Telugu Global
POLITICAL ROUNDUP

భూసేకరణ చట్టం ఎవరికోసం?

2015 పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం తను జారీచేసిన 6 ఆర్డినెన్సులకు చట్టరూపం కల్పించేందుకు పూనుకొంది. అందులో భూసేకరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందే పరిస్థితి లేకపోవడంతో మోడీ ప్రభుత్వ అసహనాన్ని చూస్తున్నాం. తాము అభివృద్ధి పథంలోకి దేశాన్ని వేగంగా తీసుకువెళ్ళడానికి చూస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాలు ఎవరికోసం, ఎలాంటి అభివృద్ధిని కాంక్షిస్తున్నాయన్నదే అసలు ప్రశ్న. దేశంలో వలసపాలన కాలంలో 1894 భూసేకరణ చట్టాన్ని బ్రిటిష్‌ పాలకులు తెచ్చారు. దాని ప్రకారమే ఇటీవలి వరకు కేంద్ర, […]

భూసేకరణ చట్టం ఎవరికోసం?
X

2015 పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఎన్‌.డి.ఎ. ప్రభుత్వం తను జారీచేసిన 6 ఆర్డినెన్సులకు చట్టరూపం కల్పించేందుకు పూనుకొంది. అందులో భూసేకరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ఆమోదం పొందే పరిస్థితి లేకపోవడంతో మోడీ ప్రభుత్వ అసహనాన్ని చూస్తున్నాం. తాము అభివృద్ధి పథంలోకి దేశాన్ని వేగంగా తీసుకువెళ్ళడానికి చూస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాలు ఎవరికోసం, ఎలాంటి అభివృద్ధిని కాంక్షిస్తున్నాయన్నదే అసలు ప్రశ్న.

దేశంలో వలసపాలన కాలంలో 1894 భూసేకరణ చట్టాన్ని బ్రిటిష్‌ పాలకులు తెచ్చారు. దాని ప్రకారమే ఇటీవలి వరకు కేంద్ర, రాష్ట్ర పాలకులు భూసేకరణ చేస్తూ వచ్చారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం అవసరమని భావిస్తే ఏ రైతు స్వాధీనంలోని భూమినయినా స్వాధీనం చేసుకునే అధికారాన్ని ఈ చట్టం ఇచ్చింది. బ్రిటన్‌లో ఇలాంటి చట్టమేమీలేదు. వలస దేశాలలోని భూమి, నీరు, ఇతర వనరులపై సంపూర్ణ అధికారం తనదేనని భావించిన బ్రిటన్‌ పాలకులు రైతుల స్వాధీనంలోని ఏ భూమినైనా వారి అనుమతితో ప్రమేయం లేకుండా గుంజుకునే అధికారం ఈ చట్టంద్వారా తీసుకున్నారు.

1947 తర్వాత అధికారంలోకి వచ్చిన ‘స్వతంత్ర’ పాలకులు కూడ వలస పాలకుల భావజాలంతోనే భూసేకరణకు పూనుకున్నారు. దాంతో పలు సందర్భాల్లో నిర్భంధ భూసేకరణ వ్యతిరేకంగా ఆదివాసులు, రైతాంగం తిరగబడ్డారు. పోలీసు కాల్పుల్లో అమరులయ్యారు. ప్రతిఘటించి భూముల్ని కాపాడుకున్నారు.

దీనిపై జరిగిన చర్చ ఫలితంగా కాంగ్రెసు నేతృత్వంలోని యు.పి.ఎ. ప్రభుత్వం 2013లో న్యాయమైన నష్టపరిహారం, భూసేకరణ పారదర్శకత, పునరావాసం, పునఃస్థిరనివాసచట్టం పేరుతో చట్టం తెచ్చింది. పార్లమెంటులో బి.జె.పి.తో సహా చర్చలో పాల్గొని ఆమోదం తెలిపారు.

అయితే 2014 ఎన్నికల్లో బి.జె.పి. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని అమలు చేయడానికి బదులు – ఈ చట్టం తాము కోరుకున్న విధంగా భూసేకరణ చెయ్యడానికి అవరోధంగా వుందని భావించి దీంట్లో సవరణలు చేస్తూ – పార్లమెంటు ముందుకు చర్చకు తేకుండానే రాష్ట్రపతి ముద్ర ద్వారా ఆర్డినెన్సు జారీ చేశారు. దానికి గడువు ముగుస్తుండడంతో పార్లమెంటు ఆమోదం పొందడానికి మల్లగుల్లాలు పడడం మనం చూస్తున్నాం.

2013 చట్టంలో బిజెపి పాలకులకు మింగుడు పడనిదేమిటి?

– ప్రభుత్వ స్వంత అవసరాలకోసం భూసేకరణకు భూములు కోల్పోయే రైతులలో 70 శాతం మంది, ప్రైవేటు వాళ్ళకోసమైతే రైతుల్లో 80 శాతం మంది రైతుల అంగీకారాన్ని ఆ చట్టం తప్పనిసరి చేసింది.

