద్‌లో సినీ హీరో శివాజీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అన్నిపార్టీలు, అన్ని వర్గాలు కలిసి ఉద్యమిస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా శివాజీ అన్నారు. ఈ సమావేశానికి రాజకీయ పార్టీల నుంచే కాకుండా మీడియా నుంచి అనేక మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్లమెంట్ సాక్షిగానే ప్రత్యేక […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని పలు రాజకీయ పార్టీలు డిమాండు చేశాయి. బుధవారం హైదరాబాద్‌లో సినీ హీరో శివాజీ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అన్నిపార్టీలు, అన్ని వర్గాలు కలిసి ఉద్యమిస్తేనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభించడం సాధ్యమవుతుందని ఈ సందర్భంగా శివాజీ అన్నారు. ఈ సమావేశానికి రాజకీయ పార్టీల నుంచే కాకుండా మీడియా నుంచి అనేక మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్లమెంట్ సాక్షిగానే ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించిందని, దీన్ని మరిచిపోకూడదని లోక్‌సత్తా జాతీయ కన్వీనర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. హైదరాబాద్ లేకపోవడం వల్లే ఏపీకి నష్టం జరుగుతుందని, దీన్ని పూడ్చాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన అన్నారు. హైదరాబాద్ చుట్టూనే అసలు సమస్య ఉందని… ఆర్థిక సమస్య ఒక్కటే అని చాలామంది అనుకోవచ్చని ఇది ఏ మాత్రం నిజం కాదని జె.పి. చెప్పారు. పాలకుల పొరపాట్ల వల్లే అభివృద్ధి ఒకేచోట కేంద్రీకృతమైందని ఆయన ఆరోపించారు.
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి రమ్మంటే రావడానికి తాము సిద్ధమని, అఖిలపక్షం వెళ్ళి ప్రత్యేక హోదా కోసం డిమాండు చేయాల్సిన అవసరం ఉందని వైకాపా నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్ళాలని ఆయన కోరారు. ఏపీకి న్యాయం జరగాలని ఎవరు కోరుకున్నా తాము అండగా ఉంటామని, ఎవరు పిలిచినా తాము కూడా ఢిల్లీ రావడానికి సిద్ధమని ఏపీ సీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. ఆలస్యం అయ్యే కొద్దీ నష్టం ఎక్కువ జరుగుతుందని అన్నారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన నష్టాన్ని పూడ్చాల్సిన బాధ్యత, తప్పులను సరిదిద్దే బాధ్యత కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీదేనని సీపీఎం నాయకుడు బి.వి. రాఘవులు అన్నారు. సమైక్యవాది చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ విభజన తర్వాత ఏపీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం మానేసిందని, రాష్ట్రం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కేంద్రానికి తెలియజేయాలని చలసాని శ్రీనివాస్ అన్నారు. రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు.-పిఆర్