తెలివితక్కువ దద్దమ్మ
రఘు అమాయకుడు. తెలివి తక్కువ వాడు. ఒక రోజు తన ఊరి నుంచీ తన అత్తగారి ఊరు బయల్దేరాడు. కాలినడకన వెళ్లాడు. ఎక్కడ సమస్యలు కొని తెచ్చుకుంటాడో అని ఇంట్లో వాళ్లు ఎవరితోనైనా అతి తక్కువగా మాట్లాడమని, వీలైతే రెండు మాటలు మాత్రమే మాట్లాడమని చెప్పారు. అవి అవును, కాదు. కానీ ఎవరు కనిపించినా మర్యాద పాటించడం మరిచిపోవద్దన్నారు. ఎవరు ఎదురైనా ‘నమస్కారం’ చెప్పమన్నారు. తెలివి తక్కువ వాడు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దారిలో పోతూ ఉంటే ఒక వేటగాడు దారి పక్కన […]
రఘు అమాయకుడు. తెలివి తక్కువ వాడు. ఒక రోజు తన ఊరి నుంచీ తన అత్తగారి ఊరు బయల్దేరాడు. కాలినడకన వెళ్లాడు. ఎక్కడ సమస్యలు కొని తెచ్చుకుంటాడో అని ఇంట్లో వాళ్లు ఎవరితోనైనా అతి తక్కువగా మాట్లాడమని, వీలైతే రెండు మాటలు మాత్రమే మాట్లాడమని చెప్పారు. అవి అవును, కాదు.
కానీ ఎవరు కనిపించినా మర్యాద పాటించడం మరిచిపోవద్దన్నారు. ఎవరు ఎదురైనా ‘నమస్కారం’ చెప్పమన్నారు.
తెలివి తక్కువ వాడు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు.
దారిలో పోతూ ఉంటే ఒక వేటగాడు దారి పక్కన కనిపించాడు. ఒక చెట్టు కింద అతను పిట్టలు పట్టడానికి వల వేశాడు. పిట్టలన్నీ మెల్లగా వల మీద వాలే సమయానికి రఘు ఆ వేటగాణ్ణి చూశాడు. చూస్తూనే వెంటనే పెద్ద స్వరంతో నమస్కారం అని అరిచాడు. ఆ అరుపుతో వల మీద వాలబోయిన పిట్టలన్నీ ఎగిరిపోయాయి. నోటికి అందే తిండి జారిపోయినందుకు వేటగాడికి పట్టరాని కోపం వచ్చింది. పరిగెత్తుకుంటూ వెళ్లి రఘు వీపు మీద ఒక గుద్దు గుద్దాడు.
ఆ దెబ్బతో అదిరిపోయిన రఘు ‘పొరపాటయింది. మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే మన్నించండి. మనిషి ఎదురుపడితే మర్యాద పాటించాలని చెప్పారు. ఎవరైనా ఎదురుపడితే ఏం చెప్పాలో మీరే సెలవియ్యండి’ అన్నాడు.
వేటగాడు నువ్వు వెళుతూ ఉంటే ఎవరైనా ఎదురుపడితే ‘మీరు ఆగకండి వస్తూనే ఉండండి’ అని చెప్పు అన్నాడు.
రఘు ఆలోచించుకుంటూ ముందుకు సాగాడు. అతని ఎదురుగా ఒక దొంగల గుంపు వచ్చింది.రఘు వాళ్లని చూసి ‘రండి. ఆగకండి. వస్తూనే ఉండండి’ అన్నాడు. దొంగలకు మండిపోయింది.తమని చూసి ఎగతాళి చేస్తున్నాడనుకుని రఘుని మెత్తగా కొట్టారు.
రఘు బిత్తరపోయి ‘మరి ఎవరైనా కనిపిస్తే ఏం చెప్పమంటారో మీరే చెప్పండి’ అన్నాడు కళ్లు తుడుచుకుంటూ.దొంగలు ‘అట్లా తెస్తూనే ఉండండి. సేకరిస్తూనే ఉండండి’ అని చెప్పమన్నారు.
రఘు దిక్కులు చూస్తూ బిక్కుబిక్కుమంటూ వెళుతూ ఉంటే దారిలో ఒక గుంపు శవాన్ని మెసుకొస్తూ ఎదురొచ్చింది.
