Telugu Global
NEWS

సింగపూర్‌కు ఎపి పరువు తాకట్టు

ఇటీవల మరణించిన ఆధునిక సింగపూర్‌ నిర్మాత, మాజీ అధ్యక్షుడికి నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడే సింగపూర్‌ చేరుకోవాలని రాజకీయంగా నిర్ణయించినప్పటికీ అధికారులు కూడా అందుకు వంతపాడి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం విస్మయం కలిగిస్తోంది. రాజకీయంగా పాలకులు ఎటువంటి నిర్ణయాన్నయినా అప్పటికప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకోవడం ఆనవాయితీనే. అయితే ఆచరణలో అందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ పెద్దలకు నివేదించడం ఉన్నతాధికార యంత్రాంగం బాధ్యత. కానీ ఎపి […]

సింగపూర్‌కు ఎపి పరువు తాకట్టు
X

ఇటీవల మరణించిన ఆధునిక సింగపూర్‌ నిర్మాత, మాజీ అధ్యక్షుడికి నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నాడే సింగపూర్‌ చేరుకోవాలని రాజకీయంగా నిర్ణయించినప్పటికీ అధికారులు కూడా అందుకు వంతపాడి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం విస్మయం కలిగిస్తోంది. రాజకీయంగా పాలకులు ఎటువంటి నిర్ణయాన్నయినా అప్పటికప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకోవడం ఆనవాయితీనే. అయితే ఆచరణలో అందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వ పెద్దలకు నివేదించడం ఉన్నతాధికార యంత్రాంగం బాధ్యత. కానీ ఎపి అధికారులకు ఇదేమీ పట్టలేదు. చంద్రబాబునాయుడుకు ఆలోచన వచ్చిందే తడవుగా కేంద్రంలోని విదేశీ మంత్రిత్వ శాఖకు అనుమతి కోసం నేరుగా ప్రతిపాదించేశారు. ఈ విధమైన ప్రతిపాదనలు పంపించకూడదని నిర్దిష్టమైన నియమావళి ఉన్నప్పటికీ అందుకు విరుద్దంగా అధికారులు వ్యవహరించడం ప్రభు భక్తిని చాటుకోవడమా? లేక పరిపాలనలో అనుభవ రాహిత్యమా?

గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా, యూరప్‌, ప్రపంచ బ్యాంకుకు సాగిలపడేవారని విమర్శ ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత మాట్లాడితే సింగపూర్‌ మంత్రమే జపిస్తున్నారు. భౌగోళికంగా, రాజకీయంగా వాతావరణ పరంగా, జీవన విధానాలు తదితర వ్యవహారశైలుల్లో సింగపూర్‌కు మనకు పోలిక లేకపోయినా ప్రతిదానికీ ఆ దేశంతోనే అన్వయించుకుంటున్నారు. రాష్ట్ర కొత్త రాజధానిని సింగపూర్‌ తరహాలో నిర్మించాలని తహతహలాడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఈ నేపధ్యంలోనే ఆ దేశ మాజీ అధ్యక్షుడు ఇటీవలనే మరణించారు. సింగపూర్‌ను అక్కడి వాతావరణ, పని అవసరాలకు తగిన విధంగా అద్బుతంగా నిర్మించిన శిల్పిగా ఆయన్ను ప్రపంచం మొత్తం కొనియాడుతోంది.

ఆయన పట్ల మనకు ముఖ్యంగా మన ప్రభుత్వానికి, అందులోనూ మన సీఎం గారికి శ్రద్దాసక్తులు ఉండవచ్చు. కానీ ఆయన మన దేశీయుడు కాదు. నేరుగా ప్రభుత్వ హోదాలో ముఖ్యమంత్రి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి సంతాపం ప్రకటించడం సాధ్యం కాదు. ఏ దేశానికి సంబంధించిన అధినేతా లేదా మాజీ నేత మరణించినా ఎవరైనా సంతాపం ప్రకటించవచ్చు. కానీ నేరుగా సందర్శించి నివాళులర్పించడానికి మాత్రం ప్రతి దేశానికీ ఒక విధానం ఉంటుంది. మన దేశానికి సంబంధించి ఎవరు వెళ్లి నివాళులర్పించాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. మరీస్పష్టంగా చెప్పాలంటే రాజకీయంగా ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంటుంది. సింగపూర్‌ అధ్యక్షుడి సంతాప కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అవకాశం లభిస్తే ఆయనతోపాటు ఎవరైనా వెళ్లవచ్చు. ఆ విధంగానే ఎపి ముఖ్యమంత్రికి అధికారికంగా అవకాశం లభించాలి. ఇది నియమావళే కాదు, విదేశీ నియమనిబంధనలతో కూడిన సంప్రదాయం. దీన్ని అన్ని రాష్ట్రాలూ పాటించి తీరాల్సిందే. కానీ చంద్రబాబుకు ఈ విషయం తెలిసి ఉండాల్సిన అవకాశం లేదు. కానీ అధికారులకు మాత్రం స్పష్టంగా తెలిసి తీరాలి.

ఇవేవీ పట్టించుకోకుండా ఆయనకు ఆలోచన వచ్చిందే తడవుగా బుధవారం సింగపూర్‌ వెళ్లిపోయేందుకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేసేశారు. అనుమతి కోసం విదేశీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించి అనుమతి మంజూరు చేయాలంటూ పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేశారు. ఈ ప్రయత్నాలు విదేశీ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు విస్తుపోయారు. అసలు ప్రధాని వెళ్లకముందే మన ముఖ్యమంత్రి వెళ్లాలనుకోవడం నిబంధనలకు విరుద్దం. దాంతో చేసేది లేక విదేశీ మంత్రిత్వ అధికారులు ప్రధాని కార్యాలయానికి ఫైలు పంపించి చేతులు దులుపుకొన్నారు. ప్రధానితో కాని, ఆ తరువాత కానీ వెళ్లేందుకు చంద్రబాబుకు అనుమతి లభిస్తే లభించొచ్చు. కానీ ఇంతవరకూ ఆహ్వానమే లభించలేదు. తొందరపడి ఫైలుపై ప్రతిపాదనను కేంద్రానికి పంపించిన ఉన్నతాధికార యంత్రాంగాన్ని ఏమనాలి? దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ బాధ్యత వహించాలి. నిజానికి ఈ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించిన తీరు పరువు ప్రతిష్టలను మంటగలిపి మరోసారి సింగపూర్‌కు సాగిలపడతామనే భావనకు అద్దం పట్టారు.

First Published:  27 March 2015 7:13 AM IST
Next Story