ఏపీకి ప్రత్యేక హోదా పవన్ తో సాధ్యం: శివాజీ
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తన ఉద్యమం ఆగదని బీజేపీ నాయకుడు, సినీ హీరో శివాజీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకోవాలని ఆయన కోరారు. పవన్ చొరవ తీసుకుంటే రాష్ట్రం అంతా ఆయన వెంట నడుస్తుందని, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా దీన్ని నడపాలని ఆయన పిలుపు ఇచ్చారు. విజయవాడలో ఆయన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన అనేక మంది […]
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు తన ఉద్యమం ఆగదని బీజేపీ నాయకుడు, సినీ హీరో శివాజీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకోవాలని ఆయన కోరారు. పవన్ చొరవ తీసుకుంటే రాష్ట్రం అంతా ఆయన వెంట నడుస్తుందని, తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా దీన్ని నడపాలని ఆయన పిలుపు ఇచ్చారు. విజయవాడలో ఆయన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. తెలుగువారి బాగుకోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడి తీరాల్సిందేనని ఆయన అన్నారు. ఆనాడు ప్రత్యేక హోదా కోసం ప్రకటనలు చేసిన నాయకులంతా ఈరోజు కేంద్ర మంత్రులుగా హోదా పొందారని, ఇపుడు వారెవరూ మాట్లాడడం లేదని ఆయన అన్నారు. ఉద్యమానికి అందరి మద్దతు కావాలని ఆయన అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తే అందరూ త్యాగాలకు సిద్ధం కావాలని, ఇలాంటి పరిస్థితి ఏర్పడితే తాను అందులో ఒకడిగా ఉంటానని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన అన్నారు. బీజేపీ నాయకుడిగా ఉండి శివాజీ చేస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని మాజీ ఎంపీ విద్య అన్నారు. అందరూ మరిచిపోయిన బీజేపీ హామీలను గుర్తు చేయడమే కాక రాష్ట్ర ప్రజల లభివృద్ధి లక్ష్యంగా శివాజీ చేస్తున్న ఉద్యమం అభినందనీయమని వైకాపా నాయకుడు గౌతంరెడ్డి అన్నారు. ఇదే విషయంపై మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు కాపాడాలని ప్రయత్నించినా వారికి తమ పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం నాయకుడు పట్టాభి తెలిపారు. – పి.ఆర్.