Telugu Global
Family

చేసిన సాయం

చేసిన సాయం ఊరికే పోదు. దానికి ఎప్పుడూ ఫలితముంటుంది. దయతో చేసిన సాయం దైవం దృష్టిలో ఉంటుంది. ఒక రాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఆరు మంది కొడుకులు. రెండో భార్యకు ఒక కొడుకు. అతని పేరు ఆనందుడు. మొదటి భార్య కొడుకులు కలిసి ఆడుకునే వారు. కానీ ఆనందుణ్ణి పట్టించుకునే వాళ్లు కాదు. ఆనందుడు దగ్గరికి వచ్చినా తమలో తాము కలిసి ఉండే వాళ్లు కానీ అతన్తో ఆడుకునే వాళ్లు కాదు. అందరూ యువకులయ్యారు. […]

చేసిన సాయం ఊరికే పోదు. దానికి ఎప్పుడూ ఫలితముంటుంది. దయతో చేసిన సాయం దైవం దృష్టిలో ఉంటుంది. ఒక రాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఆరు మంది కొడుకులు. రెండో భార్యకు ఒక కొడుకు. అతని పేరు ఆనందుడు. మొదటి భార్య కొడుకులు కలిసి ఆడుకునే వారు. కానీ ఆనందుణ్ణి పట్టించుకునే వాళ్లు కాదు. ఆనందుడు దగ్గరికి వచ్చినా తమలో తాము కలిసి ఉండే వాళ్లు కానీ అతన్తో ఆడుకునే వాళ్లు కాదు. అందరూ యువకులయ్యారు. ఒక రోజు నగరం వదిలి దూర ప్రాంతాలు చూసి వద్దామని గుర్రాలపై బయలుదేరారు. ఆనందుడు కూడా వాళ్ల వెనకే బయలుదేరాడు. కొన్ని మైళ్ల దూరం వెళ్లిన తర్వాత వాళ్లు ఒక అందమైన లోయలోకి ప్రవేశించారు. విశాలమైన మైదానాలు, జలపాతాలు, రంగు రంగుల పిట్టలు, సీతాకోక చిలుకలు, మధుర పరిమళాల్ని ప్రసరించే పూలతో ఆ పరిసరం మనోహరంగా ఉంది. ఆ దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మంత్రముగ్ధులయ్యారు. రాజు మొదటి భార్య మొదటి కొడుకు ‘దీన్ని మనం ఆడుకోవడానికి మంచి మైదానం చేస్తే బావుంటుంది’ అన్నాడు. రెండో వాడు ‘ఇంత ఖాళీ స్థలముంది కదా! ఇక్కడ పంటలు పండిస్తే బావుంటుంది’ అన్నాడు. అట్లా తలా ఒక మాట చెప్పారు. ఆనందుడు ‘ఈ కొండల మధ్య ప్రశాంతమైన నగరాన్ని నేను నిర్మిస్తాను. కంటి ముందే కొండలు, జలపాతాలు, చెట్లు ఉంటే బావుంటుంది’ అన్నాడు. తక్కిన ఆరు మంది అతని ఆలోచనలకు నవ్వి ‘నువ్వ నగరాన్ని నిర్మించేంత మొనగాడివా! సరే. ఐతే ఉండి నగరాన్ని నిర్మించి దాన్ని పాలించుకో’ అని ఆనందుణ్ణి ఒక చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు. ఇంటికి వెళుతూనే ఆనందుడి తల్లి కొడుకు గురించి వాకబు చేసింది. వాళ్లు నవ్వుతూ ‘ మీ కొడుకు అక్కడే రాజ్యాన్ని పాలిస్తున్నాడు’ అన్నారు. ఆనందుడు అటూ ఇటూ కదల్లేక తన పరిస్థితికి దిగులుపడ్డాడు. ఉన్నట్లుండి అతని మనసులో ఒక ఆలోచన మొదలైంది.