రఘు వాళ్లని చూసి ‘అట్లా తెస్తూనే ఉండండి. సేకరిస్తూనే ఉండండి’ అన్నాడు.
గుంపు ఆగ్రహంతో పిడిగుద్దులు గుద్దారు. మొఖం వాచిపోయింది.
రఘు ఏడస్తూ ‘ఎందుకు కొడతారు. మీరే చెప్పండి. ఎవరైనా ఎదురుపడితే ఏం చెప్పమంటారో’ అన్నాడు.
వాళ్లు ‘ఇది ఎప్పుడూ మళ్లీ జరగకూడదు’ అని చెప్పమన్నారు.
రఘు ఒళ్లు నొప్పుల్తో బాధతో వెళుతూ ఉంటే ఒక పెళ్లి ఊరేగింపు వచ్చింది.అందంగా అలకరించిన వరుడు, వధువు గుర్రం మీద ఉన్నారు. ముందు మంగళవాయిద్యాలు,నాట్యాలు మోగుతున్నాయి, సాగుతున్నాయి.
రఘు ఆ దృశ్యాన్ని చూసి ‘ఇది ఎప్పుడూ మళ్లీ జరగకూడదు’ అన్నాడు. పెళ్లి గుంపు అతన్ని చివాట్లు పెట్టింది. కొట్టింది. రఘు చావు తప్పి కన్ను లొట్టబోయింది. మొఖం వాచింది.
మొదట ఇంట్లో చెప్పిన రెండు మాటలు మాత్రమే మాట్లాడి ఉంటే తనకీ బాధలు తప్పేవి కదా! అనుకుంటూ అత్తగారి ఊరు చేరాడు.
తలుపు తడుతూనే అత్తగారు తలుపు తీసింది. రఘు పరిస్థితి గమనించి ఆమె ‘అల్లుడు గారూ! మీరు బాగానే ఉన్నారు కదా!’ అంది.
రఘు ‘అవును’ అన్నాడు.
అత్తగారు ‘మా అమ్మాయికి బాగానే ఉందా!’ అంది.
రఘు ‘లేదు’ అన్నాడు.
‘నా బిడ్డ జ్వరంతో బాధపడుతోందా!’
‘అవును’
‘ఐతే అమ్మాయి ఆరోగ్యం బాగోలేదా’
‘లేదు’ అన్నాడు.
ఎంత సేపటికీ అల్లుడు అవును, కాదు అని పొడిపొడి మాటలు మాత్రమే మాట్లాడుతుంటే అత్తగారికి సందేహం మొదలైంది. కొంపదీసి తన కూతురికి అనుకోనిది ఏదైనా జరిగిందేమో అని అనుమానం కలిగింది.
వెంటనే దిగులుపడిపోయి ఏడుస్తూ ‘కొంపదీసి నా బిడ్డ చనిపోయిందా!’ అంది.
రఘు ‘అవును’ అన్నాడు.
ఇక అత్తగారు ఏడుపు ఆపుకోలేకపోయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. వీధిలో జనమంతా గుంపు చేరారు. ఎక్కడికో వెళ్లిన మామ వచ్చాడు. అందరూ ఏడవడం, కళ్లు ఒత్తుకోవడం మొదలుపెట్టారు.
మొత్తానికి కొద్ది గంటల్లోనే ఈ వార్త రఘు ఇంటికి చేరింది. ఇదంతా రఘు తెలివి తక్కువ వల్లనే జరిగి ఉంటుందని రఘు తల్లిదండ్రులు గ్రహించారు. వెంటనే కోడల్ని తీసుకుని బయల్దేరారు.
కూతుర్ని కళ్ల ముందు చూసిన వెంటనే ఆనందం పట్టలేక తల్లి కూతుర్నికౌగిలించుకుంది. అందరూ ఒక దగ్గర చేరినందుకు అందరూ ఆనందించి విందు వినోదాల్తో గడిపారు. ఎవరూ రఘు తెలివి తక్కువ గురించి పట్టించుకోలేదు. కానీ ఏం చెయ్యాలన్నా భార్యను సంప్రదించి చెయ్యమని మాత్రం చెప్పారు.
– సౌభాగ్య