బలవంతపు భూ సేకరణపై రాష్ట్రపతికి, ప్రధానికి రైతుల మొర
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ఇంటాబయటా చకచకా ఏర్పాట్లు చేస్తుంటే… దానికి అధికారులు తానా తందానా అంటుంటే… కొంతమంది రైతులు మాత్రం పసిడి పండే తమ భూములు ఇవ్వబోమంటూ ఎదురు తిరుగుతున్నారు. ఇలా పంట భూములు ఇవ్వడానికి ఇష్టపడని ఓ వర్గం వాటిని కాపాడుకోవడానికి శతథా ప్రయత్నిస్తుంది. ఇందులో కొంతమంది కోర్టును ఆశ్రయిస్తుంటే… మరి కొంతమంది రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి సమస్యను తీసుకువెళుతున్నారు. రాజధాని నిర్మాణానికి గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి అధికారులు […]
BY admin31 March 2015 12:24 PM IST
admin Updated On: 31 March 2015 12:24 PM IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ఇంటాబయటా చకచకా ఏర్పాట్లు చేస్తుంటే… దానికి అధికారులు తానా తందానా అంటుంటే… కొంతమంది రైతులు మాత్రం పసిడి పండే తమ భూములు ఇవ్వబోమంటూ ఎదురు తిరుగుతున్నారు. ఇలా పంట భూములు ఇవ్వడానికి ఇష్టపడని ఓ వర్గం వాటిని కాపాడుకోవడానికి శతథా ప్రయత్నిస్తుంది. ఇందులో కొంతమంది కోర్టును ఆశ్రయిస్తుంటే… మరి కొంతమంది రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి సమస్యను తీసుకువెళుతున్నారు.
రాజధాని నిర్మాణానికి గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి అధికారులు భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంటే… మరోవైపు బంగారం పండే భూములు తాము ఇవ్వబోమంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. గుంటూరులోనే సింగపూర్ చూపిస్తాం… జపాన్ చూపిస్తాం… అని చంద్రబాబు చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మి తమ పంట పొలాలు ఇవ్వబోమని వారు అంటున్నారు. వరితోపాటు వాణిజ్య పంటలు పండే, అనేక రకాల పండ్ల తోటలు ఉండే భూములను నాశనం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకుందని, ఈ ప్రాంతాన్ని కాంక్రీటు జంగిల్‌గా మార్చేయడానికి చూస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. పట్టడన్నం పెట్టే తమ భూములు ఇచ్చి రోడ్డున పడలేమని 35 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొనే ప్రయత్నం చేయవద్దని, ఇష్టపూర్వకంగా ఇస్తేనే తీసుకోవాలని హైకోర్టు ఇటీవల తీర్పు కూడా ఇచ్చింది. దీనిపై 15 రోజుల్లో నివేదిక కూడా ఇవ్వాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.
ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పే ఇపుడు మరో కొంతమందికి మార్గదర్శకం అయ్యింది. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని మరో 50 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. తమ భూములను బలవంతంగా లాక్కోడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ప్రభుత్వ అధికారుల బారి నుంచి తమను కాపాడాలని వారు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఇంతకుముందు ఇచ్చిన తీర్పే ఇపుడు వీరికి కూడా మార్గదర్శనం వేయవచ్చు. అయితే నిజంగా రాజధానికి ఎంత భూమి కావాలి? లభించిన భూమిని ఎంత మేర సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచన లేకుండా కొన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో తమ భావాలను, బతుకుదెరువుకు ఆధారంగా ఉన్నభూములు పోతే ఎదురయ్యే పరిస్థితులను వివరిస్తూ గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలోని వేలాది మంది రైతులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖలు కూడా రాశారు. -పిఆర్
Next Story