కొన్నాళ్ల క్రింత రాజధానిలో ఎలుకల బెడద ఎక్కువైతే ఒక్క ఎలుక కూడా మిగలకుండా అన్నిట్నీ మట్టుబెట్టాలని రాజు ఆదేశించాడు. ఆ సందర్భంలో ఆనందుడు ఒక ఎలుకను రహస్యంగా కాపాడాడు. తనకు ప్రాణదానం చేసినందుకు ఆ ఎలుక ఆనందుడి పట్ల కృతజ్ఞతతో కష్టం వచ్చినప్పుడు కాపాడుతానని హామీనిచ్చింది. ఆనందుడికి ఆ సంగతి గుర్తువచ్చి ఎలుకను తలుచుకున్నాడు. వెంటనే ఎలుక అతని ముందు ప్రత్యక్షమైంది. అతని పరిస్థితిని చూసి తన వాడిపళ్లతో అతన్ని కట్టిన తాడు కొరికి అతనికి విముక్తి కలిగించింది. ఆనందుడికి ఎందుకో ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఆ చెట్టు కిందే పడుకున్నాడు. కునుకు పడుతోంది. అంతలో ఆకాశంలో వెళుతున్న పార్వతీపరమేశ్వరులు అతన్ని చూశారు. పార్వతి ఆనందుణ్ణి చూసి ‘ఆ కురాడ్రు ఎన్ని బాధలు పడుతున్నాడు. అతన్ని కరుణించండి’ అంది. శివుడు ‘నువ్వు ఎవర్ని చూసినా జాలిపడతావు. నీది మెత్తని మనసు. కానీ మనుషుల జీవితాలు వాళ్ల కర్మానుసారంగా ఉంటాయి’ అన్నాడు. పార్వతి ‘కావచ్చు కానీ అతని భవిష్యత్తేమిటి!’ అంది. ‘ఆ చెట్టు మీద ఒక పిట్ట వాలుతుంది. దాని కడుపులో ఒక ఉంగరం ఉంది. దాని మీద అతని భవిష్యత్తు ఆధారపడి ఉంది’ అన్నాడు. నిద్రలోకి వెళుతున్న ఆనందుడు ఆ మాటలకు ఉలిక్కిపడ్డాడు. అప్పుడే ఒక పిట్ట వచ్చి చెట్టు మీద వాలింది.
ఆనందుడు ఒక రాయి తీసుకుని గురి చూసి పిట్టను కొట్టాడు. అది తగిలి పిట్ట నేల మీద పడింది. దాని కడుపులో ఒక ఉంగరం దొరికింది. ఆనందుడు ఆ ఉంగరాన్ని తన ముందుంచి చేతులు జోడించి ‘దేవా? ఇక్కడ ఒక మనోహరమైన నగరాన్ని సృష్టించు’ అని ప్రార్ధించాడు. అంతే! అద్భుతమైన నగరం అక్కడ ప్రత్యక్షమైంది. ఆనందుడు ఆ నగరాన్ని పాలిస్తూ ఆనందంగా జీవించాడు. కొన్నాళ్లకు మొదటి రాణి కొడుకులకు ఆనందుడు ఏమయ్యాడో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. సేవకుల్ని పంపితే అక్కడొక అద్భుత నగరం వెలిసిందని దాన్ని ఆనందుడు పాలిస్తున్నాడని చెప్తారు. ఆ మాటల్తో రాజ కుమారులు ఈర్ష్య పడ్డారు. ఉడికిపోయారు. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నారు. వాళ్ల దగ్గర ఒక విశ్వాస పాత్రురాలైన మంత్రగత్తె ఉంది. ఆమెను పిలిచి విషయం వివరించి ‘ఇదంతా ఎట్లా జరిగిందో దాని గుట్టు నువ్వు కనిపెట్టాలి’ అని పంపారు. ఆ మంత్రగత్తె మారు వేషంలో అంత:పురంలోకి వెళ్లి రాణిని కలిసి తాను దూరపు బంధువునని చెప్పింది. రాణి గుర్తుపట్టలేదు. ఐనా ఆమెను తనతో ఉండమంది. కొన్నాళ్లకి మంత్రగత్తె రాణికి బాగా దగ్గరయింది. ఆమె రాణితో ‘ఈ నగరం ఎలా ఏర్పడిందో మీకు తెలుసా?’ అంది. రాణి ‘ఈ విషయం గురించి ఎప్పుడూ నేను ఆలోచించలేదు’ అంది. మంత్రగత్తె ‘ఈసారి మీ ఆయన వచ్చినప్పుడు నలతగా ఉందని పడుకోండి. రాజు గారు మీ దగ్గరికి వచ్చినప్పుడు విషయం రాబట్టండి’ అంది. రాణి అట్లా చేసింది. రాజు నగరం ఎలా రూపొందిందో చెప్పాడు. ఆ విషయం రాణి మంత్రగత్తెతో చెప్పింది.
