జగన్‌కు మైలేజీ ఇచ్చిన పట్టిసీమ!
ప్రభుత్వాధినేత చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో అడ్డంగా దొరికిపోయారు. ప్రతిపక్ష నేతగా వై.ఎస్. జగన్ నిజంగా విజయం సాధించినట్టే లెక్క. ఇది ఆయన ఖాతాలో తొలివిజయంగా చెప్పుకోవచ్చు. అలాగే బాబుకు తొలి అపజయంగా భావించాలి. పట్టిసీమ వ్యవహారంలో వైకాపా తొలి నుంచీ పట్టుదలగానే ఉంది. వెనకడుగు వేయాల్సి వచ్చిన ప్రతిసారీ గట్టిగా నిలబడింది. చివరికి తమ సభ్యులు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ పట్టు వదలలేదు. బెదిరిస్తున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేసినా వెనుకడుగు వేయలేదు. మొదటిరోజు […]
ప్రభుత్వాధినేత చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో అడ్డంగా దొరికిపోయారు. ప్రతిపక్ష నేతగా వై.ఎస్. జగన్ నిజంగా విజయం సాధించినట్టే లెక్క. ఇది ఆయన ఖాతాలో తొలివిజయంగా చెప్పుకోవచ్చు. అలాగే బాబుకు తొలి అపజయంగా భావించాలి. పట్టిసీమ వ్యవహారంలో వైకాపా తొలి నుంచీ పట్టుదలగానే ఉంది. వెనకడుగు వేయాల్సి వచ్చిన ప్రతిసారీ గట్టిగా నిలబడింది. చివరికి తమ సభ్యులు అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ పట్టు వదలలేదు. బెదిరిస్తున్నారని, అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేసినా వెనుకడుగు వేయలేదు. మొదటిరోజు సీఎం చంద్రబాబు బెదిరించేట్టుగానే మాట్లాడారు. తర్వాత రోజు ఓపిగ్గా సమాధానం చెప్పినట్టు కనిపించారు. అయితే అందులో నిజాలు లేవన్న విషయాన్ని బలంగా వైకాపా నాయకుడు చెప్పగలిగారు. జవాబులు చెప్పలేని అనేక ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో రభస జరిగింది…, ఇరు వర్గాలు హద్దులు మీరి తిట్టుకున్నారు.., వీడియో క్లిప్పింగ్‌లు విడుదల చేయాలని ఇరువర్గాలు పట్టుబట్టాయి. నేపథ్యం ఎంత సీరియస్‌గా జరుగుతున్నా పట్టిసీమ టెండర్ వ్యవహారాలు బాగానే తెరపైకి తేగలిగారు జగన్ మోహన రెడ్డి. పట్టిసీమ వల్ల పోలవరం ఆగుతుందా, సాగుతుందా, లేదా పట్టిసీమ వల్ల నిజంగా రాయలసీమకు నీరు అందుతుందా అందదా అన్నది పక్కన పెడితే 1300 వందల కోట్ల ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు పభుత్వం ఏదో పొరపాటు చేసిందనే భావన ప్రజల్లో నాటుకుపోయేట్టు చేయగలిగారు ప్రతిపక్షనేత జగన్. ముఖ్యంగా కాంట్రాక్టరు ఏడాది లోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి 16.9 శాతం బోనస్ తాయిలం ఇవ్వడమేంటి అని నిలదీశారు.
నిజంగా ఈ ప్రాజెక్టును యేడాది లోపు పూర్తి చేయాలన్న సత్సంకల్పం ఉండవచ్చు. కాని ప్రజాదనాన్ని అప్పనంగా కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాల్సిన పని ఏమిటి అని ప్రశ్నించి ఆలోచింపజేశారు. ఏడాదిలోపు పూర్తి చేయగలిగిన వారికే కాంట్రాక్టు ఇస్తాం.. చేయలేకపోతే పెనాల్టీగా ఇంత విధిస్తాం. సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయకపోతే బ్లాక్ లిస్టులో పెడతాం వంటి సవాలక్ష నిబంధనలు విధించవచ్చు. అంతే కానీ ప్రజాదనాన్ని ముఖ్యంగా 16.9 శాతం అంటే… దాదాపు 200 కోట్లు అప్పనంగా కాంట్రాక్టరుకు బోనస్ రూపంలో ఇస్తామనడం ఏమిటి? ఈ ప్రశ్న కచ్చితంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేదే. అదే విధంగా ‘ప్రాజెక్టు కడతామంటున్నారు. కాల్వల కోసం పోలవరం కాల్వలు వాడుకుంటామంటున్నారు. అంతా బాగుంది. మరి కాలువల నుంచి తీసుకెళ్లిన నీరు ఎక్కడ నిల్వ చేస్తారు?’ అంటూ మరో కీలకమైన ప్రశ్న జగన్ సంధించారు. దీనికి సమాధానం ఏది? ఇది కూడా ఆలోచించాలి కదా. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమ నీటి అవసరాలు తీరతాయని ప్రభుత్వం చెబుతోంది. ఆ విషయాన్ని జీవోలో ఎందుకు ప్రస్తావించలేదన్న దానికి కూడా ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. నీరు మళ్లించాలన్న ఆలోచన మంచిదే. కానీ అది రాయలసీమ దాకా వెళ్తుందా అన్నది ప్రభుత్వానికే నమ్మకం లేదని ఈ విషయం చెప్పకనే చెబుతోంది. అసలు విభజన కారణంగా నాగార్జునసాగర్ నీటి సమస్య దక్షిణ కోస్తాకు ఎదురవుతుంది కాబట్టి వారి కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారా అన్న సందేహం కూడా లేకపోలేదని వైకాపా నేతలంటున్నారు. ఏదేమైనా ఈ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు అత్యుత్సాహం ప్రదర్శించి అభాసు పాలయ్యారనడంలో సందేహం లేదు.