నా జీవితం...నాఇష్టం
లఘుచిత్రంలో దీపికా పదుకొనె పదునైన వ్యాఖ్యలు నా జీవితం నా ఇష్టం… నాకు నచ్చినట్టుగా బతుకుతాను. 21వ శతాబ్దపు యువతరం స్లోగన్ ఇది. అయితే ఈ మాటల్లో ఒక విచిత్రం ఉంది. ఇవే మాటలను ఒక మగవాడు పలికితే సమాజం ఒకలా అర్థం చేసుకుంటుంది. అదే ఒక స్ర్తీ పలికితే మరోరకంగా భావిస్తుంది.. ఆ అర్థం చేసుకునే విధానాన్ని బట్టే ఇంకా మన సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అసమానత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.అందుకే దీపికా […]
లఘుచిత్రంలో దీపికా పదుకొనె పదునైన వ్యాఖ్యలు
నా జీవితం నా ఇష్టం… నాకు నచ్చినట్టుగా బతుకుతాను. 21వ శతాబ్దపు యువతరం స్లోగన్ ఇది. అయితే ఈ మాటల్లో ఒక విచిత్రం ఉంది. ఇవే మాటలను ఒక మగవాడు పలికితే సమాజం ఒకలా అర్థం చేసుకుంటుంది. అదే ఒక స్ర్తీ పలికితే మరోరకంగా భావిస్తుంది.. ఆ అర్థం చేసుకునే విధానాన్ని బట్టే ఇంకా మన సమాజంలో స్త్రీ పురుషుల మధ్య అసమానత్వం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు.అందుకే దీపికా పదుకొనే ప్రత్యేకంగా ఇలాంటి స్టేట్ మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషయంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ దీపిక ఒక లఘుచిత్రంలో కనిపించారు. మహిళల విషయంలో మగవారి మైండ్‌సెట్ మారాలంటూ ఆమె ఘాటుగా స్పందించారు. మహిళల దుస్తులు, వృత్తి, జీవితం ఇలా అన్నింటా మీ జోక్యం ఎందుకు అని ప్రశ్నించారు. మగవారు తమ బూజు పట్టిన భావాల్లోంచి బయటకు రావాలన్నారు. దినేష్ విజాన్ అనే బాలీవుడ్ దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు. దీపికతోపాటు ముంబయిలోని 99మంది మహిళల అభిప్రాయాలను ఆయన ఇందులో పొందుపరచారు. ఇందులో కనిపించిన వారంతా నల్లని దుస్తులు ధరించి మహిళలు ఎదుర్కొంటున్న వివక్షపై తమ నిరసన వ్యక్తం చేశారు. అసలే ఈ మధ్యకాలంలో తన దుస్తుల విషయంలో అనుచిత కామెంట్లను ఎదుర్కొని ఉన్న ఇరవై తొమ్మిదేళ్ల దీపిక ఇందులో, ప్రతిమనిషిలో సహజంగా ఉండే స్వేచ్ఛాభిలాషను చాలా ముక్కుసూటిగా బయటపెట్టారు. తన దుస్తులు, తన పెళ్లి, వ్యక్తిగత, లైంగిక జీవితాలపై ఎవరి తీర్పులు అక్కర్లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఒక అబ్బాయితో కలిసి ఉంటానా, ఒక అమ్మాయితో కలిసి ఉంటానా అనేది కూడా నా ఇష్టం అన్నారు. ప్రఖ్యాత ష్యాషన్ పత్రిక వోగ్ మహిళా సాధికారత ప్రచారంలో భాగంగా దీన్ని రూపొందించింది.