మంత్రగత్తె ‘రాణి గారూ! మరోలా అనుకోకండి. రాజు గారు ఎప్పుడూ పనుల ఒత్తిడిలో ఉంటారు. కాబట్టి ఆ అద్భుత శక్తివంతమైన ఉంగరం రాజు గారి దగ్గర కన్నా మీ దగ్గర ఉండటం మేలు. కాబట్టి ఆ ఉంగరాన్ని మీరు ధరించండి’ అంది. రాణి అమాయకంగా రాజు గారిని ఉంగరం అడిగింది. ఆనందుడు ‘అంత కంటేనా!’ అని ఆ ఉంగరాన్ని రాణికిచ్చి భద్రపరచమన్నాడు. రాణి మంత్రగత్తె అన్నీ తన మంచికే చేస్తోందని నమ్మింది. ఆ ఉంగరాన్ని తన వేలుకు ధరించింది.
ఒక రోజు రాణి నిద్ర లేచే సరికి తన వేలుకి ఉంగరం లేదు. మంత్రగత్తే లేదు. మంత్రగత్తె ఆ ఉంగరం తీసుకుని ఆ నగరం సరిహద్దు దాటి గుర్రం మీద దౌడు తీసింది. మంత్రగత్తె నగరం దాటిన మరుక్షణం నగరం మాయమైపోయింది. చెట్టు కింద ఆనందుడు ఒక్కడే మిగిలాడు. తన దురదృష్టం గురించి చింతిస్తూ పడుకున్నాడు. మంత్రగత్తె పరుగున వెళ్లి రాజకుమారులకు ఉంగరాన్ని ఇచ్చి విషయం వివరించింది. రాజకుమారులు ఆమెను సత్కరించి ఉంగరాన్ని పెద్దవాడికి ఇచ్చారు. చెట్టు కింద పడుకున్న ఆనందుడు బాధపడుతూ ఉంటే ఎలుక ప్రత్యక్షమైంది. ‘ఏమైంది మిత్రమా!’ అని అడిగింది. ఆనందుడు విషయం చెప్పాడు. ఎలుక ‘దిగులుపడకు’ అని ఉంగరాన్ని అన్వేషిస్తూ రాజధానికి వచ్చింది. రాజకుమారుల్లో పెద్దాడు ఆ ఉంగరాన్ని తన పళ్ల మధ్య పెట్టుకుని పడుకున్నాడు. నిద్రపోతూ నోరు తెరిచినప్పుడల్లా ఆ ఉంగరం కనిపించేది. ఎలుక ఏం చెయ్యాలా అని ఆలోచించింది. తన తోకతో అతని ముక్కు రంధ్రంలో కెలికింది. దాంతో అతను హాచ్‌! అని తుమ్మాడు. ఆ తుమ్మిన దెబ్బకు నోట్లోని ఉంగరం కిందపడింది. ఆ ఉంగరాన్ని తీసుకుని ఎలుక పరిగెత్తింది. ఆనందుని దగ్గరకు వచ్చి ఆ ఉంగరాన్ని ఇచ్చింది. ఆ ఉంగరాన్ని దగ్గరుంచి ప్రార్ధించాడు. ఎప్పట్లా మనోహరమైన నగరం కళ్ల ముందు నిలిచింది. తనకు ఇంత ఉపకారం చేసిన ఎలుకను తన మంత్రిగా ఆనందుడు పెట్టుకున్నాడు.
-సౌభాగ్య‌

First Published:  23 March 2015 8:48 AM IST
Next Story