మీ పాలన మంచిగ లేదు
కాంగ్రెస్కు నెటిజన్లు షాక్.. 'ఎక్స్' పోల్లో బోల్తా కొట్టిన హస్తం పార్టీ
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు బాగాలేదని నెటిజన్లు ముఖం మీద కుండబద్దలు కొట్టారు. గడీల గోడల బద్దలు కొట్టామని.. ప్రజలకు పాలన చేరువ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? అని కాంగ్రెస్ పార్టీ అధికారిక 'ఎక్స్' హ్యాండిల్ 'తెలంగాణ కాంగ్రెస్'లో గురువారం ఉదయం ఒపీనియన్ పోల్ నిర్వహించారు. ఆప్షన్లుగా ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అని ఇచ్చారు. ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ను ఇండికేట్ చేస్తూ.. తమది ప్రజా పాలన అన్నట్టుగా ఆన్సర్లను ఆప్షన్లుగా ఇచ్చింది. నాలుగు గంటల్లో 44,181 మంది నెటిజన్లు ఓటింగ్లో పాల్గొనగా వారిలో 68.8 శాతం మంది ఫామ్ హౌస్ పాలనే బాగుంది అని తేల్చిచెప్పారు. కేవలం 31.2 శాతం మంది మాత్రమే కాంగ్రెస్ పాలనకు అనుకూలంగా ఓటు వేశారు. ఉదయం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసిన పర్సంటేజీ ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ అనుకూల హ్యాండిల్స్ నుంచి తమ పోస్టుకు పాజిటివ్ ఓటు వేయించే ప్రయత్నం చేశారు. అయినా మెజార్టీ నెటిజన్లు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తూ పోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ పడిపోయింది.