– భూముల స్వాధీనానికి ముందుగా ఆ భూముల్లో సేద్యం ఆగిపోవడం కలిగే నష్టం గురించి, విభిన్న గ్రామీణ సెక్షన్ల ప్రజలపై దాని ప్రభావం గురించి సామాజిక ప్రభావ మందింపు చేయాలంది

– భూసేకరణలో అక్రమాలకు అధికారులెవరైనా పాల్పడితే వారిని వ్యక్తిగతంగా బాధ్యులను చేస్తూ అపరాధ రుసుములు రాబట్టాలని చెప్పింది.

– 5 సం|| లోపల ఆ భూమిని పొందినవారు ఏ ప్రయోజనానికై తీసుకున్నారో, అందుకోసం దాన్ని ఉపయోగంలోకి తేకపోతే తిరిగి స్వాధీనం చేసుకునే హక్కును ప్రభుత్వాన్నికిచ్చింది.

మేకిన్‌ ఇండియా పేరిట స్వదేశ, విదేశీ గుత్త సంస్థలకు తాను కోరుకున్నట్లుగా భూములు రైతుల నుండి గుంజి అప్పజెప్పడానికి పై నిబంధనలు అడ్డం వస్తాయన్న కారణంగానే బిజెపి కొత్త చట్టం తెచ్చింది. ఆటంకాలేమీ లేకుండా, ప్రభుత్వం కోరిందే తడవుగా రైతుల, ఆదివాసుల, అటవీ భూముల్ని కంపెనీలకు అప్పజెప్పడానికి వుద్దేశించిందే ఈ కొత్త చట్టం.

– 2005 సెజ్‌ చట్టంపై కాగ్‌ వెల్లడించిన రిపోర్టు ప్రకారం 566 సెజ్‌లకు భూకేటాయింపులు జరగ్గా అందులో 192 సెజ్‌లలో మాత్రమే ఏదో ఒక మేర పని జరుగుతున్నదనీ- ఆంధ్ర, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లలో భూములు పొందిన కంపెనీలు ఆ భూముల్ని తనఖా పెట్టి 630 కోట్లు అప్పుగా పొందాయనే చెప్పింది. వారు చెప్పినట్లు ఉత్పత్తులు సాగించలేదనీ – ప్రకటించిన సంఖ్యలో 10వవంతుకు కూడ ఉద్యోగాలు కల్పించలేదనీ చెప్పింది. భూముల్ని అక్రమంగా కంపెనీలు అమ్ముకుంటున్న తీరును వివరించింది.

– అందువల్ల ప్రభుత్వాలు సాగిస్తున్న భూసేకరణలోసమిధలవుతున్నదెవరు? ప్రయోజనం పొందుతున్నదెవరు?

1947-2004 మధ్యకాలంలో ఆరుకోట్ల మంది రైతుల భూముల్ని ప్రభుత్వాలు గుంజుకుని నిర్వాసితుల్ని చేశాయి. 5 కోట్ల 25 లక్షల ఎకరాల భూసేకరణ జరిగింది. ఒక్కగుజరాత్‌లోనే 25 లక్షల రైతులు నిర్వాసితులయ్యారు.

మరోవైపు భూములు పొందే బడా కంపెనీలకు ఎకరా 1రూ. చొప్పున ప్రభుత్వాలు భూములు కేటాయించడమేగాదు లక్షల కోట్ల రూ|| పన్ను రాయితీలు, సౌకర్యాలు అలాగే కొత్త మైనింగు పాలసీవల్ల పర్యావరణ ప్రభావంతో ప్రమేయం లేకుండా ఆదివాసుల జీవితాలతో ప్రమేయం లేకుండా మైనింగ్‌ చేసుకోడాన్ని సరళతరం చేసింది కొత్త చట్టం.

ఇన్సూరెన్సు రంగంలోకి 49 శాతం విదేశీ పెట్టుబడుల్ని అనుమతిస్తూ మరోచట్టాన్ని, బొగ్గుగనుల కేటాయింపులకు మరో చట్టాన్ని చేసింది.

ఎన్‌.డి.ఎ. పాలకులు చేస్తున్న ఈ చట్టాలు దేశ ప్రజలపై కలిగించే ప్రభావం ఏమిటి? చంద్రబాబు రాజధానికోసం ముక్కారు పంటలు పండే 30 వేల ఎకరాల భూమిని లాండ్‌ పూలింగ్‌ పేరిట సేకరించాడు. మరో 70 వేల ఎకరాలు సేకరిస్తానంటున్నాడు. 13 జిల్లాలలోను జిల్లాకు లక్ష ఎకరాలు సేకరించి భూ బ్యాంకును ఏర్పాటు చేసి దరఖాస్తు చేసిన విదేశీ కంపెనీకల్లా భూమిని కేటాయిస్తానంటున్నాడు.

(నెల్లూరు ప్రగతిశీల ప్రజావేదిక మార్చి 29 (ఆదివారం) నిర్వహించిన చర్చావేదికలో పలువురు వక్తల అభిప్రాయాల సారాంశమిది).

First Published:  1 April 2015 10:00 AM GMT
Next Story